My title

జగన్‌ పాదయాత్ర ఖర్చు మొత్తం ఆ సీనియర్‌ నేతదే….

నవంబర్ రెండు నుంచి వైఎస్‌ జగన్‌ సుధీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఆరు నెలల పాటు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయబోతున్నారు. ఇందుకు పార్టీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలకు చేరువయ్యేందుకు జగన్‌ పాదయాత్ర మార్గాన్ని ఎంచుకున్నారు.  అయితే పాదయాత్ర అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. పైగా ఇప్పటికే పార్టీ నిర్వహించిన పలుకార్యక్రమాలకు నేతలు భారీగానే ఖర్చుచేశారు.

ఈనేపథ్యంలో పాదయాత్ర ఖర్చు ఎవరు భరిస్తారన్న ప్రశ్న వైసీపీలో ఉత్పన్నమైంది. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లపైనే  ఈ భారం పడుతుందేమోనని ఆర్థిక బలం లేని పలువురు వైసీపీ నేతలు భయపడ్డారు. అయితే పాదయాత్ర ఖర్చును నేతలు భరించాల్సిన అవసరం లేదని నాయకత్వం ప్రకటించి వారికి కొండంత ఊరటను ఇచ్చింది. చాలా ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నందున నేతల పరిస్థితిని అర్థం చేసుకున్న జగన్‌…. తన యాత్ర ఖర్చును తానే భరించాలని నిర్ణయించుకున్నారు. అయితే సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంతలో తాను ముందుకొచ్చారు.

పాదయాత్ర ఖర్చు మొత్తం తాను, తన కుమారుడు మిథున్ రెడ్డి భరిస్తామని నాయకత్వానికి తెలియజేశారు. పాదయాత్రలో భోజనాల ఖర్చు, యాత్రలో పాల్డొన్న వారికి వసతి సదుపాయం, వాహనాల ఖర్చు అన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భరించబోతున్నారు. ఆయా నియోజవర్గాల్లో పాదయాత్ర ఎంటరైనప్పుడు స్థానిక నాయకులు మోరల్‌గా సపోర్ట్ ఇస్తే చాలని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. ఇదే సమయంలో పాదయాత్రకు అవసరమైన ఏర్పాట్లను తమ నియోజకవర్గం పరిధిలో సిద్దం చేసేందుకు నేతలు స్వచ్చందంగా ముందుకొస్తే వారి ఆతిధ్యం తీసుకోనున్నారు.

గతంలో చంద్రబాబు పాదయాత్ర చేసిన సమయంలో ఆ ఖర్చు మొత్తం తెలంగాణకు చెందిన గరికపాటి మోహన్‌రావు భరించారు. చంద్రబాబు పాదయాత్ర చేస్తున్న సమయంలో రోడ్డుకు ఒకవైపు మొత్తటి మట్టిని కూడా ఆయన సొంత డబ్బుతో వేయించారు. పాదయాత్ర సమయంలో దుమ్మురేగకుండా చంద్రబాబు వచ్చే సమయానికి రోడ్డు వెంబడి ట్యాంకర్ల ద్వారా నీరు జల్లించారు. ఇప్పుడు జగన్ పాదయాత్రకు అవసరమైన ఖర్చును పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి భరించేందుకు ముందుకు రావడంతో ఆర్థికంగా బలంగా లేని వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.