My title

కమ్యూనిస్ట్ ఉద్యమ కలం సైనికుడు సిబ్తె హసన్

జాతి విమోచనోద్యమం తారా స్థాయిలో ఉన్న దశలోనే దేశంలో అభ్యుదయ రచయితల ఉద్యమం కూడా ప్రారంభం అయింది. సరిగ్గా అదే సమయంలో సయ్యద్ సిబ్తె హసన్ (31-7-1916 – 20-4-1986) ఆ ఉద్యమంలో చేరి కమ్యూనిస్టు భావజాలాన్ని వ్యాపింప చేయడానికి కృషి చేశారు. ఉత్తరప్రదేశ్ లోని ఆజం గఢ్ లో భూస్వామ్య కుటుంబంలో జన్మించిన సిబ్తె హసన్ వర్గ స్వభావాన్ని వదిలించుకుని అణగారిన వర్గాల పక్షాన నిలబడ్డారు. అలీగఢ్ విశ్వవిద్యాలయంలో చరిత్ర చదివిన ఆయన ఉన్నత విద్యాభ్యాసం కోసం న్యూయార్క్ లోని కొలంబియా విశ్వవిద్యాలయానికి వెళ్లారు. 1948లో అమెరికా నుంచి సిబ్తె హసన్ బొంబాయి తిరిగి వచ్చినప్పుడు అప్పుడు కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతవేత్తగా ప్రసిద్ధుడైన డా. అధికారి ఆయనను పాకిస్తాన్ వెళ్లమని కోరారు. ప్రసిద్ధ కవి, భారత్ లో అభ్యుదయ సాహిత్యోద్యమ దీపధారి అయిన సజ్జాద్ జహీర్ అప్పటికే పాకిస్తాన్ వెళ్లి పోయారు. పాకిస్తాన్ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ఉండే వారు. 1948 జులైలో సిబ్తె హసన్ కరాచీ చేరుకుని అక్కడి నుంచి లాహోర్ వెళ్లి సజ్జాద్ జహీర్ ను కలుసుకున్నారు. సజ్జాద్ జహీర్ తో పాటు పార్టీ కార్యాలయంలోనే నివసించే వారు.

1942లోనే సిబ్తె హసన్ కమ్యూనిస్టు పార్టీలో చేరి పార్టీ కోసం పూర్తి కాలం పని చేసే వారు. ఆ సమయంలో ఆయన నేషనల్ హెరాల్డ్ పత్రికలో పని చేసే వారు. సజ్జాద్ జహీర్ సలహా మేరకు నేషనల్ హెరాల్డ్ లో ఉద్యోగం వదులుకుని నెలకు కేవలం 30 రూపాయల భత్యంతో కమ్యూనిస్టు పార్టీలో పని చేశారు. కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక ఖోమీ జంగ్ లో పని చేసే వారు. ఆయనకు పార్టీ ఇచ్చే భత్యంలో 17 రూపాయలు భోజనానికి, అయిదు రూపాయలు అద్దె కింద మినహాయించుకునే వారు. ఇక ఆయనకు మిగిలేది నెలకు 8 రూపాయలు. తాను నమ్మిన మార్క్సిస్టు సిద్ధాంతం మీద అపారమైన అభిమానం వల్ల ఆయన డబ్బు కోసం పాకులాడలేదు. సి.పి.ఐ.లో చేరిన తర్వాత ఆయన బొంబాయిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉంటూ నయా ఆదాబ్ పత్రిక సంపాదకత్వ బాధ్యతలు నిర్వర్తించే వారు.

