My title

టాటూ… వేసుకున్నావా బాబూ! ఆరోగ్యం జాగ్రత్త !

టాటూ ఒక ట్రెండ్‌, కొన్నాళ్ల‌పాటు ఒక ఊపు ఊపేసిన ఫ్యాష‌న్‌. బాలీవుడ్‌, టాలీవుడ్ స్టార్లు టాటూతో హొయ‌లు పోయారు. దీపికా ప‌డుకొన్ అయితే ర‌ణ‌బీర్‌తో ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు ఆర్‌కె అని ఇంగ్లీష్ లెట‌ర్స్ టాటూ వేయించుకుంది. సైఫ్ అలీ ఖాన్ అయితే క‌రీనా క‌పూర్ ప్రేమ‌లో అలా ప‌డ్డాడో లేదో ఆమె పేరును టాట్టూ వేయించుకుని స‌మాజానికి ప్రేమ‌ను ప్ర‌క‌టించేశాడు. తెలుగులో నాగార్జున కూడా చేతికి టాటూ వేయించుకుని, అది వేయించుకున్న కొత్తల్లో ఆ టాటూ క‌నిపించ‌డానికి చేతుల్లేని చొక్కాలు వేసుకుని మ‌రీ ప్ర‌ద‌ర్శించేవాడు. ఇంకా శ్రుతి హాస‌న్ తండ్రి పేరును, ప్రియాంకా చోప్రా తండ్రి ప్రేమ‌ను టాటూతో ప్ర‌ద‌ర్శిస్తే, అర్జున్ క‌పూర్ త‌ల్లిని టాటూతో త‌ల‌చుకున్నాడు. ఆ ముచ్చ‌ట‌… మురిపెం తీరే లోపే హెల్త్ ఎక్స్‌ప‌ర్ట్స్ ఓ బాంబు పేల్చారు.

టాటూ వేసుకుంటే ఆరోగ్యం పాడ‌వుతుందట‌!

నిజ‌మే, టాటూలో వాడే ఇంకులోని నానో ప‌ర్టిక‌ల్స్ దేహంలో ప్ర‌యాణిస్తాయి. గొంతు ద‌గ్గ‌ర ఉండే లింఫ్‌నోడ్స్ (గ‌వ‌ద బిళ్ల‌లు)ను చేరిన త‌ర్వాత కొన్నాళ్ల‌కు లింఫ్‌నోడ్స్ వాపుకు గుర‌వుతాయి. ఆ వాపు ఇలా వ‌చ్చి అలా త‌గ్గిపోయేది కాద‌ని, దేహంలోని వ్యాధి నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేస్తుంద‌ని జ‌ర్మ‌నీలోని యూరోపియ‌న్ సింక్రోట్రాన్ రేడియేష‌న్ ఫెసిలిటీకి చెందిన ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు. ఇంకులో ఉప‌యోగించి నికెల్, క్రోమియం, మాంగ‌నీస్‌, కోబాల్డ్‌, టైటానియం డ‌యాక్సైడ్ వంటి ర‌సాయ‌నాలు దేహాన్ని విష‌పూరితం చేసే ప్ర‌మాదం ఉంది. దేహంలో వ్యాధినిరోధ‌క వ్య‌వ‌స్థ‌కు ఆయుపు ప‌ట్ట‌యిన లింఫ్‌నోడ్స్ మీద‌నే ఎటాక్ చేస్తాయి. లింఫ్‌నోడ్స్ సైజ్ పెర‌గ‌డంతోపాటు దేహాన్ని అనారోగ్యాల బారి నుంచి కాపాడే శ‌క్తిని కోల్పోతాయి.

సో… టాటూను తెర మీద‌ చూసి మురిసిపోదాం, ఒంటి మీద వేసుకుని ఆ బాధ‌లను కొనితెచ్చుకోవ‌డ‌మెందుకు?