My title

ఈ ఫొటో ఎక్కడిది?

ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఒక ఫొటో తెగ చక్కర్లు కొడుతోంది. రాష్ట్రంలో చంద్రబాబు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని వైసీపీ విమర్శలు చేస్తున్ననేపథ్యంలో వైఎస్‌ జగన్‌ మద్యం బాటిళ్లతో ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మందు సీసా, మందు నింపిన గ్లాస్‌ టేబుల్‌పై ఉండగా జగన్‌ అక్కడ కూర్చున్నట్టుగా ఫొటోలో ఉంది. అయితే ఈ ఫొటో కావాలని సృష్టించినదిగా తేలిపోయింది. ఈ ఫొటోను మార్పింగ్‌ చేసిన మేధావులు … కేవలం మార్పింగ్ మాత్రమే చేయడం వచ్చిన వారిగా తేలింది. లాజిక్‌లు ఆలోచించే బుర్రమాత్రం వారికి లేదని నిర్దారణ అయింది. మద్యం సీసాతో జగన్ ఉన్న ఫొటో ఫేక్ అని తేలుస్తూ అసలు ఫొటోను కూడా వైసీపీ నెటిజన్లు వెలుగులోకి తెచ్చారు.

జగన్‌ను తాగుబోతుగా నమ్మించేందుకు ఆయన ప్రత్యర్థులు ఈ ఫొటోను సృష్టించినప్పటికీ… కొన్ని లాజిక్‌లు మిస్‌ అయ్యారు. మద్యం సీసా ఫుల్‌గా ఉంది. కానీ అదే సమయంలో గ్లాస్‌లో మద్యముంది. సీసా ఫుల్‌గా ఉండగానే గ్లాస్‌లోకి మద్యం ఎలా వచ్చిందన్న విషయం పక్కన పెడితే… అసలు ఒరిజినల్‌ ఫొటో కూడా సోషల్‌ మీడియాలోకి వచ్చింది. నిజానికి ఒరిజినల్‌ ఫొటోలో ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి ఉన్నారు. కానీ ఫొటోను మార్పింగ్ చేసిన కొందరు వ్యక్తులు… అసలు ఫొటోలో ఉన్న మహిళను తొలగించి…. జగన్‌ ముందు ఉన్న టేబుల్‌పై మద్యం సీసా, మద్యం గ్లాసును మార్పింగ్‌ చేసి పెట్టారు.

జగన్‌ను రాజకీయంగా విమర్శించడం కంటే అతడి వ్యక్తిత్వాన్ని లక్ష్యంగా చేసుకునే తొలినుంచి ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు. జగన్‌కు మద్యం తాగే అలవాటు లేదని అందరూ చెబుతున్న నేపథ్యంలో… లేదు జగన్ కూడా మద్యం సేవిస్తాడని నమ్మించేందుకు కొందరు నెటిజన్లు ఇలా ఫొటోను మార్పింగ్‌ చేశారు. కానీ ఫొటోలో లాజిక్‌ లేకపోవడం, ఒరిజినల్ ఫొటో కూడా వెలుగులోకి రావడంతో ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వైసీపీ నెటిజన్లు మార్పింగ్‌ ఫొటోకు క్షణాల్లో విరుగుడుగా ఒరిజినల్ ఫొటోను వెలుగులోకి తెచ్చారు.