ఏపీలో విద్యుత్ ఛార్జీల భారం రూ. 940 కోట్లు!

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విద్యుత్‌ ఛార్జీల భారం పడింది. వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి ఈ కొత్త ఛార్జీలు అమలులోకి వస్తాయి. విద్యుత్ ఛార్జీలను పెంచుతూ జారీ అయిన ఉత్తర్వులలో ఈఆర్‌సి ఛైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్ అనేక విషయాలను వెల్లడించారు. ఛార్జీల పెంపు 92 శాతం మంది వినియోగదారులకు వర్తించదని చెప్పారు. నెలకు 2 వందల యూనిట్ల లోపు విద్యుత్ వాడుకునే వారికి ఈ ఛార్జీల పెంపు వర్తించదని తెలిపారు. గృహ విద్యుత్ విషయంలో రెండు వందల యూనిట్ల వరకు ఛార్జీల పెంపు లేదు. వ్యవసాయానికి, కుటీర పరిశ్రమలకు ఛార్జీల పెంపు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎల్‌టీ కేటగిరీ – 3లో మరికొంతమంది ఛార్జీల పెంపు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ మినహాయింపు చక్కెర మిల్లులు, పౌల్ట్రీ పరిశ్రమలకు కూడా వర్తిస్తుంది. ప్రభుత్వం నుంచి 3,186 కోట్ల రాయితీ లభించిందని ఈఆర్‌సి ఛైర్మన్ తెలిపారు. ఈ విద్యుత్‌ ఛార్జీల పెంపు వల్ల వినియోగదారులపై దాదాపు 940 కోట్ల రూపాయలకు పైగా భారం పడుతుంది.