My title

ఆజ్యం పోసేలా అఖిలప్రియ ప్రకటన..

నంద్యాల టీడీపీలో వివాదం సద్దుమణిగేలా లేదు. నంద్యాల టికెట్‌ ఇవ్వకపోతే పార్టీ వీడేందుకు కూడా శిల్పామోహన్ రెడ్డి సిద్ధమవగా ఆయన్ను చంద్రబాబు, అచ్చెన్నాయుడులు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు శిల్పా మోహన్ రెడ్డితో చంద్రబాబు అండ్ టీం చర్చలు జరుపుతున్న సమయంలోనూ మంత్రి భూమా అఖిలప్రియ వివాదానికి ఆజ్యంపోసేలా ప్రకటన చేశారు.

నంద్యాల టికెట్ విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మాట వరుసకైనా చెప్పాల్సిన మంత్రి అఖిలప్రియ… ఏకంగా టికెట్ తమ కుటుంబానికే వస్తుందని ప్రకటించారు. విజయవాడ భవానీ ద్వీపాన్ని పరిశీలించేందుకు వచ్చిన అఖిల ప్రియ అక్కడే మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు ఉప ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేయాలన్న విషయాన్ని ఈనెల 24న శోభానాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా తమ కుటుంబమే ఒక నిర్ణయం తీసుకుని అభ్యర్థి పేరును ప్రకటిస్తామని వెల్లడించారు. తమ కుటుంబానికి టికెట్ ఇస్తే శిల్పామోహన్ రెడ్డి పార్టీ వీడుతారన్నది కేవలం ప్రచారం మాత్రమేనని తేల్చేశారు. అయితే ఒకవైపు సీఎంతో చర్చలు జరుగుతుండగానే మంత్రి భూమా అఖిలప్రియ ఏకపక్షంగా నంద్యాల ఉప ఎన్నికల్లో తమ కుటుంబసభ్యుడే పోటీ చేస్తారని ప్రకటించడంతో శిల్పా మోహన్ రెడ్డి వర్గం మరింత ఆగ్రహంగా ఉంది.

పరిస్థితి చూస్తుంటే నంద్యాల టికెట్ తమ నేతకు కేటాయించేలా లేరని.. ఏదో విధంగా మభ్యపెట్టేందుకే చర్చలు జరుపుతున్నారని శిల్పా అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శిల్పామోహన్ రెడ్డి ఈనెల 21న వైసీపీలో చేరుతారని మీడియాలో పెద్దెత్తున కథనాలు వచ్చాయి. దీంతో ఉలిక్కిపడిన చంద్రబాబు … శిల్పాతో చర్చలు జరుపుతున్నారు. ఇంతలోనే అఖిలప్రియ ఏకపక్షంగా ప్రకటన చేయడంతో టీడీపీ నేతలు తలలుపట్టుకుంటున్నారు.