My title

ఉంగరాల రాంబాబు మూవీ రివ్యూ

రివ్యూ: ఉంగరాల రాంబాబు

రేటింగ్‌:   1.5 /5

తారాగణం:  సునిల్‌, మియా జార్జ్‌, ఆశిష్‌ విద్యార్ధి, పోసాని కృష్ణ మురళి తదిత‌రులు

సంగీతం: జిబ్రాన్

నిర్మాత:  పరుచూరి కిరీటీ

దర్శకత్వం: క్రాంతి మాధవ్

అనగనగా ఒక కమెడియన్. టాలీవుడ్ లో మంచి పేరు ఉంది. గుర్తింపు వచ్చింది. అగ్ర హీరోలు తమ సినిమాల్లో ఇతను ఉండాల్సిందే అని పట్టుబట్టే రేంజ్ కి చేరుకున్నాడు. ఇంతలో ఒక చీమ కుట్టింది. దాని పేరే హీరో ఇమేజ్. కుట్టినప్పుడు తీయగా అనిపించింది. ఇదేదో బాగానే ఉంది కదా అని పదే పదే కుట్టించుకోవడం స్టార్ట్ చేసాడు. మెల్లగా నొప్పి తెలియడం మొదలైంది.  చీమకు మాట ఇచ్చాం కదా వదలకుండా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. చివరికి చీమ కుట్టిన చోట వాపు వచ్చి అది పుండుగా మారి శరీరంలో ఆ భాగం తీసేసే దాకా తెచ్చుకున్నాడు. ఈ కథంతా ఎవరి గురించో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. అవును సునీల్ గురించే.

సరిగ్గా ఇదే చీమ గతంలో ఆలి, బ్రహ్మానందం, బాబు మోహన్ లను కూడా కుట్టింది. కాని సరైన టైం లో దీనికి అలవాటు పడితే ప్రమాదమని గుర్తించి వెంటనే దాన్ని విదిలించుకుని ఎన్నో మంచి సినిమాలు తమ ఖాతాలో వేసుకుని దర్జాగా ఎటువంటి సమస్య లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. సునీల్ కు వాళ్ళకు ఉన్న తేడా అదే.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ రోజు విడుదలైన ఉంగరాల రాంబాబు సినిమాకు వీటికి చాలా దగ్గరి సంబంధం ఉంది కాబట్టి. తనను తాను మాస్ హీరోగా ఊహించుకుని చేసిన కథలతోనే తిప్పి తిప్పి అవే తీస్తూ బాక్స్ ఆఫీస్ వద్దు మహా ప్రభో అని తిప్పి కొడుతున్నా వదలకుండా ప్రేక్షకులను హింసిస్తున్న సునీల్ చేసిన మరో మాస్టర్ పీస్ ఉంగరాల రాంబాబు. కథ ఏమంటారా. మీ ఆనందం ఎందుకు కాదనాలి. పదండి.

ఒక జాతకాల పిచ్చోడు. పేరు రాంబాబు. సావిత్రి ప్రేమలో పడతాడు. ఆమె తండ్రి రంగా. గొప్ప సంఘ సంస్కర్త. కేరళలో ఉంటాడు. రైతుల తరఫున వకాల్త పుచ్చుకుని భూమి సమస్యల మీద పోరాటం చేస్తూ ఉంటాడు. సావిత్రి రాంబాబుని కేరళకు తీసుకెళ్ళి వాళ్ల నాన్నకు పరిచయం చేస్తుంది. రాంబాబు తన అల్లుడిగా పనికి వస్తాడా రాడా అని రంగా రకరకాల పరీక్షలు పెడతాడు. ఈ లోపు రైతు ఇష్యూ సీరియస్ అవుతుంది. రాంబాబు కూడా రంగంలోకి దిగాల్సి వస్తుంది. మరి చివరికి ఏమవుతుంది. మీ బుర్రకు శ్రమ లేకుండా ఈజీగా మీకు గెస్ వచ్చేసి ఉంటుంది.

