My title

హిందూపురంలో హీరో అయిన వైసీపీ ఇన్‌చార్జ్

హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణపై ప్రజాతిరుగుబాటు టీడీపీలో చర్చనీయాంశమైంది. హిందూపురంలో ప్రస్తుతం 10 రూపాయలకు ఒక్కో బిందె నీళ్లు కొనుక్కుని బతకాల్సిన పరిస్థితి. అయినప్పటికీ ఐదు నెలలుగా బాలకృష్ణ హిందూపురం వైపు రాలేదు. ఈ నేపథ్యంలో నీటి సమస్య తీర్చాలంటూ హిందూపురంలో వైసీపీ నిర్వహించిన ర్యాలీకి ఆ పార్టీ నేతలు కూడా ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది.

ముఖ్యంగా వేలాది మంది మహిళలను మండుటెండలను కూడా లెక్క చేయకుండా పట్టణ ప్రధాన వీధుల్లో ర్యాలీకి రావడం చూసి టీడీపీ నేతలే ఆందోళన చెందుతున్నారు. బాలకృష్ణకు వ్యతిరేకంగా సొంత నియోజకవర్గంలో వేలాది మందితో ర్యాలీ ఎలా సాధ్యమైందని జిల్లా టీడీపీ నేతలు లోకల్ లీడర్లను ఆరా తీస్తున్నారు. ఇందుకు స్థానిక టీడీపీ నేతలు చెబుతున్న సమాధానం .. హిందూపురం ప్రజల్లో బాలకృష్ణ నమ్మకాన్ని కోల్పోయారని వారు చెబుతున్నారు.

ముఖ్యమంత్రి బామ్మర్ది అయి ఉండి కూడా నీటి సమస్యను తీర్చలేకపోవడం నిజంగా బాలకృష్ణ వైఫల్యంగానే భావిస్తున్నారు. అయితే బాలకృష్ణపై ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ వేలాది మంది మహిళలు రోడ్డుపైకి వచ్చేలా చేయడం వెనుక ఎవరున్నారన్న దానిపైనా ఆరా తీస్తున్నారు. హిందూపురంలో మహిళలు ఒక తిరుగుబాటు తరహాలో ర్యాలీకి రావడం వెనుక వైసీపీ ఇన్‌చార్జ్ నవీన్ నిశ్చల్ కృషి ఉందంటున్నారు. ప్రస్తుతం నవీన్ నిశ్చల్ హిందూపురం వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. బాలకృష్ణకు వ్యతిరేకంగా నిన్నటి ర్యాలీతో నవీల్ నిశ్చల్ హీరో అయిపోయారు.

నిజానికి నవీన్ నిశ్చల్‌కు లోకల్‌లో గట్టి పట్టు ఉంది. మొన్నటి ఎన్నికల్లో బాలకృష్ణ కాకుండా మరెవరు పోటీ చేసినా నవీన్ నిశ్చల్ గెలుపు ఖాయమైపోయేదంటున్నారు. అయితే బాలకృష్ణ ఎంట్రీతో పరిస్థితి మారిపోయింది. గతంలో హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎన్టీఆర్‌కు కుమారుడు కావడం, అదే సమయంలో టీడీపీ గాలి వీచడంతో బాలకృష్ణ గెలిచారు. నవీల్ నిశ్చల్ ఓడిపోయారు. అయితే ఇప్పుడు బాలకృష్ణపై భ్రమలు తొలగిపోయాయంటున్నారు. నాన్‌ లోకల్‌ బాలకృష్ణను నమ్ముకుని తప్పుచేశామన్న భావన ప్రజల్లో ఉందంటున్నారు. మొత్తం మీద బాలకృష్ణకు వ్యతిరేకంగా ర్యాలీ తర్వాత హిందూపురంలో నవీన్ నిశ్చల్ హీరో అయిపోయారన్న భావన వ్యక్తమవుతోంది. హీరో బాలకృష్ణ ఇలాకాలో ఇలా మరొకరు హీరోగా మారిపోవడం తీవ్రపరిణామమే.