My title

మీడియా వివక్ష… వెనుక ఎవరున్నారు?

ఆంధ్రప్రదేశ్‌లో మీడియా చాలా బలంగా ఉంది. తిమ్మిరిబమ్మరి చేసి చూపించడం తెలుగు మీడియాకు వెన్నతో పెట్టిన విద్య అన్న విమర్శలు ఉన్నాయి. ఏపీలో మీడియా చంద్రబాబుకు, ఆయన పార్టీకి అనుకూలంగా  పనిచేస్తోందన్న ఆరోపణ బలంగా ఉంది. ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా విడుదలైన రెండు భారీ చిత్రాల విషయంలోనూ మీడియా ఏకపక్షంగా వ్యవహరించిందన్న విమర్శలు వస్తున్నాయి. అటు ప్రభుత్వం కూడా ఒక చిత్రంపై వివక్ష చూపిందన్నది ప్రధాన ఆరోపణ. జనవరి 11న మెగాస్టర్ చిరంజీవి చిత్రం విడుదలైంది. పదేళ్ల గ్యాప్ తర్వాత నటించిన చిత్రం అది. అలాంటి సినిమాకు మీడియా పోటీ పడి ప్రచారం కల్పిస్తాయని భావించారు. కానీ చిరు చిత్రం విడుదలైన రోజు ఏ మీడియా సంస్థ కూడా ఆ విషయానికి పెద్దగా ప్రధాన్యత ఇవ్వలేదు.

సినిమా ఎలా ఉందంటూ థియేటర్ల దగ్గరకు వెళ్లి ఆడియన్స్ ముందు మైక్‌లు పెట్టి  అడగలేదు. కానీ బాలకృష్ణ చిత్రం శాతకర్ణి విడుదలైన రోజు మాత్రం మీడియా ఛానళ్ల హడావుడి ఆకాశానికి అంటింది. ప్రతి బులిటెన్‌లోనూ శాతకర్ణి చిత్రానికి సంబంధించి హెడ్‌లైన్లు కనిపించాయి. థియేటర్ల దగ్గర అభిమానుల హంగామాను గంటల తరబడి చూపించారు. సినిమా సూపర్ డూపర్ హిట్‌ అంటూ ప్రేక్షకుల కంటే ముందుగానే టీవీ ఛానళ్లు ప్రకటించేశాయి.  అటు చిరు సినిమా విషయంలో మాత్రం తెలుగు టీవీ ఛానళ్లు తమకేమీ తెలియదన్నట్టు సైలెంట్‌గా ఉండిపోయాయి. సరే శాతకర్ణి మూవీ తెలుగు రాజు చరిత్రకు సంబంధించినది కాబట్టి మీడియా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిందనుకుందాం!. కానీ ఎప్పుడో రాజుల సంగతి దేవుడెరుగు ఇప్పుడు అన్నం పెట్టే రైతు … కార్పొరేట్ శక్తులకు బలైపోతున్నాయి. ఆ అంశాన్ని చిరంజీవి తన సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. కాబట్టి ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తే గతించిన రాజుల చరిత్రకు ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుందా లేక వర్తమానంలో కళ్లముందే కుంగిపోతున్న రైతుల సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందా అన్నదే ప్రశ్న.

కానీ ఇక్కడ అసలు నిజం ఏమిటంటే.. ప్రస్తుతం మీడియాను నడుపుతున్నది కూడా కార్పొరేట్ శక్తులే. పైగా చిరంజీవి తన సినిమాలో రైతుల భూములను ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు ఎలా లాక్కుంటున్నాయో చూపించారు. ఆ ధోరణికి వ్యతిరేకంగా గళం విప్పారు. చిరు సినిమాలో సన్నివేశాలకు రాజధాని , పోర్టులు, పరిశ్రమల నిర్మాణం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల నుంచి భూములు లాక్కుంటున్న విధానానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. చిరు చిత్రం చూస్తే ఏపీలో రైతులపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ప్రశ్నించినట్టుగా అనిపిస్తుంది. బహుశా ఈ విషయం తెలిసే కాబోలు చిరంజీవి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు కూడా చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.

చివరకు ప్రైవేట్‌ సంస్థకు చెందిన గ్రౌండ్‌లో ఫంక్షన్‌ నిర్వహించుకోవాల్సి వచ్చింది. బాలకృష్ణ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం, మీడియా ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నాయని చెప్పేందుకు మరో విషయం కూడా ఉంది. గతంలో తెలుగు నేలను పాలించిన రాణి రుద్రమదేవి చరిత్రను గుణశేఖర్ తెరకెక్కించారు. ఆ సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఆ చిత్రానికి పన్ను రాయితీ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నా పన్ను మినహాయింపు ఇవ్వలేదు. ఇప్పుడు శాతకర్ణి చిత్రానికి మాత్రం చంద్రబాబు వెంటనే పన్ను రాయితీ ఇచ్చేశారు. శాతకర్ణితో పాటు రైతుల స్థితిగతులను చాటిచెప్పేందుకు సామాజిక బాధ్యతతో తీసిన ఖైదీ నెంబర్‌ 150 చిత్రానికి కూడా అలాంటి పన్ను రాయితీలు ఎందుకు ఇవ్వకూడదన్నది చాలా మంది సంధిస్తున్న ప్రశ్న. కానీ వివక్షే వినసొంపుగా పాలన సాగుతున్న నేలపై ఇలాంటి ప్రశ్నలకు ప్రభుత్వాలు స్పందిస్తాయని కూడా ఆశించడం దురాశే. మొత్తం మీద చిరంజీవి చిత్రం విషయంలో ప్రభుత్వం, మీడియా వివక్ష చూపిన మాట మాత్రం వాస్తవం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

16 − eleven =