టీ కోసం హత్య

మనుషుల్లో క్రూరత్వం పెరిగిపోతుందనడానికి మరో ఉదాహరణ. మహానగరాల్లో మర్డర్లు ఎంత కామనైపోయాయో అనడానికి ఇదో సజీవ సాక్ష్యం. కేవలం టీ ఇవ్వడం ఆలస్యమైందని ఏకంగా టీకొట్టు ఓనర్నే చంపేశాడు ఒక‌ కస్టమర్. మాటతో పోయేదాన్ని మర్డర్‌ దాకా తీసుకెళ్లారు. హైదరాబాద్‌ బేగంపేటలో జరిగిందీ ఘోరం. ఎంజీ కేఫ్‌ ఓనర్‌ జహంగీర్‌ ఈ ఘటనలో హత్యకు గురయ్యాడు. మామూలుగానే టీ తాగడానికి కేఫ్‌కొచ్చారు ఇద్దరు వ్యక్తులు. టీ అడిగారు. కొంచెం ఆలస్యమైంది. అంతే వారిలో కోపం కట్టలు తెంచుకుంది. ఓనర్‌ జహంగీర్‌తో గొడవ పడ్డారు. అడ్డమైన బూతులు తిట్టారు. మాటామాటా పెరిగి కక్ష పెంచుకున్నారు. జరిగిందేదో జరిగిందని ఓనర్‌ జహంగీర్‌ ఆ విషయాన్ని అంతటితో వదిలేశాడు. కానీ ఆ ఇద్దరు వ్యక్తులు మాత్రం విషయాన్ని వదల్లేదు. తమతోనే గొడవపడతాడా? అని స్నేహితులందరికీ చెప్పారు. అంతా కలిసి కేఫ్‌ యజమానిపై దాడికి సిద్ధమయ్యారు. కత్తులతో మూకుమ్మడిగా దాడి చేసి జహంగీర్‌ను నరికారు. ఒక్కసారిగా జరిగిన ఘటనతో షాక్‌ తిన్న మిగిలిన కస్టమర్లు తేరుకుని వారిని అడ్డుకోబోయారు. దాంతో వారు అక్కడి నుంచి పరారయ్యాడు. కానీ కత్తుల దాడిలో తీవ్రంగా గాయపడిన జహంగీర్‌ చనిపోయాడు. అయితే నిఘా కెమెరాల సహాయంతో దోషులను గుర్తించారు పోలీసులు.