My title

‘స్పైడర్’ మూవీ రివ్యూ

రివ్యూ: స్పైడర్

రేటింగ్‌: 2.5/5

తారాగణం: మహేష్‌ బాబు, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, భరత్‌, ఎస్‌.జె.సూర్య, తదిత‌రులు

సంగీతం: హారిస్ జైరాజ్

నిర్మాత:  ఎన్‌.వి. ప్రసాద్‌, టాగూర్‌ మధు, మంజుల స్వరూప్‌

దర్శకత్వం: ఏఆర్‌ మురగదాస్‌

అనగనగా ఒక మంచివాడైన హీరో. ఊరిలో ఎవరికి ఏ సమస్య వచ్చినా వాళ్ళు కోరకుండానే వచ్చి తీర్చి వారి అభిమానాన్ని చూరగొంటూ ఉంటాడు. అదే ఊరిలో ఒక విలన్. జనాన్ని భయపెట్టి వాళ్ళను చంపి ఆనందించే శాడిస్టు. హీరో వీడిని పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కాని విలన్ అంత సులువుగా దొరుకుతాడా. దాగుడు మూతల ఆట స్టార్ట్ అవుతుంది. చివరికి హీరో విజయం సాధిస్తాడు. అదేంటి ఎప్పుడో పాత ఎన్టీఆర్ కాలంనాటి కథ చెప్పి స్పైడర్ రివ్యూ అని హెడ్డింగ్ పెట్టారని ఫీల్ అవుతున్నారా. ముందుగా స్టొరీ చెప్పి మిగిలిన భాగంలోకి వెళ్దామని ఇలా స్టార్ట్ చేసాం. ఎస్. మీ అనుమానం నిజమే. స్పైడర్ కథ అచ్చంగా ఇదే. కాకపోతే డెవలప్ అయిన టెక్నాలజీని వాడారు. అంతే తేడా.

మహేష్ మూస కథల నుంచి బయటికి రావాలని గట్టిగా డిసైడ్ చేసుకుని మరీ స్పైడర్ మూవీ ఒప్పుకున్నాడు. పైగా హీరోలు అదే పనిగా అతనితో కలిసి వర్క్ చేయాలనీ ఆశపడే దర్శకుడు మురుగదాస్ కాబట్టి కథ గురించి ప్రిన్స్ పెద్దగా ఆలోచించినట్టు కనిపించదు. పైన చెప్పిన కథ చదువుకుంటే మీకే నిజం అనిపిస్తుంది. నగరంలో పౌరులను అకారణంగా చంపుతున్న విలన్ ను పట్టుకునే పని మీద హీరో తన తెలివి తేటలు అన్ని వాడుతూ ఉంటాడు. కాని విలన్ ఇతని కన్నా బలవంతుడు, తెగించిన వాడు కావడంతో ఇద్దరి మధ్య అంతర్గత యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఒక శుభ ముహూర్తంలో విలన్ పట్టుబడతాడు. కాని సరిగ్గా క్లైమాక్స్ ముందు తప్పించుకుని సినిమాటిక్ స్టైల్ లో ఒక ధ్వంస రచన చేసి అమయకుల ప్రాణాలు తీసి హీరో చేతిలో చనిపోతాడు. మహేష్ కి ఈ కథ కొత్తగా అనిపించడానికి కారణం బహుశా తనను ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా చూపించడం కావొచ్చు. కాని అక్కడే మహేష్ మిగిలిన విషయాల పట్ల నిర్లక్ష్యం వహించడం తేడా కొట్టేలా చేసింది.

మహేష్ బాగా చేసాడు. అందులో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. హంతకుడిని పట్టుకోవాలనే ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే చించేసాడు. ఆ లెవల్ కు ఏ మాత్రం తగ్గకుండా విలన్ గా నటించిన ఎస్ జె సూర్య కూడా సై అంటే సై అనేలా పోటీ పడి నటించి తానెందుకు పవన్ కళ్యాణ్ సినిమా వదులుకుని మరీ స్పైడర్ సినిమా చేయాల్సి వచ్చింది అని తన టాలెంట్ తో తెరమీద చూపిస్తాడు. సూర్య రియల్లీ ఫెంటాస్టిక్. అతనికి తగిన పాత్రలు డిజైన్ చేస్తే మరో మంచి విలన్ సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ కు దొరికినట్టే. మహేష్, సూర్య మాత్రమే తెరమీద కనిపిస్తారు. మిగిలిన వాళ్ళ నెంబర్ పెద్దగానే ఉంది కాని వాళ్ళంతా పొలం గట్టు మీద దిష్టి బొమ్మల్లా అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటారు. మహేష్  ఆ మధ్య ఆడియో ఫంక్షన్ లో హీరొయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి మర్చిపోయి తిరిగి వచ్చి మైక్ అందుకున్న వైనం అందరం లైవ్ లో చూసాం. సినిమాలో తన పాత్ర చూస్తే ఆ మాత్రం కామెంట్ చేయటం కూడా వృధా అనిపిస్తుంది.