ద్విజాతి సిద్ధాంతం ఆధారంగా పాకిస్తాన్ ఏర్పాటుకు మహమ్మద్ అలీ జిన్నా పట్టుబట్టినా పాకిస్తాన్ సెక్యులర్, ప్రజాస్వామ్య దేశంగా ఉండాలనే కోరుకున్నారు. 1948లో జిన్నా మరణించిన తర్వాత పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీలోని ఫ్యూడల్ శక్తులు పై చేయి సాధించి పాకిస్తాన్ ను అమెరికా సామ్రాజ్య వాదానికి బంటుగా మార్చేశారు. సెక్యులర్ విధానాలకు తావు లేకుండా చేశారు. దీనితో సెక్యులర్, ప్రజాస్వామ్య భావాలున్న వారు పాకిస్తాన్ లో మనగలగడమే కష్టమైంది. 1951లో కమ్యూనిస్టు నాయకులపై పాక్ ప్రభుత్వం రావల్పిండి కుట్ర కేసు మోపింది. ఇందులో సజ్జాద్ జహీర్, ఫైజ్ అహమద్ ఫైజ్, మేజర్ జనరల్ అక్బర్ ఖాన్ మొదలైన వారితో పాటు సిబ్తె హసన్ కూడా నిందితుడే. వీరందరినీ అరెస్టు చేశారు. 1954లో పాక్ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని, అభ్యుదయ రచయితల సంఘాన్ని కూడా నిషేధించింది. కమ్యూనిజాన్ని నిరోధించడం కోసం అమెరికాతో సైనిక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. 1955లో సజ్జాద్ జహీర్, సిబ్తె హసన్ మొదలైన వారిని విడుదల చేసినా పాకిస్తాన్ లో కమ్యూనిస్టు ఉద్యమం పుంజుకోవడం సాధ్యం కాలేదు. కాని సిబ్తె హసన్ సాహిత్య కృషి కొనసాగించి అనేక గ్రంథాలు రాశారు. మూసా సే మార్క్స్ తక్ గ్రంథం దశాబ్దాల పాటు పాకిస్తాన్ లో వామపక్ష కార్యకర్తలకు కరదీపికగా ఉపకరించింది. ఈ గ్రంథం దశాబ్దాలుగా పునర్ముద్రణలు వెలువడుతూనే ఉంది. ఇప్పటికీ ఆ గ్రంథానికి ఆదరణ తగ్గ లేదు. నిజానికి ఆ గ్రంథం సోషలిజం చరిత్రే. ఈ గ్రంథంతో పాటు సిబ్తె హసన్ ఇతర రచనలకు బలూచిస్తాన్, సింధ్ ప్రాంతాలలో విపరీతమైన ఆదరణ ఉంది. జాతీయ వాద శక్తులకు స్ఫూర్తినిస్తూనే ఉంది. సిబ్తె హసన్ ఒక వేపు సాహిత్య కృషి కొనసాగిస్తూనే పత్రికా రచనలో కూడా నిమగ్నమయ్యారు. లైల్-ఒ-నిహర్ వార పత్రికకు సంపాదకులుగా ఉన్నారు. జనరల్ అయూబ్ ఖాన్ నిరంకుశ ప్రభుత్వం కొనసాగిన సమయంలో ఈ పత్రికతో పాటు పాకిస్తాన్ టైమ్స్, ఇమ్రోజ్ పత్రికలను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1970 ఆరంభంలో ఫైజ్ అహమద్ ఫైజ్ తో కల్సి సిబ్తె హసన్ లైల్-ఒ-నిహర్ పత్రికను పునరుద్ధరించినా 1971లో తూర్పు పాకిస్తాన్ పై పాక్ ప్రభుత్వ దమన కాండ సందర్భంగా సత్యం రాయడం అసాధ్యమైన తరుణంలో ఈ పత్రికను ఆపేయాల్సి వచ్చింది.

సిబ్తె హసన్ యువతరంతో కలివిడిగా ఉండే వారు. 1970లలో పురోగమన భావాలు గల కొంత మంది యువకులు యంగ్ రైటర్స్ ఫోరం (యువ రచయితల వేదిక) ఏర్పాటు చేస్తే సిబ్తె హసన్ వారికి మార్గదర్శకులుగా ఉండి ప్రోత్సహించారు. అదే సమయంలో కథా రచయిత్రి సయీదా గజ్దర్ తో కలిసి సిబ్తె హసన్ కరాచీ నుంచి పాకిస్తానీ అదబ్ అన్న పత్రిక ప్రారంభించారు. ఆయన తన రచనల ద్వారా అభ్యుదయ భావాలను వ్యాప్తి చేసే వారు. యువకులను కలలు కనమని ప్రోత్సహించే వారు.

