My title

ఎస్పీల బ‌దిలీల వెనుక ఆ కోణం ఉందా?

న‌ల్గొండ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక వ‌స్తుంద‌ని ప్ర‌చారం న‌డుస్తోంది. ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి త‌న ఎంపీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తార‌ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ద‌స‌రా న‌వ‌రాత్రులు  ప్రారంభ‌మైన త‌ర్వాత ఆయ‌న రాజీనామా చేస్తార‌ని ఒక లెవ‌ల్లో పుకారు షికారు చేస్తోంది.  ఉప ఎన్నికకు అన్ని ర‌కాలుగా టీఆర్ఎస్ సిద్ధ‌మ‌వుతోంది అని అన‌డానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అని మ‌రికొంద‌రు చెబుతున్నారు. రెండు రోజుల కింద‌ట ఐదు జిల్లాల ఎస్పీలను బ‌దిలీ చేశారు. నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల ఎస్పీల బదిలీల్లో ఇద్దరి పోస్టింగ్‌ ఈ కోవకు చెందినదేనని పోలీసు శాఖలో గుసగుసలు విన్పిస్తున్నాయి.

ఉప ఎన్నిక కోసం ఈ జిల్లా ఎస్పీల‌ను ఆగ‌మేఘాల మీద బ‌దిలీ చేశార‌ని కొంద‌రు వివ‌రిస్తున్నారు. త‌మ‌కు అనుకూలంగా ఉండే పోలీసు బాసుల‌కు న‌ల్గొండ‌, సూర్యాపేట పోస్టుల‌ను ఇచ్చార‌ని కొంద‌రు చెబుతున్నారు. మ‌రోవైపు త్వ‌ర‌లోనే డిఎస్పీ, సీఐ, ఎస్ఐల‌ను కూడా బ‌దిలీ చేస్తార‌ని టాక్ న‌డుస్తోంది. మొత్తానికి  వచ్చే ఉప‌ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జిల్లాల్లో తమకు అనుకూలమైన పోలీసు అధికారులను నియమిస్తున్నార‌ని తెలుస్తోంది. డీఎస్పీలు మొదలుకుని ఎస్పీల వరకు అస్మదీయులు ఎవరు, తస్మదీయులు ఎవరనే కోణంలోనే ఇప్ప‌టికే స‌మాచారం సేక‌రించిన‌ట్లు తెలిసింది. నంద్యాలలో చంద్ర‌బాబు చూపిన‌ పోల్‌ మేనేజ్‌మెంట్‌ను ఇక్క‌డ కేసీఆర్ కూడా ఫాలో అవుతున్నార‌ని కొంద‌రు అంటున్నారు. అందుకే పోలీసుశాఖలో త‌మ‌కు అనుకూల‌మైన వారిని నియ‌మిస్తున్నార‌ని చెబుతున్నారు.