My title

వాడకంపై వైసీపీ ఆగ్రహం..

శిల్పా మోహన్‌ రెడ్డిపై వైసీపీ నేతలు ఇప్పుడు నిప్పులు చెరుగుతున్నారు. చంద్రబాబును బ్లాక్‌మెయిల్ చేసేందుకు వైసీపీని బాగా వాడుకుంటున్నారన్న ఆగ్రహం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. నంద్యాల టికెట్ విషయంలో శిల్పామోహన్ రెడ్డి నడిపిన రాజకీయంలో ఏమాత్రం నైతికత లేదని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

నిజానికి నంద్యాల టికెట్‌ను భూమా కుటుంబానికే కేటాయించాలని తొలుత నిర్ణయం తీసుకున్నారు. అయితే టికెట్‌ తనకు దక్కే సూచనలు లేకపోవడంతో శిల్పా మోహన్‌ రెడ్డి వైసీపీని పావుగా వాడుకున్నారని భావిస్తున్నారు. నంద్యాల టికెట్ ఇవ్వకపోతే శిల్పామోహన్ రెడ్డి వైసీపీలో చేరిపోతారని, ఈనెల 21న ముహుర్తం అని కూడా లీకులిచ్చారు. దీంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు శిల్పా బ్రదర్స్‌ను పిలిపించుకుని చర్చలు జరిపారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

అంతే శిల్పా వర్గం నుంచి పార్టీ మార్పులు లీకులు ఆగిపోయాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌పై జగన్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. కేవలం చంద్రబాబును బ్లాక్‌మెయిల్ చేసేందుకు వైసీపీని శిల్పా మోహన్ రెడ్డి వాడుకున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శిల్పామోహన్‌రెడ్డికి ఏమాత్రం నైతికత ఉన్నా అటో ఇటో నిలబడేవాడని… అలా కాకుండా టికెట్ ఇస్తే టీడీపీలో ఉంటా లేదంటే పార్టీ వీడుతా అంటూ ప్రచారం చేయడం వల్లే ఆయనకు టికెట్‌ సాధించడం తప్ప మరో లక్ష్యం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కేవలం టికెట్‌ కోసమే రాజకీయాలు చేసే శిల్పా లాంటి వారిని నమ్మితే భవిష్యత్తులోనైనా వారు నమ్మకంగా ఉంటారన్న గ్యారెంటీ ఏముందని వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ మారుతానంటూ లీకులిచ్చిన శిల్పామోహన్‌ రెడ్డి బుధవారం తిరిగి చంద్రబాబుతో సమావేశమవడం, ఆ తర్వాత మౌనంగా ఉండిపోవడంతో వైసీపీ నాయకత్వం కూడా శిల్పామోహన్‌ రెడ్డిని పట్టించుకోకూడదన్న నిర్థారణకు వచ్చినట్టు చెబుతున్నారు. ఇప్పటికే నంద్యాల ఉప ఎన్నికలో పోటీ కోసం అభ్యర్థుల ఎంపికకు జగన్‌ శ్రీకారం చుట్టారని చెబుతున్నారు. నంద్యాలలో సినిమా థియేటర్ల యజమాని ఉలవల ప్రతాప్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉందంటున్నారు.