గజనీ గుర్తుంచుకునే సందర్భం

కొందరికి కొన్నింటి మీద ఎందుకోగానీ పెద్దగా గౌరవం ఉండదు. డబ్బుమీద, పేరు ప్రతిష్టలకు సంబంధించి, కీర్తికండూతీలపైన ఇలాంటి దృక్పథం ఉండటం  గొప్ప సుగుణం.
కానీ -పెద్దలంటే కుర్రకారు తీసిపారేస్తే అది -జ్ఞానం లేకపోవడం.

పాఠశాల అన్నా, బోధనన్నా ఉపాధ్యాయులకు పట్టింపులేకపోవడం అది -బాధ్యతారాహిత్యం.  కూలీ నాలీ, అప్పు సప్పూ, తిండీ తిప్పలు మానీ సైతం పన్నులు కట్టి, తమకు జీతాలు ఇచ్చి, మౌళిక సదుపాయాలు కల్పించే  ప్రజలకు  సేవ చేయాలనే ఇంగితం ప్రభుత్వ అధికారులకు లేకపోవడం అది -జనంలో లోపించిన  చైతన్య రాహిత్యం.

ఇక -ముఖ్యమంత్రులుగా పనిచేసి, ప్రతిపక్షనేతలుగా పోరాటం చేసి ఇంకా ఎన్నో ఎన్నోరాజకీయాలు చేసి… చేసి… కూడా శాసనసభలో ఎలా వ్యవహరించాలో, తద్వారా భవిష్యత్‌ తరాలకు ఏ విధమైన సంకేతాలు ఇవ్వాలో, ఎంత ఆదర్శంగా నిలవాలో, మహిళలను, దళితులను గౌరవించి ఎలా వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలో కాకలు తిరిగిన సీనియర్‌ నేతలకు కూడా తెలియక పోవడం, వీటి అవసరాన్ని వారు విస్మరించడం అంటే అది -కచ్చితంగా ప్రజాస్వామ్యం చేసుకున్న దురదృష్టమే.

ఇదంతా చెప్పడం ఎందుకంటే ఇటీవల శాసనసభలో విపక్షసభ్యులు చేశారని చెబుతున్న రభసకు బీజాలు ఈనాటివి కావు అనీ, గతంలోకి, ముఖ్యంగా శాసనసభ చరిత్రలో గజనీ సైతం గుర్తుపెట్టుకునే సందర్భాన్ని స్పృశిస్తే లోగుట్టు బోధపడుతుందని వివరించడానికే.

2008లో ప్రభుత్వంపై నాటి ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టిన సందర్భంలో అప్పటి డిప్యూటీ స్పీకర్‌ కుతూహలమ్మ సభాపతి స్థానంలో కాసేపు ఉన్నారు. అప్పుడు ఎమ్మెల్యేలు ప్రశ్నలు సంధిస్తున్నారు.  మంత్రులు సమాధానమిస్తున్నారు. ఇలా ప్రజాస్వామ్యయుతంగానే సాగుతోంది నిండు శాసన సభ. అలాంటి సమయంలో ఎందుకోగాని విపక్షసభ్యులైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు కోపం వచ్చింది. ఈ చర్చంతా వద్దు అర్జెంటుగా తమ నేత చంద్రబాబు నాయుడును మాట్లాడించాలని వారు పట్టుబట్టారు. దానికి కుతూహలమ్మ గారు స్పందిస్తూ ఈ చర్చ ముగిసాక మాట్లాడవచ్చనీ, అందుకోసం అధిక సమయం కూడా కేటాయిస్తామనీ ఎంతో హుందాగా చెప్పుకొచ్చారు.

