My title

విడాకుల మంజూరుపై సుప్రీం కీలక ఆదేశాలు….

విడాకుల మంజూరు కాలపరిధిపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దంపతులకు విడాకుల మంజూరు చేసే ముందు… వారు పునరాలోచనచేసుకునేందుకు గాను ఉన్న ఆరు నెలల గడువు తప్పనిసరి కాదని కోర్టు స్పష్టం చేసింది. ఆరు నెలల కాలపరిమితిని తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని  ట్రయల్ కోర్టులకు సుప్రీం ఆదేశించింది. పరస్పర అంగీకారంతో విడాకులు కావాలని వచ్చిన దంపతులకు…. వారి మధ్య సయోధ్యకు అవకాశం లేదని  కోర్టు భావిస్తే ఆరు నెలల గడువును పాటించాల్సిన అవసరం లేదని చెప్పింది.

హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం విడాకులు కోరుతూ పిటిషన్‌ దాఖలైన తరువాత.. తదుపరి విచారణకు కనీసం ఆర్నెల్ల విరామం ఉండాలి. ఆ సమయంలో దంపతుల మనసు మారి తిరిగి కలిసుండే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ నిబంధన చేర్చారు. అయితే ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని సెక్షన్‌ 13బీ(12) చెబుతోందని సుప్రీం వ్యాఖ్యానించింది.  కాబట్టి ఆరు నెలల నిబంధన పేరుతో ప్రతికేసును జాప్యం చేయాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు చెప్పింది.  పిటిషన్‌దారులైన దంపతులు సరైన కారణంతో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకాలేని పరిస్థితుల్లో…. తల్లి దండ్రులు వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయాన్ని వాడుకోవచ్చని, వారి తరఫున తల్లిదండ్రులు కాని, సహోదరులు కాని హాజరు కావచ్చంది. కొన్నేళ్లుగా విడిగా ఉంటున్న ఒక జంట తమకు ఆరు నెలల నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చి వెంటనే విడాకులు మంజూరు చేయాల్సిందిగా దాఖలు చేసుకున్న పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం ఈ  తీర్పును వెలువరించింది.