సిబ్తె హసన్ సెక్యులర్ భావాలకు అనుగుణంగా ఒక ప్రముఖ ఇంగ్లీషు దినప పత్రికలో రాసిన వ్యాసాలు ప్రజాదరణ పొందడంతో పాటు వివాదాలకు కూడా దారి తీశాయి. మితవాద భావాలు గల ప్రసిద్ధ న్యాయవాది ఖాలిద్ ఇషాఖ్ ఈ వాదనలను ఖండిస్తూ రాసే వారు. ఈ వాదోపవాదాల ఆధారంగానే సిబ్తె హసన్ ది బాటిల్ ఆఫ్ ఐడియాస్ ఇన్ పాకిస్తాన్ గ్రంథం ప్రచురించారు. ఇందులో సెక్యులరిజం అంటే ఏమిటో వివరించడంతో పాటు దాన్ని విరూపం చేసే వారిని దుయ్యబట్టారు. సెక్యులర్ భావాలు ఎలా పెంపొందుతాయో, ప్రాచీన కాలంలో ఈ భావాలు ఎలా ఉండేవో, మతానికి రాజ్య వ్యవస్థకు ఉండవలసిన సంబంధం ఏమిటో, తూర్పు దేశాలలో, ఈజిప్టులో, భారత ఉపఖండంలో సెక్యులర్ భావాలు ఎలా ఉన్నాయో ఈ గ్రంథంలో వివరించారు.

“పాకిస్తాన్ ను ఒక మత రాజ్యంగా మలచడానికి పాలకపక్షాలు సాధ్యమైన అన్ని ప్రయత్నాలూ చేశాయి. పాకిస్తాన్ వాదన వెనక ఉన్న స్ఫూర్తిని దెబ్బ తీశాయి. పాకిస్తాన్ ఏర్పాటు కోసం కృషి చేసిన వారి ఆకాంక్షలను తుంగలో తొక్కాయి. పాక్ ప్రజలు సైనిక పాలకులను తిరస్కరించారు” అని సిబ్తె హసన్ ఈ గ్రంథానికి రాసిన ముందు మాటలో చెప్పారు. పాకిస్తాన్ లో అభ్యుదయ సాహిత్యోద్యమ వ్యాప్తికి ఆయన విశేషమైన కృషి చేశారు. ఆయన రచనలు పాకిస్తాన్ లోనే కాక భారత్ లోనూ మేధాపరమైన చర్చలకు ప్రాతిపదికగా ఉన్నాయి. అందుకే మూసా సే మార్క్స్ తక్ అన్న పుస్తకాన్ని సి.పి.ఐ. భారత్ లో పునర్ముద్రించింది.

సిబ్తే హసన్ మృదు భాషి. కాని తన సిద్ధాంతాల విషయంలో రాజీ పడే వారు కాదు. మానవ పరిణామ శాస్త్రంపై ఆయన రాసిన మాజీ కె మజార్ గ్రంథానికి అదంజీ అవార్డు ఇవ్వజూపితే ఈ అవార్డు వెనక పాకిస్తాన్ లోని ఒక ప్రముఖ పెట్టుబడిదారు హస్తం ఉందని ఆ అవార్డుని తిరస్కరించారు. మాజీ కె మజార్ ప్రపంచ నాగరికతల్లో వస్తున్న మార్పుల‌ను అన్వేషించడానికి చేసిన ప్రయత్నమే. అందుకే సిబ్తే హసన్ ను ఇటలీ కమ్యూనిస్టు సిద్ధాంతవేత్త అంటోనియో గ్రామ్సీ తో పోలుస్తారు.

