My title

మోడీ ప్ర‌భుత్వం నైతిక‌త‌ను కోల్పోయింది

బిజెపి సీనియ‌ర్ నాయ‌కుడు య‌శ్వంత్ సిన్హా మోడీ ప్ర‌భుత్వంపై మ‌రోసారి విమ‌ర్శనాస్త్రాలు సంధించారు. పార్టీ చీఫ్ అమిత్ షా త‌న‌యుడిని వెన‌కేసుకు రావ‌డంతో మోడీ ప్ర‌భుత్వం నైతిక‌త‌ను కోల్పోయింద‌ని ఆయ‌న అన్నారు.

జ‌య్ షా కేసు విష‌యం ద‌ర్యాప్తులో ఉన్నందున ఆ అంశంపై తాను మాట్లాడ‌ద‌ల‌చుకోలేద‌ని య‌శ్వంత్ సిన్హా అన్నారు. కానీ జ‌య్ షా ను కాపాడ‌డానికి ఏకంగా కేంద్ర మంత్రులు రంగంలో దిగ‌డాన్ని ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. బాధ్య‌త‌గ‌ల కేంద్ర మంత్రులు వారి బాధ్య‌త‌ను మ‌రిచి …జ‌య్ షా చార్టెడ్ అకౌంటెంట్ల మాదిరిగా ప్ర‌వ‌ర్తించార‌ని య‌శ్వంత్ సిన్హా అన్నారు.

అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తాను జ‌య్ షా కేసు వాదించ‌డానికి అనుమ‌తి ఇవ్వ‌డాన్ని కూడా య‌శ్వంత్ సిన్హా త‌ప్పుబ‌ట్టారు. ఈ ప‌రిణామాలు జ‌ర‌గ‌కుండా ఉంటే బాగుండేద‌ని  అన్నారు.

జ‌య్ షా వ్య‌వ‌హారంలో ద‌ర్యాప్తు ఖ‌చ్చితంగా జ‌ర‌గాల‌ని య‌శ్వంత్ అన్నారు. దేశంలో చాలా ద‌ర్యాప్తు సంస్థ‌లున్నాయ‌ని అవి ఈ ప‌నిని చేస్తాయ‌ని ఆయ‌న తెలిపారు.

మీడియా అనేది ప్ర‌జాస్వామ్యంలో ఓ భాగ‌మ‌ని అందుకే దాన్ని ఫోర్త్ ఎస్టేట్ అని వ్య‌వ‌హ‌రిస్తామ‌ని ఆయ‌న గుర్తుచేశారు. మీడియా గొంతును ప్ర‌త్య‌క్షంగా గానీ, పరోక్షంగా గానీ నొక్కాల‌ని అనుకోవ‌డం స‌మంజ‌సం కాద‌ని య‌శ్వంత్ సిన్హా అన్నారు. ది వైర్  న్యూస్ పోర్ట‌ల్‌పై ప‌రువున‌ష్టం దావా వేయ‌కుండా ఉండాల్సింద‌ని కూడా య‌శ్వంత్ అన్నారు.

ఓ ప్ర‌ముఖ టెలివిజ‌న్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో య‌శ్వంత్ త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు.