My title

మృత్యు శ్వాస

అది నెమ్మదిగా ప్రాణాలు తీసే వ్యాధి. మన దేశంలో 30 లక్షల నుంచి కోటి మంది దాకా ఆ వ్యాధి బారిన పడుతున్నారు. అయినా ఆ వ్యాధిని నయం చేయడానికి తీసుకోవాల్సినంత శ్రద్ధ తీసుకోవడం లేదు. ఈ సిలికోసిస్ వ్యాధికి గురై కుటుబానికి ఆధారంగా ఉన్న వారు మరణించిన 16 కుటుంబాల వారికి ఒరిస్సాలోని ఓ కార్మిక న్యాయస్థానం నష్టపరిహారం చెల్లించాలని తీర్పు చెప్పిన తర్వాత మాత్రమె నియంత్రణ లేని గనుల తవ్వకం, పరిశ్రమలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమైంది. కియోంఝార్ జిల్లాలోని మదరంగజోడి గ్రామంలో పైరోఫైల్లయిట్ ను చూర్ణం చేసే పరిశ్రమలో పనిచేసే వారు. వారు ఆ ధూళిని పీల్చి మరణించారు. ఆ ధూళిని పీల్చడం వల్ల కలిగే ప్రమాదం ఏమిటో తెలియకుండా వారు పని చేశారు. కాలక్రమేణా వారి ఊపిరితిత్తులు మూసుకు పోయి మరణించారు. సిలికోసిస్ వ్యాధికి చికిత్స లేదు. ఇంతమంది మరణించడంతో ఆ గ్రామం “వితంతువుల గ్రామం”గా మారిపోయింది. స్థానిక సంస్థ ఈ విషయమై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన తర్వాత మాత్రమే దర్యాప్తు ప్రారంభమైంది. వీరంతా సిలికోసిస్ వ్యాధి వల్ల మరణించారని తేలింది. ఒక వేళ వారు పని చేసిన సంస్థ వారికి ఆ ధూళి పీల్చనవసరం లేని ఉపకరణాలు సరఫరా చేసి ఉంటే, ధూళి రేగకుండా జాగ్రత్త తీసుకుని ఉంటే వారు అకాలమరణం పాలయ్యేవారు కాదు. ఈ 16 మంది కుటుంబాలకు 46 లక్షల పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఒరిస్సా ప్రభుత్వాన్ని ఆదేశించింది.

గుజరాత్ లోని గోధ్రా, బాలసినోర్ గ్రామాలలో రాళ్లను చూర్ణం చేసే పరిశ్రమలో పదేళ్లకు పైగా పని చేస్తున్న 238 మంది కార్మికుల విషయంలో సుప్రీం కోర్టు కీలకమైన తీర్పు ఇచ్చినందువల్ల ఒరిస్సాలోని న్యాయస్థానం 16 మందికి నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశించడానికి అవకాశం కలిగింది. గుజరాత్ లోని ఆ పరిశ్రమలో పని చేసిన వారు మధ్యప్రదేశ్ లోని అలి రాజ్ పూర్, ఝబువా, ధార్ జిల్లాలకు చెందిన కార్మికులే. ఒరిస్సాలోని కార్మికులలాగే వీరంతా ముందు జబ్బు పడ్డారు. వారికి సిలికోసిస్ వ్యాధి సోకినట్టు తేలింది. ఈ ధూళి రేణువులకు ఏ వాసనా ఉండదు. అందువల్ల ప్రాణాంతకమైన ధూళి పీలుస్తున్నట్టు తెలియదు. ఒక స్వచ్ఛంద సంస్థ వీరి వ్యవహారాన్ని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాల్సి వచ్చింది. సుప్రీం కోర్టు ఈ విషయంలో అస్పష్టతకు తావు లేని గట్టి తీర్పు ఇచ్చింది. మరణించిన 238 మంది కార్మికుల మీద ఆధారపడిన కుటుంబాలకు 7.14 కోట్ల పరిహారం చెల్లించాలని సుప్రీం కోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పరిశ్రమలో పని చేసి జబ్బు పడ్డ 304 కార్మికులకు పునరావాసం కల్పించాలని సుప్రీం కోర్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది.

