రైతుబంధు మా ప్రభుత్వం: చంద్రబాబు

రైతులకు ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తున్నదీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో సుదీర్ఘ ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశ పెట్టడం గర్వంగా ఉందని ఆయన అన్నారు. రైతులకు సూచనలు ఇవ్వడమే కాకుండా వారి నుంచి సూచనలు తీసుకునే కార్యక్రమం చేపట్టామని ఆయన తెలిపారు. రైతు సాధికార సంస్థకు ఐదు వేల కోట్లు కేటాయించామని, ఇది అన్నదాతలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. తాను ఎన్నికలకు ముందు ప్రజల బాధలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేశానని, రైతులు పడే బాధలు తనకు తెలుసునని అన్నారు. అందుకే రైతులను ఆదుకునేందుకు రైతు రుణ మాఫీ కార్యక్రమం చేపట్టామని అన్నారు. రూ. 50 వేల వరకు రుణం తీసుకున్నవారికి మొత్తం రుణం మాఫీ చేశామని, రూ. 50 వేల కన్నా ఎక్కువ రుణం తీసుకున్న వారికి స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ అమలు చేస్తున్నామని తెలిపారు. రైతుల కోసం, వారికి మంచి భవిష్యత్‌ కల్పించడం కోసం ఇక్రిశాట్‌తో కలిసి పని చేస్తున్నామని తెలిపారు. రుణమాఫీకి ఆర్‌బీఐ ససేమిరా అన్నా కూడా తాము వెనక్కి తగ్గలేదని, రైతుల ఆత్మహత్యలను ఆపాలని లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నానని చంద్రబాబు తెలిపారు. రూ. లక్ష రుణం మాఫీ చేయాలని కోటయ్య కమిటీ సిఫార్సు చేసిందని, రూ. 1.5 లక్షల రుణ మాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఆమేరకు అమలు చేస్తుందని గుర్తు చేశారు. రుణమాఫీపై ఫిర్యాదుల కోసం కమిటీ వేశామని, అన్నదాత కళ్ళలో ఆనందం చూడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకే ఇసుక నుంచి వచ్చే ఆదాయంలో సైతం 75 శాతం రైతులకే ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు. పంటల భీమాను ఈ రుణ మాఫీకి వర్తింప చేయమని ఎంతోమంది సూచించినా ఆ పని చేయకుండా ప్రభుత్వమే సొంతంగా ఆ రుణాలను మాఫీ చేసే కార్యక్రమం చేపట్టిందని ఇది ప్రతిపక్షం తెలుసుకోవాలని చంద్రబాబు హితవు పలికారు.