My title

తెలంగాణ‌లో మ‌ళ్లీ కొత్త జిల్లాల లొల్లి

తెలంగాణ‌లో  కొత్త జిల్లాల లొల్లి  మళ్లీ మొద‌లైంది. ఉమ్మ‌డి  వరంగల్‌ జిల్లాలో  ఈ వివాదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. నర్సంపేటను ప్రత్యేక జిల్లా చేయాలంటూ  కొంద‌రు తాజాగా డిమాండ్ లేవ‌నెత్తారు.  ఇంత‌కుముందు పాత వరంగల్‌ జిల్లా ఐదు జిల్లాలుగా ముక్కలైంది. వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, మహబూబాబాద్, భూపాలపల్లి, జనగామ జిల్లాలుగా విడగొట్టారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట కలిసే ఉన్నా.. ఈ పాత జిల్లా కేంద్రాన్ని వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్‌ జిల్లాలుగా విడగొట్టడంపై స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

ఇప్పుడు వ‌రంగ‌ల్ రూరల్ జిల్లా కేంద్రం ఏర్పాటుపై కొత్త పేచీలు మొద‌ల‌య్యాయి. న‌ర్సంపేట‌లో ఏర్పాటు చేయాల‌ని అక్క‌డి నేత‌లు కోరుతున్నారు. లేక‌పోతే త‌మ ప్రాంతాన్ని జిల్లా చేయాల‌ని వారు డిమాండ్‌చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం గీసుకొండ మండలం మొగిలిచర్లలో కలెక్టరేట్‌ ఏర్పాటుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీన్ని కొంద‌రు రాజ‌కీయ నేత‌లు నిర‌సిస్తున్నారు.ఈ ప్రాంతంలో కలెక్టరేట్‌ ఏర్పాటును పరకాల, వర్ధన్నపేట ప్రజలు, నాయకులు  వ్యతిరేకిస్తు న్నారు. మొగిలిచర్లకు బదులుగా నర్సంపేట లో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని స్థానిక నేతలందరూ  ఆందోళనలు చేపట్టారు.

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, టీడీపీ నేత రేవూరి ఆందోళనలలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రాన్ని పరకాలలో ఏర్పాటు చేయాలంటూ ఆ ప్రాంత నేతలు రిలేనిరాహార దీక్షలు చేపట్టారు.  వరంగల్‌ రూరల్‌ జిల్లా కేంద్రాన్ని మామునూరులోని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించాలంటూ వర్ధన్నపేట నియోజక వర్గంలో అఖిలపక్ష నేతలు దీక్షలు చేపట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు  జిల్లా కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనపై తలోరకంగా స్పందిస్తున్నారు. దీంతో గందరగోళం నెలకొంది.