వేతన సవరణపై ఆర్టీసీ కార్మికుల చర్చలు విఫలం

వేతన సవరణ ప్రధాన డిమాండ్‌గా ఆర్టీసీ యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో గురువారం బస్‌భవన్‌ను ముట్టడించేందుకు కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. ఎంప్లాయీస్‌ యూనియ‌న్‌-టీఎంయూ నేతలు బుధవారం బస్‌భవన్‌లో ఎండీ సాంబశివరావు, ఇతర ఈడీలతో వేతన సవరణపై చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని కార్మిక సంఘాల నేతలు పద్మాకర్‌, అశ్వర్థామరెడ్డి, బాబు, తిరుపతి, పలిశెట్టి దామోదర్‌రావు తదితరులు డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ ప్రస్తుతం భారీ నష్టాల్లో ఉన్న దృష్ట్యా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించకుండా హామీ ఇవ్వలేమని ఎండీ, ఈడీలు స్పష్టం చేశారు. ఈ నెల 9 లోపు ప్రభుత్వాలను సంప్రదించి నిర్ణయం చెబుతానని ఎండీ సాంబశివరావు వివరించారు. అయితే వేతన సవరణపై స్పష్టమైన హామీ కోసం కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. యాజమాన్యం నుంచి స్పందన లేక పోవడంతో గురువారం బస్‌భవన్‌ను ముట్టడిస్తామని ఎంప్లాయీస్ యూనియ‌న్‌-టీఎంయూ నేతలు ప్రకటించారు. సుందరయ్య పార్క్‌ నుంచి భారీ ర్యాలీతో బస్‌భవన్‌ను చేరుకుంటామని వివరించారు.