ప్ర‌యివేటు స‌ర్వీసుల‌కు తాత్కాలిక ఊర‌ట‌..

అంత‌రాష్ట్ర స‌ర్వీసుల‌పై ర‌వాణ ప‌న్ను విధిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని హైకోర్టు నిలిపి వేసింది. వారం రోజుల‌పాటు ఈ ప‌న్ను వ‌సూళ్ళ‌ను నిలిపి వేయాల‌ని ఆదేశిస్తూ కోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌యివేటు ఆప‌రేట‌ర్లు తెలంగాణ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స‌వాలు చేస్తూ ఈరోజు కోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన కోర్టు టాక్స్ చెల్లించాల్సిన ప్ర‌యివేటు ర‌వాణా ఆప‌రేట‌ర్ల‌కు, ట్రావెల్ సంస్థ‌ల‌కు తాత్కాలికంగా స్వ‌ల్ప ఊర‌ట క‌ల్పించింది. ఈ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇస్తూ తదుప‌రి విచార‌ణ‌ను మంగ‌ళ‌వారానికి వాయిదా వేసింది.
ఈ ఉత్త‌ర్వులు కోర్టును ఆశ్ర‌యించిన వారికే వ‌ర్తిస్తాయ‌ని, మిగిలిన వారు ప‌న్ను చెల్లించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. ప‌న్ను చెల్లించ‌ని వారు చెక్‌పోస్టుల వ‌ద్ద హామీ ప‌త్రాలు ఇవ్వాల‌ని సూచించింది. వ‌చ్చేవారం వ‌ర‌కు రోడ్డు టాక్స్ వ‌సూలు చేయొద్ద‌ని తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. ఒకవేళ తుది తీర్పు ప్ర‌యివేటు ఆప‌రేట‌ర్ల‌కు వ్య‌తిరేకంగా ఉంటే ప‌న్ను మొత్తం చెల్లించాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది.