My title

భన్వర్‌లాల్‌, అమిత్‌షాలమీద మండిపడుతున్న టీడీపీ సోషల్‌మీడియా

సోషల్‌మీడియాలో టీడీపీ వీరాభిమానులు పెడుతున్న పోస్టులు చూస్తుంటే, వ్యక్తం చేస్తున్న అసహనం గమనిస్తే నంద్యాల ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉండబోతుందో కొంచెం అర్ధమౌతోంది. ముఖ్యంగా వాళ్లను బాధపెడుతున్న అంశం ఎన్నికల కమిషన్‌. వాళ్లు శాపనార్ధాలు పెడుతున్నది భన్వర్‌లాల్‌, అమిత్‌షాలను.

టీడీపీ అభిమానులకు ఇప్పుడు భన్వర్‌లాల్‌, అమిత్‌షాలమీద పీకలదాకా కోపం ఉంది. భన్వర్‌లాల్‌ను తిట్టడంతోపాటు ఎన్నికల కమిషన్‌కు అంతధైర్యం ఇస్తున్న వ్యక్తి అమిత్‌షా అని ఆడిపోసుకుంటున్నారు. దీనికి కారణం ఏమిటంటే శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్‌ చెల్లదని ఎల్లో మీడియా రెండు గంటలపాటు ఊదరగొట్టేసింది. ఎన్నికల కమిషన్‌ ఒక వేళ ధైర్యం చేసి శిల్పా నామినేషన్‌ను తిరస్కరించినా ప్రజలకు కోపం రాని, అన్యాయం అనిపించని ప్రాతిపదికను, రంగాన్ని ఎల్లోమీడియా సిద్ధంచేసిపెట్టింది. ఓటర్లను మానసికంగా ప్రిపేర్‌ చేసింది. అయితే వాళ్ల అంచనాలకు భిన్నంగా ఎన్నికల కమిషన్‌ శిల్పా నామినేషన్‌ చెల్లుతుందని ప్రకటించడంతో తీవ్ర నిరాశకు లోనైన టీడీపీ వీరాభిమానులు భన్వర్‌లాల్‌ మీద ఒకింత మండిపడ్డారు.

ఆ తరువాత నంద్యాల ఉప ఎన్నికలకు కేంద్ర బలగాలను పంపించమని భన్వర్‌లాల్‌ కోరడం, అందుకు కేంద్రం అంగీకరించడం టీడీపీ వీరాభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటిదాకా తెలుగుదేశం కార్యకర్తల్లాగా పనిచేస్తున్న కొందరు ఆంధ్రాపోలీసులతో ఈ ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేయించుకోవచ్చని పెట్టుకున్న ఆశలు నిరాశలు అవడం వాళ్లకు బాధ కలిగించింది. దీనికి కూడా భన్వర్‌లాల్‌ను బాధ్యుడిని చేసి సోషల్‌మీడియాలో ఆడిపోసుకున్నారు.

అలాగే దొంగ ఓటర్లను కట్టడిచేయడానికి భన్వర్‌లాల్‌ చర్యలు తీసుకోవడం, మరీ ముఖ్యంగా కొన్ని పోలింగ్‌ బూత్‌లను మార్చాలన్న నిర్ణయం తీసుకోవడం టీడీపీ వీరాభిమానులకు మింగుడుపడడం లేదు. అధికారంలో ఉండే పార్టీకి గెలవడానికి తోడ్పడే అన్ని అంశాలను భన్వర్‌లాల్‌ ఆయనకు చేతనైన మేర నిష్పక్షపాతంగా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉండడంతో ఆయనపై టీడీపీ శ్రేణులు చాలా కోపంగా ఉన్నాయి. ఒక అధికారికి చంద్రబాబులాంటి వ్యక్తిని కాదని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే ధైర్యం రావడానికి భన్వర్‌లాల్‌కు అమిత్‌షానుంచి ఆదేశాలు అందడమే కారణం అని టీడీపీ సోషల్‌ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. భన్వర్‌లాల్‌, అమిత్‌షాల మీద తీవ్రంగా మండిపడుతున్నారు.