జర నవ్వండి ప్లీజ్ 31

అవార్డులు
”అవార్డులు రావడం గురించి మీ అభిప్రాయం ఏమిటి?” అని ఒక పత్రికా విలేకరి అడిగినప్పుడు,
”అవి రావు, కావల్సిన వాళ్ళు కష్టపడి సంపాదించుకోవాలి’ అన్నారు ‘వరద’

************
పత్ని
‘వరద’ ఉద్దేశంలో పత్నులు మూడురకాలు – ‘ధర్మపత్ని’, ‘అధర్మపత్ని’, ‘ఆపద్ధర్మ పత్ని’!
************
”నీసువాసన”
ఓసారి మా అన్నయ్య కూతురు వచ్చింది మా ఇంటికి హాస్టల్‌ నుంచి. నేను దానితో కూర్చుని మాట్లాడుతున్నాను. ఆయన లోపలి నుంచి అక్కడకి వస్తూనే ”ఏమిటే నీసువాసన వేస్తోంది?” అన్నారు మొహం అదోలాపెట్టి. మేమిద్దరం ఇటూ అటూ వాసన పీల్చి చూశాం. ఏమీ అనిపించలేదు.
”మీకెక్కడ నుంచి వేస్తోంది మావయ్యగారూ”? అంది మా అన్నయ్య కూతురు. ”నువ్వు ‘నీస్‌’వి కదుటే, నువ్వు రాగానే ‘నీసువాసన’ వెయ్యదూ?” అన్నారు నవ్వుతూ.
************
రచన
న్యూఢిల్లీలో డా|| సర్వేపల్లి రాధాకృష్ణన్‌ రాష్ట్రపతిగా ఉండగా ఓసారి మేమిద్దరం ఆయన్ని చూడటానికి రాష్ట్రపతి భవన్‌కి వెళ్ళాం. మమ్మల్ని ఆప్యాయంగా ఆహ్వానించి, ”నాయనగారు బాగు న్నారా? ఏమైనా రాస్తూన్నారా? అని అడిగారు డా|| రాధాకృష్ణన్‌ ‘వరద’ని. ”ఆ, నిన్ననే వచ్చిం దండి ”ఆయన ఉత్తరం” అన్నారు ‘వరద’ వెంటనే.

************
బిల్‌పేపర్‌
‘నిమ్స్‌’ ఆసుపత్రిలో శ్వాసకోశ వ్యాధితో పడుతున్న బాధకన్న, ముక్కులో – నోట్లో గొట్టాలతో మాట్లాడ్డానికి వీల్లేకుండా ఉన్నస్థితిలో అంతకంతకు నిస్పృహకి లోనవుతూంటే, ”మీకు ‘విల్‌పవర్‌’ ఉండాలండీ, అప్పుడే తొందరగా కోలుకుంటారు” అన్నాను ధైర్యం చెబుతూ. ”బిల్‌ పవర్‌” కూడా ఉండాలి” అని రాశారు నోట్‌బుక్‌లో. అదే ఆయన ఆఖరి హాస్యోక్తి.