My title

తప్పు చేసినందుకే ఉరి శిక్ష విధించాలన్నాం… తప్పేంటి బాబు

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో మరోసారి చంద్రబాబుపై జగన్ నిప్పులుచెరిగారు. మూడేళ్లలో ఒక్కహామీ కూడా నెరవేర్చకుండా మోసం చేసిన వ్యక్తిని ఏమీ అనొద్దంట అని జగన్ ఎద్దేవా చేశారు. మాట తప్పినచంద్రబాబును నిలదీయవద్దంట అని అన్నారు. 21 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా చంద్రబాబును ప్రశ్నించవద్దొంట అని జగన్ మండిపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకపోవడంతో పాటు ఏకంగా మంత్రి పదవులు ఇచ్చినా ప్రశ్నించకూడదంటే ఎలా అని నిలదీశారు.

చంద్రబాబు తప్పుడు పనులు చేసినా రైటేనంటున్నారని విమర్శించారు. అలా మాట తప్పి మోసం చేస్తున్న వ్యక్తికి ఉరిశిక్ష విధించినా తప్పులేదంటామన్నారు. మాట తప్పినందుకు ఉరిశిక్ష విధించాలని అంటే చంద్రబాబు మాత్రం దిష్టిబొమ్మ దహనం చేయిస్తున్నారని జగన్ మండిపడ్డారు. తాను మాట ఇస్తే తప్పనని, మడమ తిప్పనని జగన్ చెప్పారు. కుల, మత, పార్టీలకతీతంగా తమ పాలన ఉంటుందన్నారు. అవినీతితో సంపాదించిన డబ్బు మూటలు తీసుకుని చంద్రబాబు వస్తున్నారని… ఐదు వేలు ఇచ్చి దేవుడి ఫోటోపై ప్రమాణం చేయించుకుంటారని జగన్ చెప్పారు. అలాంటి సమయంలో లౌక్యంతో ఓటేయాలని పిలుపునిచ్చారు. నంద్యాల నియోజకవర్గంలోని దీబగుంట్లలో జగన్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.