My title

చావుకు వీలునామా…. సుప్రీం ముందుకు ఆసక్తికరమైన అంశం

సుప్రీం కోర్టు ముందుకు ఒక అరుదైన పిటిషన్ వచ్చింది. చావు వీలునామాను అనుమతించాలంటూ ఒక స్వచ్చంధ సంస్థ పిటిషన్‌ను దాఖలు చేసింది. నేను తిరిగి కోలుకోలేని స్థితిలో కోమాలోకి వెళ్తే…. తిరిగి నన్ను బలవంతంగా బతికించేందుకు ప్రయత్నించవద్దంటూ ఒక వ్యక్తి వీలునామా రాస్తే దాన్ని పరిగిణలోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోరింది కామన్‌ కాజ్ అనే స్వచ్చంద సంస్థ. పౌరులందరికీ జీవించే హక్కు ఉంటుందని…. అలాగే తిరిగి కోలుకోలేని స్థితిలో కోమాలోకి వెళ్తే తనను బలవంతంగా బతికించవద్దని కోరడం కూడా జీవించే హక్కు కిందకే వస్తుందని సంస్థ తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్ వాదించారు. సుప్రీం కోర్టు ఇప్పటికే కారుణ్య మరణాన్ని అనుమతించిందని…. మరణించే స్వేచ్చ వీలునామా దీనికి కొనసాగింపుగా ఉంటుందన్నారు. ప్రాణాధార వ్యవస్థ లేకుండా రోగి జీవించే అవకాశం లేదని వైద్యులు నిర్ధారించిన తర్వాత ”మరణించే స్వేచ్చ” వీలునామాను అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ఈ పిటిషన్‌పై కేంద్రం తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కొన్ని అనుమానాలను వ్యక్తం చేశారు. దేశ చట్టాలు, సంప్రాదాయాలను బట్టి చూస్తే మరణ వీలునామా అమలు అంత ఈజీ కాదని…. దీన్ని అన్ని కోణాల్లోనూ ఆలోచన చేయాల్సి ఉందన్నారు. వైద్య శాస్త్రం రోజురోజుకు ఎంతో అభివృద్ధి చెందుతోందని…. ఈ నేపథ్యంలో ఎప్పుడో రాసిన వీలునామా బట్టి అనారోగ్యం సమయంలో నిర్ణయాలు తీసుకోవడం సరికాదేమోనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నేడు నయం కాదనుకున్న వ్యాధిని బాగు చేసే వ్యవస్థ భవిష్యత్తులో రావచ్చునేమో అని అన్నారు.

సుప్రీం ధర్మాసనం కూడా…. ఇలాంటి వీలునామాలను అనుమతిస్తే కొందరు బంధువులు దీన్ని అవకాశంగా తీసుకునే వీలుంటుంది కదా అని అనుమానం వ్యక్తం చేసింది.  ఇదో సంక్లిష్టమైన అంశమని….  యాతన లేకుండా ప్రశాంతంగా మరణించాలనుకోవడం 21వ అధికరణ కల్పించిన హక్కు అని…. ఈ అంశంపై ఏం చేయాలో చూద్దామంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణకు వాయిదా వేసింది.