My title

టీడీపీతో బీజేపీ కటీఫ్!…. హైక‌మాండ్ నుంచి సిగ్న‌ల్స్‌

తెలంగాణ రాజ‌కీయాల్లో కీలక మార్పు దిశ‌గా అడుగుప‌డింది. ఢిల్లీలో జ‌రుగుతున్న బీజేపీ కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. 2019 ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో బీజేపీ ఒంట‌రిగా పోటీ చేయ‌బోతుంది. ఈ విష‌యంలో రాష్ట్ర నేత‌ల‌కు హైక‌మాండ్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ మేర‌కు తెలంగాణ రాజ‌కీయాల‌పై రాష్ట్ర నేత‌లు ఓ రిపోర్టు స‌మ‌ర్పించారు.  ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితులు, ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌, పుంజుకోని కాంగ్రెస్ లాంటి వివ‌రాల‌తో ఈ నివేదిక రూపొందించారు. అంతేకాకుండా పార్టీలోకి వ‌చ్చే నేత‌ల లిస్ట్‌ను ప్ర‌క‌టించారు.

తెలంగాణలో తెలుగుదేశం ప‌రిస్థితిని ప్ర‌త్యేకంగా వివ‌రించారు. ఆ పార్టీకి మూడు శాతం ఓటు బ్యాంకు మాత్ర‌మే ఉంద‌ని…కీల‌క నేత‌లంతా వ‌ల‌స వెళ్లే ప‌రిస్థితి ఉంద‌ని చెప్పారు. బీజేపీలోకి చాలా మంది నేత‌లు వ‌ల‌స వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని రిపోర్టు ఇచ్చారు. 2019లో ఒంటరిగా పోటీ చేస్తే… మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌ని నేత‌లు చెప్పుకొచ్చారు. దీంతో హైక‌మాండ్ తెలంగాణ నేత‌ల రిపోర్టుకు పాజిటివ్‌గా రెస్పాన్స్ ఇచ్చింది.

2019లో ఒంటరిగా పోటీ చేసేందుకు రెడీ కావాల‌ని సంకేతాలు ఇచ్చారు. ఏపీలో మాత్రమే టీడీపీతో పొత్తు ఉంటుందని, తెలంగాణలో ఉండబోదని బీజేపీ ముఖ్య నేతలు ఇటీవల బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు.  మ‌రోవైపు తెలంగాణ తెలుగుదేశం నేతలు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల‌ని ఊవ్విళ్లుతున్నారు. ఆ దిశ‌గా ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. లేక‌పోతే చివ‌రికి టీఆర్ఎస్‌తో కూడా బీజేపీ పొత్తు పెట్టుకునే అవ‌కాశాలున్నాయ‌ని కొంద‌రు నేత‌లు అంటున్నారు. మొత్తానికి తెలంగాణ‌లో తెలుగుదేశం మూత‌ప‌డే ప‌రిస్థితులే క‌న్పిస్తున్నాయి.