My title

నిర్మాతలకు, హీరోలకు అంత భయం దేనికి?

ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమ సోషల్‌మీడియా వల్ల చాలా ఆందోళన పడుతోంది. కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమా కొన్నిసార్లు సోషల్‌మీడియాలో సమీక్షల దెబ్బకు రెండోరోజునుంచే థియేటర్లలో ఈగలు తోలుకోవాల్సిన పరిస్థితి.

గతంలో సినిమా రిలీజ్‌ అయ్యాక బాగుందని పేరు వస్తే 100రోజులు అంతకన్నా ఎక్కువగా ఆడేవి. ఆ తరువాత నిర్మాతల్లోనూ, డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌లోనూ చాలామార్పులు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలలోని సినిమా థియేటర్లన్నీ ముగ్గురు, నలుగురు చేతుల్లోకి వెళ్లిపోయాయి. దీని వల్ల జరిగిన నష్టం ఏమిటంటే కొన్ని మంచి సినిమాలు, చిన్న సినిమాలు ఆడించుకోవడానికి వీలులేని పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా మంచి సినిమా తీద్దామనుకున్నా, తీసినా రిలీజ్‌ చేసుకోలేని దుస్థితి ఏర్పడింది. ఎవరిచేతిలో అయితే థియేటర్లు ఉండిపోయాయో వాళ్లు ఆడిందే ఆట, పాడిందే పాట. వాళ్ల కుటుంబ సభ్యులనే హీరోలుగా పెట్టి వందల థియేటర్లలో ఆ సినిమాలు విడుదలచేయించి, ఆడించి వాళ్లను మహా హీరోలుగా జనం నెత్తిన రుద్దేశారు. వీళ్లతో పాటు సినీరంగానికి చెందిన వాళ్ల వారసులు కూడా కొన్నిసార్లు బలవంతంగానే హీరోలుగా జనం నెత్తిన తాండవం చేస్తున్నారు. ఇదంతా ఒక పార్శ్వం అయితే…..

…. మరో పార్శ్వం తాము అనుకున్న హీరోల సినిమాలను వేలాది థియేటర్లలో రిలీజ్‌ చేసి, ఆడించగల వ్యక్తులు తెలుగు సినిమా పరిశ్రమలో ముగ్గురు నలుగురు తయారయ్యారు. దాంతో సినిమా బాగుందో లేదో జనం నిర్ణయించేలోగా కొన్ని వేల షోలు పడిపోతాయి. కోట్లాది రూపాయలు వసూలైపోతాయి. ఇలాంటి పరిస్థితి వచ్చాక నలుగురో ఐదుగురో మహా హీరోలుగా మిగిలిపోయారు. చిన్నవాళ్లు చితికిపోయారు. గతంలో 100రోజులు ఆడితే వచ్చే డబ్బులు ఇప్పుడు వారంలో వస్తున్నాయి. మీడియాను మ్యానేజ్‌ చేసి పెయిడ్‌ ఆర్టికల్స్‌తో, పెయిడ్‌ బులిటెన్స్‌తో సినిమా మీద పాజిటివ్‌ టాక్‌ తెచ్చి ఒకటి రెండు వారాలలోనే కోట్లాది రూపాయల లాభాలను పిండుకునే అవకాశం ఉండేది.

సోషల్ మీడియా విజృంభించాక దీనిని డబ్బుతో, పలుకుబడితో మ్యానేజ్‌ చేయడానికి వీలులేని పరిస్థితి. ఎంతమందినని మ్యానేజ్‌ చేస్తారు. దాంతో సినిమా రిలీజ్‌ అయ్యాక ఒక షో పూర్తికాగానే అది బాగుందో లేదో అందరికీ తెలిసిపోయేలా పోస్టులు పెడుతున్నారు. అలాగే కొన్ని వెబ్‌సైట్లు నిర్మొహమాటంగా సమీక్షలు రాస్తున్నాయి. సినిమా మీద మంచి అవగాహన కలిగిన కొందరు గొప్ప సమీక్షలు రాస్తున్నారు. దాంతో చాలామంది సోషల్‌మీడియాలో రివ్యూలు చదివి సినిమాకు వెళ్లాలో వద్దో నిర్ణయించుకునే పరిస్థితి నెలకొంది. అందువల్లే వందలకోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమా బాగాలేకపోతే రెండోరోజే దెబ్బతింటోంది. మీడియా ద్వారా నిర్మాతలు ఎంత హైప్‌ క్రియేట్‌ చేయాలని ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. అలాగే కొందరు హీరోల అభిమానులు తమ హీరో సినిమా రిలీజ్‌ కాగానే సోషల్‌ మీడియాలో ఆహా ఓహో అంటూ పోస్టులు పెట్టినా, అలాగే వేరే వర్గం హీరో సినిమా రిలీజ్‌ అయినప్పుడు తుస్సుమంది అని పోస్టులు పెట్టినా…. అదంతా ఒక్క రోజు వైభోగమే. రెండోరోజు కల్లా సోషల్‌మీడియా ద్వారానే ఆ సినిమా సత్తా ఏమిటో తెలిసిపోతోంది. ఇది మరో పార్శ్వం అయితే….

మరో పార్శ్వం …. చాలా బాగున్న చిన్న సినిమాలు సోషల్‌ మీడియా వల్ల విపరీతంగా ప్రజాదరణ పొందుతున్నాయి. ఉదాహరణకు…. పెళ్ళిచూపులు, ఫిదా, శతమానం భవతి, అర్జున్‌ రెడ్డి…. మరీ ముఖ్యంగా అర్జున్‌ రెడ్డి అయితే సోషల్‌ మీడియాలో దానిమీద జరిగిన చర్చ వల్లే అంత సక్సెస్‌ అయింది. ఇది పెద్ద నిర్మాతలు, తమ కుటుంబాలే సినిమా పరిశ్రమను ఏలాలనుకునే వాళ్లు, తాము మాత్రమే హీరోలుగా చెలామణి కావాలనుకునే వాళ్లు , తమ గుప్పెట్లోనే సినీ పరిశ్రమ ఉండాలనుకునే వాళ్లు భరించలేకపోతున్నారు…. కానీ వాళ్లు చేయగలిగింది ఏమీ లేదు. మార్పులను ఆహ్వానించడం తప్ప.