ఈ మాటలు విన్నాక నాటి ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడుకి కోపం నషాళానికి అంటింది. దాంతో ఆయన పట్టలేని ఆగ్రహంతో, కుతూహలమ్మ   వైపు చూపుడు వేలు సారిస్తూ …. కుతూహలమ్మ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని, స్పీకర్‌ సురేష్‌రెడ్డి రావాలని, చివరకు  స్పీకర్‌ స్థానంలో కూర్చోడానికి సైతం ఆమె పనికిరాదని తీర్పులు కూడా వెలువరించారు.మహిళ అనీ, అందునా దళిత అనీ చూడకుండా ప్రవర్తించిన చంద్రబాబు నాయుడుకు స్పీకర్‌ స్థానంలో ఎవరు ఉండాలో చెప్పే అర్హత ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. బహుశా అహంకారానికి ఆవేశం తప్ప ఆలోచనలేవీ ఉండవేమో!.

మొత్తానికి ఈ దురదుష్ట ఘటనతో హతాశురాలైన కుతూహలమ్మ నాటి సీఎం, దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వద్ద కన్నీరుపెట్టుకుని, పదవి నుంచి వైదొలగుతానని కూడా చెప్పడం, దానికి ఆయన అనునయించి, ఆమెను కొనసాగమని పంపించడం చరిత్ర. అయితే అప్పటికీ తాను చేసిన తప్పిదమేమిటో గ్రహించని చంద్రబాబునాయుడు సమర్థించుకోవడం చూసిన నాటి శాసనసభ వ్యవహారాలశాఖామంత్రి రోశయ్య కలుగజేసుకుని ఇదేనా పద్ధతి? అని నిలదీయడంతో ఆయన వెనక్కుతగ్గటమూ చరిత్రే.

అంతేకాదు, అప్పట్లో  శాసనసభను ఉద్దేశించి   చంద్రబాబునాయుడు మాట్లాడేటప్పుడు పదే పదే  కౌరవసభతో పోల్చేవారు. ప్రజలు ఎన్నుకున్న గౌరవ శాసనసభ్యులు ఉన్న  సభను అలా పిలవటం అనేది ఆయనే చెప్పుకున్నట్టుగా  సీఎంగా చేసిన నేత స్థాయికి ఎంత వరకు సమంజసమో తెలియదా? ఇదంతా చూస్తే నేటి అసెంబ్లీ వి’చిత్రాల’కు అసలు పేటెంట్‌ హక్కుదారులెవరో ప్రజలు గుర్తించకపోతారా?

సరే, ఇప్పుడు సైతం ఏమి జరుగుతోంది. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మాట్లాడే సమయానికి అధికారపక్ష సభ్యులు ఆయన్ను అవినీతి నేత అంటూ అడ్డగిస్తున్నారు. గందరగోళం సృష్టిస్తున్నారు. సభను తప్పుదోవపట్టిస్తున్నారు. పదేపదే అడ్డుతగలడానికి  ఆయనేమైనా ఉబుసుపోని కబుర్లు చెబుతున్నారా? ప్రజా సమస్యలనే  కదా లేవదీస్తున్నారు. అలాంటప్పుడు జగన్‌ గొంతు నొక్కాలని ఎందుకు చూస్తున్నట్టు.

సభలో విపక్షనేతను గౌరవించలేని తనం అంటే అర్థం ఏమిటి? తమను ఎన్నుకుంటే ప్రజలు తెలివైన వాళ్లని, ఇతరులను ఎన్నుకుంటే తెలివిలేనివాళ్లనీ అర్థమా? అలా కానప్పుడు విపక్షనేతగా ఎన్నుకున్న నాయకుడ్ని మాట్లాడకుండా చేయడం ద్వారా ఏపీ ప్రజలకు ఏమి ఉపకారం చేస్తున్నట్ట్టు? ఏమి చెబుతున్నట్టు?..

అధికారం శాశ్వ‌తం కాదు కాబట్టి…నేటి ప్రతిపక్షం రేపటి అధికార పక్షం కావచ్చు.నేడు అధికారంలో ఉన్నవారు రేపు ప్రతిపక్షంలో ఉండవచ్చు. ప్రజాస్వామ్యంలో ఇది చాలా  సర్వ సాధారణమైన విషయం. అంచేత ఎవరైనా సరే సభా విలువలను కాపాడటమంటే అది – శాసనసభను గౌరవించడం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం.
-సంఘమిత్ర