My title

బ్రిట‌న్‌లో దావూద్ ఆస్తులు జ‌ప్తు

అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీంకు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. బ్రిట‌న్‌లో దావూద్‌కి చెందిన కోట్లాది ఆస్తుల‌ను అక్క‌డి అధికారులు జ‌ప్తు చేశారు. భార‌త ప్ర‌భుత్వం అందించిన స‌మాచారంతో బ్రిటీష్ అధికారులు రంగంలో దిగారు. ఆర్ధిక మూలాల‌ను దెబ్బ‌తీసేందుకు డిసైడ్ అయ్యారు.

యూరోప్‌,ఆఫ్రికా, ద‌క్షిణాసియాలో నేర సామ్రాజ్యాన్ని విస్త‌రించిన దావూద్‌కు కేవ‌లం బ్రిట‌న్‌లోనే 450 మిలియ‌న్ డాల‌ర్ల విలువ చేసే ఆస్థులు ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. వీటిలో కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. ప్ర‌ధానంగా మిడ్‌లాండ్స్‌లో ఉన్న ఆస్థుల‌ను జ‌ప్తు చేశారు. మిడ్‌లాండ్‌లో దావూద్‌కు విలాస‌వంత‌మైన విల్లాలు, ఓ హోట‌ల్ కూడా ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. 2015లో భార‌త‌దేశం నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రే అధికారులు మిడ్‌లాండ్‌లో ప‌ర్య‌టించి దావూద్‌కు ఉన్న ఆస్థుల‌ను గుర్తించారు.

దావూద్‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో లెక్క‌కు మించిన ఆస్థులు ఉన్నాయి. 2015లో ఫోర్బ్స్ ప‌త్రిక అంచ‌నా ప్ర‌కారం దావూద్‌కు ప్ర‌పంచ   వ్యాప్తంగా  6.7 బిలియ‌న్ డాల‌ర్ల ఆస్థులు ఉన్నాయి.

దావూద్ నేర చ‌రిత్ర‌

1993లో ముంబైలో జ‌ర‌గిన వ‌రుస బాంబు పేలుళ్ల‌లో దావూద్ ఇబ్ర‌హీం ప్ర‌ధాన నిందితుడు. ఆ దారుణ ఘ‌ట‌న‌లో 260 మంది ప్రాణాల‌ను కోల్పోయారు. అనేక మంది గాయ‌ప‌డ్డారు. బాంబు పేలుళ్ల అనంతరం దావూద్ ముంబై నుంచి పారిపోయి పాకిస్థాన్‌లో త‌ల‌దాచుకుంటున్నాడు.

అక్క‌డి నుంచి త‌న నేర సామ్రాజ్యాన్ని విస్త‌రించాడు. 5 ఖండాల్లో 16 దేశాల్లో డి కంపెనీ ద్వారా అనేక నేరాల‌కు పాల్ప‌డుతున్నాడు. ఇంగ్లండ్‌, దుబాయ్‌, భార‌త్‌ల‌లో ఎక్క‌వుగా ఆస్తుల‌ను పోగుచేశాడు. భార‌త‌దేశంలో 70 శాతం పైర‌సీ మార్కెట్ కూడా దావూద్ చేతుల్లేనే ఉంది.

బాలీవుడ్‌తో దావూద్‌కు ఉన్న సంబ‌ధాల గురించి అంద‌రికీ తెలిసిన‌దే. నిర్మాత‌ల‌ను బెదిరించి భారీ మొత్తంలో డ‌బ్బులు వ‌సూలు చేయ‌డం, అనేక సినిమాల‌కు ఫండింగ్ చేయ‌డం వంటివి దావూద్ ఇబ్ర‌హీంకు వెన్న‌తో పెట్టిన విద్య‌లు. దొంగ‌నోట్ల చెలామ‌ణీ, డ్ర‌గ్స్ వ్యాపారం, ఉగ్ర‌వాదుల‌కు ఆర్ధికంగా సాయం చేయ‌డం, క్రికెట్ బెట్టింగ్ వంటివి దావూద్ ప్ర‌ధాన ప‌నుల్లో కొన్ని. వీటితో పాటు అల్‌ఖైదా వంటి సంస్థ‌ల‌తో కూడా దావూద్ ట‌చ్‌లో ఉంటున్నాడు.

ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌తో క‌దిలిన యంత్రాంగం

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ 2015లో బ్రిట‌న్‌లో ప‌ర్య‌టించారు. ఆ సంద‌ర్భంగా ఆయ‌న దావూద్ ఇబ్ర‌హీంకి సంబందించిన కీల‌క స‌మాచారాన్ని అప్ప‌టి ప్ర‌ధాని డేవిడ్ కామెరూన్‌కు అందించారు. మోడీ ఇచ్చిన స‌మాచారాన్ని ఆధారంగా చేసుకుని బ్రిట‌న్ పోలీసు అధికారులు రెండేళ్ల పాటు మ‌రికొన్ని అంశాల‌ను ప‌రిశీలించి చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించారు. దావూద్ 21 మారు పేర్ల‌తో వివిధ రూపాల‌లో తిరుగుతున్న‌ట్లు బ్రిట‌న్ అధికారులు త‌మ వెబ్‌సైట్‌లో ఇటీవ‌లే వెల్ల‌డించారు.