My title

ఆర్యవైశ్యుల నిర్ణయంతో అలజడి… బాలకృష్ణ పై కన్ఫ్యూజన్…

నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటర్లలో మార్పు టీడీపీని కలవరపాటుకు గురి చేస్తోంది. తమకే ఓటేస్తాయని భావించిన కొన్ని వర్గాలు ఇప్పుడు వైసీపీకి మద్దతు పలుకుతుండడంతో టీడీపీలో ఆందోళన వ్యక్తమవుతోంది. నంద్యాలలో అధిక ఓట్లు ఉన్న సామాజికవర్గాల్లో ఒకరైన ఆర్యవైశ్యులు తొలి నుంచి బీజేపీ దాని మిత్రపక్షాల వైపు నిలిచేవారు. కానీ నంద్యాల ఉప ఎన్నికల్లో మాత్రం పరిస్థితి మారిపోయింది. వైసీపీకే ఈ ఎన్నికల్లో మద్దతు తెలపాలని ఆర్యవైశ్యులు నిర్ణయించుకున్నారు.

ఇటీవల సదరు సమాజికవర్గం పెద్దలు సమావేశమై ఉప ఎన్నికలపై చర్చించారు. ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష వైసీపీని బలపరచాలని నిర్ణయించారు. అధికారంలోకి రాగానే ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు, బంగారం వ్యాపారం చేసే వైశ్యులకు దొంగ బంగారం పేరుతో పోలీసుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను తొలగిస్తామని జగన్‌ హామీ ఇవ్వడం సదరు సామాజికవర్గంలో బాగానే ప్రభావం చూపింది. శిల్పామోహన్ రెడ్డి సాప్ట్‌ నేచర్‌ కూడా ఆర్యవైశ్యులు వైసీపీ వైపు మొగ్గు చూపడానికి మరో కారణంగా చెబుతున్నారు.

ఇటీవల జరిగిన ఈ సమావేశంలో రాయలసీమకు చెందిన పలువురు కుల పెద్దలు పాల్గొన్నారు. కార్పొరేషన్‌ ఏర్పాటుపై చంద్రబాబు మాట తప్పినందున సత్తా చూపించాలని ఆర్యవైశ్యులు నిర్ణయించుకున్నారు. బీజేపీ వాసన తగిలితే నంద్యాలలో ముస్లిం ఓటర్లు దూరమవుతారన్న ఉద్దేశంతో చంద్రబాబు … బీజేపీ సాయం తీసుకోవడం లేదు. దీంతో ఆర్యవైశ్యులను బుజ్జగించే వారు కూడా టీడీపీ తరపున కనిపించడం లేదు. టీజీ వెంకటేశ్ ఉన్నా ఆయన మాట కూడా ఇప్పుడు ఆర్యవైశ్యులు వినే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి తోడు జగన్ వార్డుల వారీగా ప్రచారానికి దిగడంతో టీడీపీ ఆందోళన పెరుగుతోంది. టీడీపీ తరపున స్టార్‌ క్యాంపెయినర్ కరువైనట్టు భావిస్తున్నారు.

పవన్‌ కల్యాణ్‌ను తీసుకొస్తే బాగుంటుందని కొందరు టీడీపీ నేతలు పార్టీ హైకమాండ్‌ వద్ద అభిప్రాయపడుతున్నారు. అది సాధ్యం కాని పక్షంలో కనీసం బాలకృష్ణనైనా తీసుకురావాలని కోరుతున్నారు. బాలకృష్ణ వస్తే ఆయన్ను చూసేందుకు జనం వస్తారని అప్పుడు పార్టీలో కొంచెం ఊపు కనిపిస్తుందని అభిప్రాయపడుతున్నారు. అయితే బాలకృష్ణ ప్రచారానికి వచ్చినా అభిమానులను దూషించడం, కొట్టడం లాంటి వివాదాస్పద చర్యలకు దిగకుండా ముందే చెప్పి పంపాలని పార్టీ పెద్దలను నంద్యాల టీడీపీ నేతలు కోరుతున్నారు. పోలింగ్‌ సమీపించిన సమయంలో కనీసం ఒకటి రెండురోజులైనా బాలకృష్ణ ప్రచారం చేస్తే సరిపోతుందంటున్నారు. మొత్తం మీద నంద్యాలలో ఎక్కువ ఓట్లు ఉన్న ఆర్యవైశ్యులు దూరమవడం, పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌ కొరత ఉండడం చూసి టీడీపీ శ్రేణులు దిగులు పడుతున్నాయి.