మురుగదాస్ ఫస్ట్ టైం తెలుగులో చిరంజీవితో స్టాలిన్ అనే సినిమా చేసారు. కమర్షియల్ ఎలెమెంట్స్ పుష్కలంగా ఉన్నా దృష్టి మొత్తం హీరోయిజంపై పెట్టడంతో సినిమా ఫ్లాప్ అయ్యింది. కాని స్పైడర్ లో ఆ పొరపాటు చేయలేదు కాని ఫోకస్ మొత్తం ఈ సారి విలన్ మీద పెట్టడంతో రెండు పాత్రల్లో ఒకటే మనకు కనెక్ట్ అవుతుంది. అంత పెద్ద నగరంలో ఒకే ఒక్కడు అంత విద్వంసానికి పాల్పడుతుంటే పోలీసులు ఏనాడూ పట్టించుకోకపోవడం, సిటీని కాపాడే బాధ్యత  మొత్తం హీరో తన భుజాలపై వేసుకోవడం కొంచెం లాజిక్ కి దూరంగా ఉంది. స్పైడర్ సినిమాలో అచ్చెరువొందే యాక్షన్ ఫైట్స్ ఉన్నాయి. కాని వాటితో మాస్, క్లాస్ తేడా లేకుండా అందరిని మెప్పించే విధంగా బలమైన ఎమోషనల్ సీన్స్ రాసుకోలేదు మురుగదాస్. పైగా ఫస్ట్ హాఫ్ లో విలన్ కు పది నిమిషాల ఫ్లాష్ బ్యాక్ పెట్టడం కూడా అనవసరం అనిపిస్తుంది. దీన్ని బట్టి విలన్ పాత్రనే దాస్ ఎక్కువ ఇష్టపడ్డాడు అనే ఫీలింగ్ ఎవరికైనా కలుగుతుంది. పైగా ఆ ఎపిసోడ్ మొత్తం అచ్చ తమిళ సాంబార్ వాసన కొట్టడం కూడా మైనస్ గా మారింది.

రకుల్ ప్రీత్ సింగ్ ను పేరు గొప్ప ఊరు దిబ్బ  లాగా వాడుకోగా వినడానికే యావరేజ్ గా అనిపించిన హారిస్ జైరాజ్ పాటలు విజువల్ గా కూడా బోర్ కొట్టిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ పరంగా కొంత వరకు బెటర్ అనిపిస్తాడు కాని ట్యూన్స్ లో మాత్రం మునుపటి మేజిక్ పూర్తిగా పోగొట్టుకున్నాడు హారిస్. మాటలు కూడా చాలా సాదాసీదాగా ఉన్నాయి. ఏవో ఒకటి రెండు తప్ప మిగిలినవన్నీ డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ ఇస్తాయి. మహేష్ అనే సమ్మోహన శక్తి, ఎస్ జె సూర్య అనే నటుడు లేకపోతే స్పైడర్ ఒక మామూలు సగటు సినిమా కన్నా తక్కువ స్థాయిలో ఉండేది. ఈ ఇద్దరే సినిమాను దాదాపుగా కాపాడుకున్నారు. మురుగదాస్ నుంచి ఇలాంటి రొటీన్ యాక్షన్ థ్రిల్లర్ రావడం ఆశ్చర్యం. తన ప్రతి సినిమాలో ఏదో ఒక మెసేజ్ ఇస్తూ కమర్షియల్ గా ఏది మిస్ కాకుండా చూసుకునే మురుగదాస్ ఒత్తిడికి లోనై స్పైడర్ ని ఇలా తయారు చేసాడా? అర్థం కాదు.

చివరిగా చెప్పాలంటే స్పైడర్ స్టైలిష్ గా అనిపించే ఒక మామూలు కాప్ అండ్ క్రిమినల్ చేజ్ స్టొరీ. అబ్బురపరిచే మలుపులు, అద్భుతం అనిపించే సన్నివేశాలు ఏవి లేకపోవడంతో సినిమా చూసి బయటికి వచ్చాక ఏదో వెలితితోనే సినిమా గురించి ఆలోచిస్తూ ఇంటికి చేరుకుంటాం. సంతోష్ శివన్ కెమెరా కన్ను చూస్తున్నంత సేపు విసుగు రాకుండా చేసింది.