My title

ట్రంప్‌ చేస్తే తప్పు…. చంద్రబాబు చేస్తే ఒప్పునా?

అమెరికాలో వచ్చిన ఇర్మా తుపాను సృష్టించిన విధ్వంసం తరవాత డొనాల్డ్‌ ట్రంప్‌ తన చర్యల వల్ల పర్యావరణానికి ఏవిధంగా నష్టం కలిగిస్తున్నాడో, ధీర్ఘకాలంలో ప్రపంచానికి, మానవాళికి ఎంత చెడు జరుగుతుందో మన తెలుగుపత్రికలు కూడా సవివరంగా వార్తలు, సంపాదకీయాలు రాసి ట్రంప్‌కు నీతులు చెబుతున్నాయి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌ అనేది ఒకటి ఉందని…. అక్కడి పత్రికలు తనకు చాలా హితబోధచేస్తున్నాయని ఆయనకు తెలిసే అవకాశమే లేదు. అయినా పత్రికలు తమ బాధ్యతగా తమ కర్తవ్య నిర్వహణ చేశాయి. సంతోషం.

అయితే ట్రంప్‌ తన స్థాయిలో తను పర్యావరణానికి విఘాతం కలిగించే పనులు చేస్తుంటే…. చంద్రబాబు తన స్థాయికి మించి పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాడు. అక్కడ రాజధాని కడితే కొడుకు ముఖ్యమంత్రి అవుతాడన్న ఒకేఒక గుడ్డి నమ్మకంతో ఏడాదికి నాలుగు పంటలు పండే సస్యశ్యామలమైన బంగారంలాంటి 30వేల ఎకరాల పంట భూమిని రాజధానిగా మార్చేస్తున్నాడు. మరో 30వేల ఎకరాల అటవీ ప్రాంతాన్ని కూడా తనకు ఇచ్చేస్తే చెట్లన్నీ కొట్టేసి బిల్డింగ్‌లు కడుతానని కేంద్రప్రభుత్వాన్ని అడుగుతున్నాడు. ఇలాంటి వ్యవహారాలమీద మన తెలుగు పత్రికలు వినపడని ట్రంప్‌కు నీతులు చెబుతాయిగానీ, ఎదురుగా కనిపించే చంద్రబాబుకు నీతులు చెప్పవు. పైగా గ్రాఫిక్స్‌లో రాజధాని బీడుభూముల్లో రాజమౌళి బాహుబలి సెట్స్‌వేసి జనాన్ని మభ్యపెట్టే బాధ్యతను తమ భుజస్కందాలపై వేసుకుంటాయి.

రాజధాని ప్రాంతంలో ప్రవహించే చిన్నచిన్న కాలువలను పూడ్చేసి ఇప్పటికే కొన్ని కార్పొరేట్‌ సంస్థలు అక్కడ నిర్మాణాలు మొదలుపెట్టాయి. భవిష్యత్తులో ఎప్పుడైనా పెద్ద వర్షం వస్తే రాజధాని ప్రాంతంలో ఒకటో అంతస్తు లేదా రెండో అంతస్తు దాకా నీళ్లు వచ్చే దృశ్యాలను భవిష్యత్తులో మనం చూస్తాం. ఇటీవల వచ్చిన చెన్నై వరదలలో అలాంటి దృశ్యాలు చూశాం. త్వరలో రాజధానిలో చూడబోతున్నాం. ఈ విషయాలన్నీ చంద్రబాబుకు భజన చేసే పత్రికలకూ తెలుసు. అయినా ట్రంప్‌కు నీతులు చెప్పే నోటితో చంద్రబాబుకు నీతులు చెప్పడం వాళ్లకూ ఇబ్బందే…!