సునీల్ ఇక హీరోగా మానేస్తే పరిశ్రమకు, అతనికీ చాలా మంచిది.  తాను సోలో హీరోగా సినిమాలు చేస్తూనే ఉంటాను అంటే ముందు ముందు సునీల్ సినిమా పోస్టర్ కనపడితే పారిపోయే రోజులు వస్తాయి. హీరోగా సునీల్ కు చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. వాటిని మర్చిపోయి పదే పదే ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటె పెట్టుబడి పెట్టినందుకు నిర్మాతలకు చుక్కలు కనిపించడం కన్నా ప్రయోజనం శూన్యం. హీరొయిన్ మియా జార్జ్ ముద్దు ముద్దుగా బాగుంది. ఈ సినిమా చేయటం తనకు శాపమే. బన్నీ మూవీ లో శరత్ కుమార్ పాత్రను తిప్పి రాసుకుని దిద్దిన రంగా పాత్రలో ప్రకాష్ రాజ్ తన కెరీర్ లో ఎన్నో సార్లు చేసిన అనుభవంతో నోట్లో నీళ్ళు పుక్కిలించినంత ఈజీగా చేసేసాడు. ఇక కామెడీ బ్యాచ్ వెన్నెల కిషోర్, పోసాని షరా మామూలే. రాజీవ్ కనకాల, ఆశిష్ విద్యార్ధి, చలపతి రావు వీళ్ళకు ఇందులో చేసింది కొట్టిన పిండి కాదు పులిసిన పిండి లాంటి పాత్రలు.

దర్శకుడు క్రాంతి మాధవ్ మంచి సినిమాలు ఇకపై తీయకూడదు అని గట్టి నిర్ణయం తీసుకుని ఈ సినిమా చేసినట్టు కనిపిస్తుంది. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ లాంటి పోయేటిక్ మూవీ తీసింది ఇతనేనా అని అనుమానం వచ్చేలా ఉంది ఈ సినిమా. రొటీన్ ఫార్ములా అనిపిస్తుందనే కాబోలు కేరళ బ్యాక్ డ్రాప్ జోడించడం వరకు బాగానే ఉంది కాని మిగిలినదంతా మనకు బాగా అలవాటై విసుగు తెప్పించే వ్యవహారం. ఇంతోటి దానికి క్రాంతి మాధవ్ అక్కర్లేదు. ఒక చోటా అప్ కమింగ్ డైరెక్టర్ కు ఇచ్చినా తీసి పెడతాడు. ఇంత మాట అనడానికి కారణం క్రాంతి మాధవ్ లాంటి దర్శకులు మనకు అరుదు. వీళ్ళు కూడా ఇలాంటి నాటు కొట్టుడు మూస కథల వలలో పడితే ఇవే మరికొన్ని వచ్చే ప్రమాదం ఉంది. జీబ్రాన్ మ్యూజిక్ గురించి డిస్కషన్ అనవసరం. సునీల్ ఎంత ప్రయత్నించినా యంగ్ గా కనిపించడం జరగని పని. సో సర్వేశ్ మురారి కెమెరా గురించి కామెంట్ అక్కర్లేదు. పరుచూరి కిరీటి గారి డబ్బులు మొత్తం కృష్ణార్పణం అయిపోయాయి. సునీల్ మీద ఇంత పెట్టుబడి పెట్టినందుకు మాత్రం సన్మానం చేయాల్సిందే.

ఫైనల్ గా చెప్పాలంటే ఉంగరాల రాంబాబు కనీసం టైం పాస్ చేయించే రొటీన్ కమర్షియల్ మూవీ కూడా కాదు. ఒక సాదా సీదా అనిపించే మామూలు సినిమా. అంచనాలు లేకుండా వెళ్ళినా కూడా రాంబాబు నిరాశ పరుస్తాడు. ఇప్పటికైనా సునీల్ తన బలమైన కామెడీని నమ్ముకుని ఆ లైన్లో వేరే సినిమాల్లో కూడా నటించడం మొదలు పెడితే బాగుంటుంది. లేదు నన్ను నమ్ముకుని ఇంకా చాలా మంది నిర్మాతలు హీరోగా సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు అనే అమాయకత్వంలో ఉంటే మాత్రం సునీల్ టాలీవుడ్ లో కనుమరుగు అవడం ఎంతో దూరంలో లేదు. మీకు మరీ సమయం ఖాళీగా  ఉంటే తప్ప ఉంగరాల రాంబాబు ఛాయిస్ కాదు.