My title

అమ్మ‌కానికి చిత్తూరు డైరీ

ప‌త‌నావ‌స్థ‌కు చేరుకున్న చిత్తూరు డైరీని వ‌దిలించుకోవాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణయించుకుంది. డైరీని అమ్మ‌కానికి పెట్టింది. అమ్మ‌కం ద్వారా వ‌చ్చే డ‌బ్బుల‌తో బాకీల‌ను తీర్చాల‌ని అధికారుల‌కు నిర్దేశించింది. వీలైనంత త్వ‌ర‌గా అమ్మ‌కం ప్ర‌క్రియ‌ను ముగించాల‌ని సూచించింది. ఈ సంస్థ‌కు చెందిన పూర్తి వివ‌రాల‌ను త‌మ‌కు అందించాల‌ని డిస్ట్రిక్ట్ కో ఆప‌రేటివ్ ఆఫీస‌ర్‌ ను ప్ర‌భుత్వం ఆదేశించింది.

చిత్తూరు డైరీ మొత్తం విలువ భూమితో స‌హా 250 కోట్ల వ‌ర‌కూ ఉంటుంది. వివిధ ఆర్ధిక సంస్థ‌ల నుంచి తీసుకున్న అప్పులు దాదాపుగా 150 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. అప్పులు తీసుకువ‌చ్చి ఉద్యోగుల జీతాలు చెల్లించే ప‌రిస్థితి ఉండేది. ఈ సంస్థ‌ను పున‌రుద్ధ‌రించ‌డం దాదాపు అసాధ్యం అని భావించిన ప్ర‌భుత్వం మూసివేయ‌డానికే మొగ్గుచూపింది. వీలైనంత తొంద‌రగా అమ్మాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని ప్ర‌తిప‌క్షాలు వ్య‌తిరేకిస్తున్నాయి. చాలా మంది రైతులు కూడా ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌డుతున్నారు.

డైరీ పత‌నానికి కార‌ణాలు

చిత్తూరు కోప‌రేటివ్ డైరీ రెండు ద‌శాబ్దాల క్రితమే త‌న ప్రాధాన్య‌త‌ను కోల్పోయింది. పనికిరాని స్థితికి చేరుకుంది. కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల స్వార్ధ ప్ర‌యాజ‌నాల కార‌ణంగా డైరీకి ఈ దుస్థితి దాపురించింది. పాల సేక‌ర‌ణే ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా ఉన్న 18 వేల మంది స‌న్న చిన్న‌కారు రైతులు ఈ డైరీపై ఆధార‌ప‌డి జీవించేవారు. 1945లో ఏర్పాటైన ఈ డైరీ 2002 ఆగ‌స్టు 30 నాటికి పూర్తిగా సేవ‌లు అందించ‌లేని స్థితికి చేరుకుంది. ఈ డైరీకి అనుబంధంగా న‌డుస్తున్న చిల్లింగ్ సెంట‌ర్లు కూడా మూత‌ప‌డ్డాయి. పీలేరు, మ‌ద‌న‌ప‌ల్లి, పిచాతూరు, వి కోటా ప్రాంతాలలో ఉన్న ఈ సెంట‌ర్లు త‌మ ప‌నుల‌ను ఆపివేశాయి.

చిత్తూరు గాంధీ ఆందోళ‌న‌

ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం కొంద‌రు రైతు నాయ‌కుల‌కు ఆగ్ర‌హం క‌లిగించింది. చిత్తూరు గాంధీగా ప్ర‌సిద్ధి చెందిన వెంక‌టాచలం నాయుడు ఆధ్వ‌ర్యంలో వీరంతా ఆందోళ‌న‌కు దిగారు. చిత్తూరు డైరీని పున‌రుద్ధరించాల‌ని వారు ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రైతుల ప్ర‌యోజ‌నాల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌భుత్వం ఏదైనా నిర్ణ‌యం తీసుకుంటే టిడిపి ప్ర‌భుత్వానికి బుద్ధి చెబుతామ‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. మ‌రోవైపు డిస్ట్రిక్ కోప‌రేటివ్ ఆఫీస‌ర్ ల‌క్ష్మి ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని మ‌రోసారి వారికి వివ‌రించారు. అయితే చంద్రబాబు తమ సంస్థ హెరిటేజ్ కోసమే ఈ చిత్తూరు కోపరేటివ్ డైరీని ఒక పథకం ప్రకారం దివాలా తీయించారని పాడి రైతులు మండిపడుతున్నారు.