ఈ రెండు సంఘటనల్లోనూ స్పష్టంగా కనిపించేది ఏమిటంటే ఆ పరిశ్రమలు స్వల్పకాలిక ఒప్పందం మీద కార్మికులను నియమించింది. అంటే చట్ట ప్రకారం ఆ కార్మికులకు వర్తించే నిబంధనలేవీ వీరికి వర్తించవు. ప్రయోజనాలు అందవు. ఇలా పని చేసే కార్మికులందరూ వలస వచ్చిన కార్మికులే. సాధారణంగా పేదరికం తాండవించే ప్రాంతాలకు చెందిన పొరుగు రాష్ట్రాల వారు. వీరు పని చేసే పరిశ్రమలు కార్మికులకు రక్షణ కల్పించే చర్యలేవీ తీసుకోలేదు. వారికి శ్వాస పీల్చుకోవడం కష్టమైనప్పుడు తగిన వైద్య సహాయం ఏదీ అందలేదు. వారి ఆరోగ్యాన్ని పరిరక్షించే వ్యవస్థ ఏదీ లేనందువల్ల వారు పని చేసే చోటులో ఉన్న పరిస్థితుల కారణంగానే వారు అనారోగ్యం పాలయ్యారని తెలుసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ కార్మికులు పని చేయలేని స్థితికి చేరుకున్నప్పుడు తమ గిరిజన గ్రామాలకు తిరిగి వచ్చారు. వ్యాధి క్రమంగా ముదిరి ప్రాణాలు వదిలారు.

విచిత్రం ఏమిటంటే సిలికోసిస్ వ్యాధిని 1948నాటి ఇ.ఎస్.ఐ. చట్టం కింద, 1923నాటి కార్మికుల నష్ట పరిహార చట్టం కింద వృత్తిపరమైన వ్యాధిగా గుర్తించారు. అయితే ఈ చట్టాలు, 1948నాటి ఫ్యాక్టరీల చట్టం, 1952 నాటి గనుల తవ్వకం చట్టం వ్యవస్థీకృత రంగ కార్మికులకు మాత్రమే వర్తిస్తాయి. ఈ రుగ్మతలకు గురవుతున్న వారు అవ్యవస్థీకృత కార్మికులే. వారు మెరుగైన వేతనాలకోసం గాని, సురక్షితమైన పని పరిస్థితుల గురించి కాని అడిగే అవకాశం లేదు. సిలికోసిస్ వ్యాధిని సాధారణంగా క్షయ వ్యాధిగా పొరబడతారు. క్షయ వ్యాధికి చికిత్స ఉంది. సిలికోసిస్ సోకిన వ్యక్తి మరణిస్తే కచ్చితంగా ఆ వ్యాధి వల్లే మరణించారని చెప్పడానికి వీలు ఉండదు. బొగ్గు గని కార్మికులకు సోకే న్యుమోకోనియోసిస్ వ్యాధి కూడా ఇలాంటిదే. ఫ్యాక్టరీల చట్టం కింద ఈ వ్యాధిని కూడా ప్రాణాంతక వ్యాధి కిందే పరిగణించారు. జౌళి పరిశ్రమల్లో పని చేసే వారికి బైసినోసి వ్యాధి సోకుతుంది. వారు నూలు ధూళి పీల్చవలసి వస్తుంది. ఈ వ్యాధులను సరిగా పట్టించుకోరు.

వృత్తిపరమైన ఈ వ్యాధులు మన దేశానికి మాత్రమె పరిమితమైనవి కావు. యునైటెడ్ కింగ్డం లాంటి చోట్ల వృత్తిపరమైన ఈ వ్యాధులను నివారించడానికి నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటారు. భద్రతా చర్యలు తీసుకోవడం తప్పని సరి. కార్మికులకు ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన ఉపకరణాలు సరఫరా చేయడంతో పాటు ధూళిని తగ్గించడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయాలి. చట్టం ప్రకారం ఇలాంటి పరిశ్రమల్లో పని చేసే వారందరికీ నియమబద్ధంగా ఆరోగ్య పరిక్షలు కూడా చేయాలి. సిలికోసిస్ వ్యాధులు దీర్ఘకాలంలో తప్ప నిర్ధారించడానికి వీలైనవి కావు. ఒక వ్యక్తి ఆరోగ్య లక్షణాలను నిరంతరం పరిశీలిస్తూ ఉంటే తప్ప చికిత్సకు వీలు కాని ఈ వ్యాధులను గుర్తించడం సాధ్యం కాదు. ఈ వ్యాధిని నివారించడానికి ఉన్న ఏకైక మార్గం ప్రమాదకరమైన ధూళిని పీల్చకుండా ఉండడమే. 

(ఇ.పి.డబ్ల్యు. సౌజన్యంతో)