My title

విష్ణుచ‌క్రంతో టీడీపీ సీటు చిరిగిపోయింది!

ఏపీ బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్ రాజు మరోసారి మిత్రపక్షం టీడీపీపై సెటైర్ల విష్ణుచక్రం విసిరారు…. ఈ విశాఖ రాజుగారు ప్ర‌తిప‌క్షంతో పాటు అప్పుడ‌ప్పుడు మిత్ర‌ప‌క్షం టీడీపీకి కూడా బూజు దులుపుతూ ఉంటారు…. తాజాగా ఆయ‌న మ‌రోసారి ప‌రోక్షంగా చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించారు…. ఏపీలో అసెంబ్లీ సీట్లు పెంచుతారంటూ విప‌క్ష వైసీపీ నుంచి 20మంది ఎమ్మెల్యేల‌ను లాగేశారు చంద్ర‌బాబు… ఆ విష‌యాన్ని అన్యాప‌దేశంగా ప్ర‌స్తావిస్తూ ఏపీలో 225 అసెంబ్లీ సీట్ల చాప్ట‌ర్ ముగిసిపోయిన‌ట్లే అని విష్ణుకుమార్ అన్నారు. ఇక కొత్తగా సీట్లు పెరిగే అవకాశమే లేదు కాబట్టి ఆ ఆశ చూపి ఇతర పార్టీలనుంచి ఎమ్మెల్యేలను ఆకర్షించే పథకానికి ముగింపు పలకాలన్నట్లుగా పరోక్షంగా టీడీపీకి సంకేతాలిచ్చాడు. ఇక సీట్లు పెరగవన్న విషయం టీడీపీ అధిష్టానానికి అందరికన్నా భాగా తెలుసుకాబట్టి  అందుకే 175 సీట్ల‌ను గెలుస్తామ‌ని టీడీపీ చెబుతోంద‌ని విష్ణు చెప్పారు.

విష్ణుకుమార్ రాజు ఇలా కుండ‌బ‌ద్ద‌లు కొట్ట‌డంతో టీడీపీ ఇర‌కాటంలో ప‌డింది… ఆయ‌న  విష్ణు చ‌క్రం విస‌ర‌డంతో సైకిల్ సెల్ఫ్ డిఫెన్స్‌లో ప‌డింది… త‌మంత‌ట తాము ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టి టీడీపీ సెల్ఫ్‌గోల్ చేసుకుంద‌న్న‌ట్టు ఆయ‌న మాట్లాడ‌డం ఏపీలో క‌ల‌క‌లం రేపింది.. దీనిపై ఎలా స్పందించాలా అని టీడీపీ నేత‌లు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నారు.

మ‌రోవైపు టీడీపీ మిత్ర‌ప‌క్ష‌మే ఇంత మాట అనేస‌రికి ఇక ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కి ఫుల్‌స్టాప్ ప‌డిన‌ట్టే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు… ఇక వైసీపీ నుంచి టీడీపీలోకి ఎవరు జంప్ చేయ‌బోర‌ని చెబుతున్నారు… జంప్ చేద్దామ‌నుకున్న నేత‌లు కూడా సీటు గ్యారంటీ స్కీమ్ లేదు కాబ‌ట్టి… ఉన్న సీటును కాపాడుకుంటూ వైసీపీలోనే కొన‌సాగుతార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు… ఇలా త‌న మాట‌ల‌తో టీడీపీని ఇబ్బందుల్లో ప‌డేశారు విష్ణుకుమార్‌రాజు.  విష్ణుచ‌క్రంతో టీడీపీ సీటు చిరిగిపోయింది…. ఆయ‌న మాట‌లు శ‌త్రుప‌క్షం వైసీపీకి మేలు చేస్తే మిత్ర‌ప‌క్షం టీడీపీకి కీడు చేశాయ‌ని అమ‌రావ‌తి వ‌ర్గాలు భావిస్తున్నాయి.