My title

రోహింగ్యాల‌కు వ‌రుణ్ గాంధీ మ‌ద్ద‌తు

బిజెపి ఎంపీ వ‌రుణ్ గాంధీ మ‌రో వివాదానికి తెర‌తీసారు. కేంద్ర ప్ర‌భుత్వం తీవ్రంగా వ్య‌తిరేస్తున్న రోహింగ్యాల‌ను వెన‌కేసుకు వ‌చ్చారు. భార‌త సంస్కృతి ఎంతో గొప్ప‌ద‌ని …ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం దృష్టిలో పెట్టుకుని రోహింగ్యాల‌ను మ‌య‌న్మార్ తిరిగి పంపే విష‌యంలో ఆలోచించాల‌ని ఆయ‌న కోరారు. హిందీ ప‌త్రిక న‌వ‌భార‌త్ టైమ్స్‌లో వ‌రుణ్ గాంధీ ఈ అంశ‌మై ఓ ఆర్టిక‌ల్‌ రాశారు.

దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 4 కోట్ల మంది శ‌ర‌ణార్ధులుగా వ‌చ్చార‌ని వ‌రుణ్ గాంధీ తన ఆర్టిక‌ల్‌లో ప్ర‌స్తావించారు. తాను రాసిన ఆర్టిక‌ల్ లింక్‌ను ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. శ‌ర‌ణార్దుల విష‌య‌మై ప్ర‌భుత్వం ఒక జాతీయ పాల‌సీని త‌యారు చేయాల‌ని సుల్తాన్‌పూర్‌ ఎంపీ సూచించారు.

ఢిల్లీలో రోహింగ్యాల దుస్థితిని ఆయ‌న వివ‌రించారు. ఆఫ్ఘ‌న్ నుంచి వ‌చ్చిన వారితో పోల్చితే మ‌య‌న్మార్ నుంచి వ‌చ్చిన రోహింగ్యాలు…. ఢిల్లీ లో ఉద్యోగాలు సంపాదించ‌డంలో ఇబ్బందులు ప‌డుతున్నార‌ని వ‌రుణ్ గాంధీ తెలిపారు.

వ‌రుణ్ గాంధీ అభిప్రాయాలను కేంద్రం ఖండించింది. కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి హ‌న్స‌రాజ్ అహిర్ వ‌రుణ్ అభిప్రాయాల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దేశ భ‌ద్ర‌త ప‌ట్ల అవ‌గాహ‌న ఉన్న ఏ వ్య‌క్తీ ఇటువంటి ఆర్టిక‌ల్ రాయ‌డ‌ని ఆయన కోప్ప‌డ్డారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి ఎవ‌రూ వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేయ‌రాద‌ని మంత్రి స్ఫ‌ష్టం చేశారు.

రోహింగ్యాలు భార‌త్‌లో స్థిర‌ప‌డేందుకు ప్ర‌భుత్వం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అంగీక‌రించ‌ద‌ని ఆయ‌న తెలిపారు.

రోహింగ్యాలు మ‌య‌న్మార్ ప్ర‌భుత్వాన్నే ఇరకాటంలో పెట్టార‌ని…అక్క‌డి ప్ర‌భుత్వ‌మే వారిని తిర‌స్క‌రించిన‌పుడు మ‌న‌మెందుకు వారిని ఆదుకోవాల‌ని మంత్రి ప్ర‌శ్నించారు.

మంత్రి వ్యాఖ్య‌లు వెలువడిన వెంట‌నే వ‌రుణ్ గాంధీ కాస్త త‌గ్గారు. ట్విట్ట‌ర్ ద్వారా వివ‌ర‌ణ ఇచ్చారు. వారి ప‌ట్ల సానుభూతిని వ్య‌క్తం చేశాన‌ని ….శ‌ర‌ణార్ధుల విష‌యంలో మ‌న పాల‌సీ గురించి అధికంగా అందులో ప్ర‌స్తావించాన‌ని వ‌రుణ్ క్లారిటీ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించారు.

ఈ విష‌యం ఇక్క‌డితో ఆగుతుందో ….మ‌రింత ముందుకు వెళుతుందో వేచి చూడాలి. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేసిన వారిని వ‌దిలిపెట్టే అవ‌కాశాలు బిజెపీలో చాలా త‌క్కువ‌.