My title

సృష్టికర్త ఎవరు?

బుద్ధుడు సృష్టికర్త అయిన దేవుని స్థానంలో నీతికి స్థానం కల్పించాడు. దేవుడే ఉన్నట్లయితే, దేవుడే ఈ లోకాన్ని సృష్టించి ఉంటే… హంతకులను, దొంగలను, నీతి నిజాయితీలేని వాళ్ళను, నీచులను, అబద్ధాలకోరులను, దురాశాపరులను ఎందుకు సృష్టించాడు? ఇలాంటి వాళ్ళను ఆయనే సృష్టించి ఉంటే అలాంటి దేవునివల్ల ప్రయోజనం ఏమిటి?

ఈ లోకంలో తను సృష్టించినవారు ఎన్నో బాధలకు గురవుతుంటే దేవుడు ఏం చేస్తున్నట్లు? లోకంలో ఇంత అన్యాయం ఎలా ఉన్నట్లు? సత్యం, న్యాయం ఎందుకు ఓడిపోతున్నాయి? దేవుడు ఈ ప్రపంచాన్ని ఎందుకు ప్రక్షాళన చేయలేకపోతున్నాడు? దుర్మార్గాలను ఎందుకు రూపుమాపలేకపోతున్నాడు?

దేవుడు సర్వశక్తిసంపన్నుడే అయితే, లోకంలో మంచికి, చెడుకు తానే కారకుడు అయితే ఆయన తప్పక పాప కళంకితుడై ఉండాలి.

అయినా ఇంతవరకు దేవుణ్ణి ఎవరూ చూడనప్పుడు, దేవుని గురించి ఖచ్చితమైన పరిజ్ఞానం ఎవరికీ లేనప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మేందుకు ఆధారమేమిటి? అని పండితుల్ని బుద్ధుడు ప్రశ్నించేవాడు. పండితులతో వాదోపవాదాల సమయంలో కూడా బుద్ధుడు వీలైనంత వరకు దేవుని గురించి మాట్లాడేవాడు కాదు. ఎవరైనా దేవుని గురించి ప్రస్తావించినా మౌనంగా ఉండేవాడు. ఎందుకంటే బుద్ధుని దృష్టిలో దేవుడు ఉన్నాడా? లేడా అనేది ముఖ్యమైన విషయం కాదు. దేవుడే ఈ సమస్త సృష్టిని సృష్టించాడా లేదా అనేదీ ముఖ్యం కాదు.

ఏదో ఒక దాని నుంచి దేవుడీ విశ్వాన్ని సృజించాడనుకున్నట్లయితే, సృష్టికి ముందే ఏదో ఒకటివుండి ఉన్నట్లయితే దేవుడే ఈ సృష్టికి మూలకారకుడని భావించేందుకు వీలులేదు. ఎందుకంటే తాను సృష్టించకపూర్వమే ఏదో ఒకటి ఉంది కాబట్టి. దేవుడు ఈ సృష్టి ప్రారంభించకముందే మరొకటేదో సృష్టించబడి ఉన్నప్పుడు దేవుడే ఈ సృష్టికి కారకుడని చెప్పడానికి వీలులేదు. అందుకే దేవుడిని ఒక అభూత కల్పనగా బుద్ధుడు భావించాడు.

దేవుడున్నాడా? లేడా అనే మీమాంసపై కాలం వృథాచేయడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు.

(పొనుగోటి కృష్ణా రెడ్డి “బుద్ధుడు – బౌద్ధధర్మం” పుస్తకం నుంచి)

Leave a Reply

Your email address will not be published.

14 − 10 =