బీసీ సబ్‌ప్లాన్‌కు శ్రీకారం: మంత్రి కొల్లు

రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందికర పరిస్థితులున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీ సంక్షేమానికి పెద్దపీట వేశారని, అందుకోసం రూ. 6,440 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌కు శ్రీకారం చుట్టారని బీసీ సంక్షేమ, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ 21 ప్రభుత్వ విభాగాలకు బడ్జెట్‌లో బీసీ సబ్‌ప్లాన్‌కు దేశంలో మొదటిసారిగా 20 శాతం నిధులు కేటాయించారన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రైతాంగానికి ప్రయోజనం చేకూరుతుందని, ఇక్కడ ఆదా చేసే నీటిని రాయలసీమకు తరలించడం ద్వారా ఆ ప్రాంతం కూడా సస్యశ్యామలం అవుతుందన్నారు. కొత్త ఎక్సైజ్‌ పాలసీకి జూన్‌ చివరి వరకు సమయముందని, ఇప్పటికే మూడు బృందాలు తమిళనాడులో ఆ విధానాన్ని పరిశీలించి వచ్చాయని మంత్రి అన్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో మరో టీం తమిళనాడు వెళ్తుందని, అవసరమైతే తాను కూడా వెళ‌తాన‌ని అన్నారు.-పీఆర్‌