My title

అటు వైపు పోకమ్మ లోకేష్‌…

నంద్యాల ఉప ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతున్నా, టీడీపీ- వైసీపీ నేతలు ఉధృతంగా విమర్శలు చేసుకుంటున్నా మంత్రి నారా లోకేష్‌ గొంతు మాత్రం వినిపించడం లేదు. అమరావతిలో పప్పుకు తాలింపులు వేస్తున్నావా అని రోజా ప్రశ్నించినా సరే లోకేష్‌ ఊసు మాత్రం నంద్యాల ఉప ఎన్నికల్లో కనిపించడం లేదు, వినిపించడం లేదు. అయితే లోకేష్ నంద్యాల ఉప ఎన్నికలకు దూరంగా ఉండడానికికారణం చంద్రబాబు దిశానిర్దేశమేనని చెబుతున్నారు.

షెడ్యూల్ విడుదల కాకముందు లోకేష్‌ నంద్యాలకు వెళ్లారు. అయితే ఎక్కడ చూసినా యువత ఆయన్ను నిలదీశారు. ఆ సమయంలో శాంతంగా సమాధానం చెప్పాల్సిన లోకేష్ యూత్‌పై ఒరేయ్‌, అరేయ్ అంటూ రుసరుసలాడారు. దాంతో లోకేష్ పర్యటనకు నెగిటివ్ పబ్లిసిటీ భారీగా వచ్చింది. అదే సమయంలో నంద్యాల ఉప ఎన్నికల విషయంలో ఇంటెలిజెన్స్ నివేదకలు కూడా లోకేష్‌ను చంద్రబాబు దూరంగా ఉంచడానికి కారణమని చెబుతున్నారు.

నంద్యాలలో పరిస్థితి అనుకూలంగా లేదని… ఈ సమయంలో లోకేష్‌ను ప్రచారంలోకి దింపి, ఒక వేళ నంద్యాలలో టీడీపీ ఓడిపోతే ఆ నిందను ప్రతిపక్షం లోకేష్‌ మీదకే నెట్టేస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. లోకేష్ జీహెచ్‌ఎంసీ ప్రచారాన్ని మొత్తం తన భుజాలపై వేసుకుని చేస్తే చివరకు గుండు సున్నా మిగిలింది. దాంతో ఇప్పటికీ లోకేష్‌ను విమర్శించేవారు జీహెచ్‌ఎంసీ ఫలితాన్ని గుర్తు చేస్తున్నారు.

ఇప్పుడు నంద్యాలలో లోకేష్ ప్రచారం చేసినా ఫలితం తారుమారైతే ఐరన్‌ లెగ్‌ అన్న ముద్ర వేస్తారన్న భయం నారా వారిలో ఉందని చెబుతున్నారు. అయితే నంద్యాల ప్రచారానికి పూర్తిగా లోకేష్‌ను దూరం చేస్తే ప్రజల్లో అనుమానాలు రావచ్చన్న ఉద్దేశంతో వీలైతే ఒకటిరెండు రోజుల పాటు లోకేష్‌ను అలా తిప్పాలని భావిస్తున్నారు. వీలైతే బాలకృష్ణ, పవన్‌ కల్యాణ్‌లను టీడీపీ స్టార్ క్యాంపెయినర్లుగా నంద్యాల పంపాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఇందుకోసం పవన్‌ కల్యాణ్‌తో చంద్రబాబు అండ్ టీం సంప్రదింపులు జరుపుతోంది.