My title

నిషేధం తొల‌గింపుపై సుప్రీం స‌సేమిరా

బాణాసంచా పై విధించిన నిషేధాన్ని తొల‌గించ‌డం కుద‌ర‌ద‌ని సుప్రీం కోర్టు స్ప‌ష్టం చేసింది. నిషేధం తొల‌గించాల‌ని సుప్రీంను ఆశ్ర‌యించిన పిటిష‌న‌ర్ల‌కు ఉన్న‌త న్యాయ‌స్ధానం నో అని తేల్చి చెప్పింది.

అక్టోబ‌ర్ 9న తాము తీసుకున్న నిర్ణ‌యాన్ని కొంత‌మంది త‌ప్పుబ‌ట్ట‌డం త‌మ‌ను బాధించింద‌ని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్ర‌జ‌ల శ్రేయ‌స్సును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణ‌యానికి మ‌తం రంగు పులుముతున్నార‌ని జ‌స్టిస్ ఎకె సిక్రి త‌న బాధ‌ను వ్య‌క్తం చేసారు. త‌న గురించి తెలిసిన వారు ఎవ‌రూ  ఇలా మాట్లాడ‌ర‌ని సిక్రి అన్నారు. త‌న‌లో ఆధ్యాత్మిక‌త చాలా ఎక్కువ‌ని ఈ సంద‌ర్భంగా సిక్రి తెలియ‌జేశారు.

బాణాసంచా నిషేధం విష‌యంలో తామెవ‌రితోనూ వాదన‌ల‌కు దిగేందుకు సిద్ధంగా లేమ‌ని సిక్రి స్ప‌ష్టం చేశారు. తాము తీసుకున్న నిర్ణ‌యం ఏ మ‌త సంబంధ అంశాల‌ను లోబ‌డి తీసుకోలేద‌ని కూడా సిక్రి తేల్చి చెప్పారు.

దీపావ‌ళి పండుగ జ‌రుపుకోడానికి తాము విరుద్ధం కాద‌ని తెలిపిన‌ ఉన్న‌త న్యాయ‌స్థానం …..ఈ పండుగ‌ను హిందువుల‌తో పాటు జైనులు, సిక్కులు కూడా జ‌రుపుకుంటార‌ని ఓ పిటిష‌న‌ర్ చెప్పిన విష‌యాన్ని గుర్తుచేసింది.

అస‌లేం జ‌రిగిందంటే….

చెన్నైకి చెందిన ఒక పౌర హ‌క్కుల సంఘం సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. బాణాసంచాపై నిషేధం విధించ‌డం ద్వారా సుప్రీంకోర్టు ….రాజ్యాంగంలో ఆర్టిక‌ల్ 25 ప్ర‌సాదించిన సాంస్కృతిక మ‌త హ‌క్కుల‌ను   కాల‌రాసింద‌ని పేర్కొంది.

అక్టోబ‌ర్ 31 వ‌ర‌కు 22 రోజుల పాటు బాణాసంచా అమ్మ‌కాల‌పై నిషేదాన్ని ఎత్తివేయాల‌ని ఆ సంఘం కోరింది.