1986లో పాకిస్తాన్ లో అభ్యుదయ రచయితల సంఘం స్వర్ణోత్సవాలు జరిగితే ఆరోగ్యం సహకరించకపోయినా హాజరయ్యారు. ఆ తర్వాత భారత్ లో జరిగిన అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం స్వర్ణోత్సవాలలో కూడా పాల్గొన్నారు. అప్పుడే గుండె పోటుతో 1986 ఏప్రిల్ ఆరున దిల్లీలో మరణించారు.

పాకిస్తాన్ లో సోషలిజం, మార్క్సిజం భావాల వ్యాప్తికి ఆయన చేసిన కృషి అమూల్యమైంది. అభ్యుదయ రచయితల సంఘానికి స్ఫూర్తిప్రదాతగా ఉన్నారు. ఆయన ఎన్నదగిన మేధావి. మానవ పరిణామ శాస్త్రంలో దిట్ట. సిబ్తె హసన్ కు హైదరాబాద్ తో కూడా సంబంధం ఉంది. ఖాజీ అబ్దుల్ గఫార్ హైదరాబాద్ నుంచి వెలువరించిన పయాం పత్రికలో పని చేశారు. ఆయన తొలి రచన శహర్ –ఎ-నిగరాన్ సిబ్తే హసన్ కు హైదరాబాద్ తో ఉన్న సంబంధాల గురించి రాసింది. దీన్ని 1950లో పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధించింది. అప్పుడు బొంబాయి నుంచి వెలువడుతున్న కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక న్యూ ఏజ్ కు సిబ్త హసన్ న్యూ యార్క్ ప్రతినిధిగా ఉండే వారు. కమ్యూనిస్టు భావాలు ఉన్నాయన్న ఆరోపణపై సిబ్తె హసన్ ను న్యూ యార్క్ లో అరెస్టు చేసి కొంతకాలం నిర్బంధంలో ఉంచి తర్వాత వెనక్కి పంపించారు. సమాజ పరిణామాలను అంచనా వేయడంలో కూడా సిబ్తె హసన్ ఆరితేరిన వారు. ఇరాన్ విప్లవం రష్యా విప్లవం కన్నా మహత్తరమైందని ఫైజ్ అనే వారు. కాని ఇరాన్ విప్లవంలో ఇరాన్ తూదే పార్టీ (కమ్యూనిస్ట్ పార్టీ) అయతుల్లాలను అనుసరించినా మొదటి విఘాతం ఆ పార్టీకే తగులుతుందని సిబ్తే హసన్ చెప్పేవారు. సరిగ్గా అలాగే జరిగింది.

మార్క్సిజం, లెనినిజం మీద సిబ్తె హసన్ కు అచంచలమైన విశ్వాసం ఉండేది. ఆ విప్లవ సిద్ధాంత వ్యాప్తి కోసం ఆయన తన రచనాశక్తినంతటినీ వినియోగించారు. ఆయన మతతత్వ వాదాన్ని వ్యతిరేకించినందువల్ల యువతరం అభిమానం పొందగలిగారు. ఆయన ఆలోచనలు కాలంతో పాటు పరిణామం చెందాయి.

ముస్లింలు శతాబ్దాల కిందట తీసుకున్న నిర్ణయం ప్రకారమే పాకిస్తాన్ అవతరించిందన్న చరిత్రకారుల వాదనను సిబ్తె హసన్ తిప్పి కొట్టారు. అసలా ఉద్యమమే తప్పు అన్నది ఆయన అభిప్రాయం. ప్రజాస్వామ్యానికి సెక్యులరిజమే పునాది అన్నది ఆయన దృఢ విశ్వాసం. భూస్వామ్య వ్యవస్థ ప్రజాస్వామ్యానికి ప్రధానమైన ఆటంకం అనే వారు. ఆయన ఎంత క్రాంతదర్శో సమకాలీన చరిత్ర నిరూపిస్తోంది. ఆయన గ్రంథాలు పరిశీలిస్తే సామాజిక శాస్త్రవేత్త, మానవ పరిణామ శాస్త్రవేత్త, చరిత్రకారుడు, తత్వవేత్త ఏక కాలంలో కనిపిస్తారు.
ఆర్వీ రామారావ్