My title

కేరళ సామాజిక పరిణామాన్ని అక్షరబద్ధం చేసిన తఖజి శివశంకర పిళ్లే

తఖజి శివశంకర పిళ్లే (17-04-1912 – 10-04-1999) రాసిన ప్రేమ కథ చమీన్ (రొయ్యలు) నవల ఇంగ్లీషులోకి అనువదించకుండా ఉంటే మలయాళ సాహిత్యం గురించి బాహ్య ప్రపంచానికి తెలిసి ఉండేది కాదేమో. ఆయన తన మాతృ భాష మలయాళంలో విస్తారంగా రాశారు. ఆయన 40 నవలలు, 600 కథల్లో కేరళ సమాజంలో వచ్చిన సామాజిక పరిణామ క్రమాన్ని చిత్రించారు. కులాల చట్రంలో చిక్కుకున్న పేద, అణగారిన వర్గాల జీవిత చిత్రణకే తఖజి రచనలన్నీ ఉపకరించాయి. మానవ సంబంధాలలో అనూహ్యమైన నాటకీయ పరిణామాలను తఖజి అక్షరబద్ధం చేశారు. అణగారిన వర్గాల వారి కథ చెప్పేటప్పుడు చారిత్రక కోణాలను విడమర్చడం ఆయన ప్రత్యేకత.

శివశంకర పిళ్లే చిన్నతనంలో రాత్రి భోజనాల తర్వాత ఆయన తండ్రి కుటుంబ సభ్యులందరికీ రామాయణ, మహాభారత గాథలు, పురాణ కథలు వినిపించే వారు. ఈ ప్రభావం వల్లే తఖజీకి సాహిత్యంపై అభిరుచి పెరిగి రచయిత అయ్యారు. ఒక మోస్తరు వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పాఠశాలలో ఉన్నప్పుడు ప్రధానోపాధ్యాయుడు కైనిక్కర కుమార పిళ్లే సాహిత్యాభిరుచికి పదును పెట్టే భారతీయ సాహిత్యం గురించి తఖజికి తెలియజెప్పారు. ఆ తర్వాత న్యాయవాద విద్య అభ్యసిస్తున్నప్పుడు కేసరి ఎ. బాలకృష్ణ పిళ్లేతో పరిచయం వల్ల ఆధునిక యూరప్ సాహిత్యంతో పరిచయం అయింది. టాల్ స్టాయ్, గైడీ మపాసా రచనలు తఖజిని బాగా ఆకర్షించాయి. ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే ఆయనకు రాయడం మీద శ్రద్ధ కుదిరింది. న్యాయవాద వృత్తిలో ఉన్నా ఆ పని మీద ఆయనకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. పత్రికా రచయితగా కూడా ఉన్నారు. కొంత కాలం తర్వాత పూర్తి కాలం రచయితగానే స్థిరపడ్డారు.  

తఖజి సాహిత్యంలో అణగారిన వర్గాల వారి జీవిత చిత్రణకే ప్రాధాన్యం ఇచ్చినా ప్రేమ కథ అయిన చమీన్ నవలే అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే అందులోనూ ప్రధాన పాత్రలు జాలర్ల గాథలకే పరిమితం. కాని మారుతున్న పరిణామ క్రమంలో జాలర్లు డబ్బుకు ఆశపడి తమ కుల కట్టుబాట్లను అతిక్రమించడం, అణగారిన వర్గాలకు చెందిన యువతి వ్యాపార కుటుంబానికి చెందిన యువకుడితో ప్రేమలో పడడం ఇతివృత్తంగా సాగిన చమీన్ నవలలో ఆర్థిక సంబంధాలు మానవ సంబంధాలలో తెచ్చే మార్పులను విడమరుస్తుంది. ఈ నవలలోని చెంబెన్ పాత్ర తన గతాన్ని విస్మరించి డబ్బు కోసం దోపిడీదార్లతో కుమ్మక్కైన విధానాన్ని చిత్రించడం ద్వారా ఆర్థిక సంబంధాలు తీసుకొచ్చే మార్పులను తెలియజేశారు. విషాదాంత ప్రేమ కథ చమీన్ నవలే  తఖజికి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్ఠలు తెచ్చి పెట్టింది. ఈ నవలకు 1958లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. చమీన్ నవల ఆధారంగా 1965లో అదే పేరుతో సినిమా వచ్చింది. రండిదంగజి, అనుభవంగళ్ పలిచకల్ నవలలు కూడా వెండి తెరకెక్కాయి. చమీన్ నవల 19 విదేశీ భాషలలోకి అనువాదమైంది. 15 దేశాలలో ఈ నవల అధారంగా సినిమాలు వచ్చాయి.

కాని అంతకు ముందే 1947లో వెలువడిన తొట్టియుదె మకన్ (పాకీ వాడి కొడుకు) నవల ద్వారా వాస్తవికతకు పట్టం కట్టారు. పాకీ పని చేసే వ్యక్తి మూడు తరాల కథను ఈ నవల చిత్రిస్తుంది. కుల వ్యవస్థను నిలదీయడం ఈ నవలలో ప్రధానాంశం. వృత్తి కులం ఆధారంగా ఎందుకు ఉండాలని ఈ నవల ద్వారా ప్రశ్నిస్తారు. రండిదంగజి (1948) ఫ్యూడల్ వ్యవస్థను ప్రశ్నిస్తుంది. తన కొడుకు పాకీ పని చేయకూడదన్న తండ్రి కల నెరవేరక పోవడం అదే వృత్తిలోకి దిగిన కొడుకును చూసి తండ్రి దిగులుపడిన తీరు ఈ నవలలో కనిపిస్తాయి.

చమీన్ నవల తఖజికి ఎక్కువ ప్రచారం తెచ్చిపెట్టినా ఆయన నవలల్లోకెల్లా మహత్తరమైంది కాయర్. వెయ్యి పేజీలకు పైన ఉన్న ఈ నవలలో వందలాది పాత్రలు ఉన్నాయి. అది నాలుగు తరాల కథ. ఇది 1885 నుంచి 1971 మధ్య ఫ్యూడలిజం, మాతృస్వామ్య సమాజం, కట్టుబానిస విధానం మొదలైన అంశాల పరిణామక్రమాన్ని వివరిస్తుంది. కాయర్ నవలలో 250 ఏళ్ల చరిత్ర కనిపిస్తుంది. తఖజి పేద ప్రజల జీవితాలను మాత్రమే కాకుండా ఎనిప్పడికల్ నవలలో దురాశా పరుడైన ప్రభుత్వధికారి జీవితాన్ని చిత్రించారు. తఖజి సాహిత్యంలో సాధారణంగా కథా ప్రాంతం మారదు. అన్నింట్లోనూ అరేబియా సముద్రం ఒడ్డున తఖజి గ్రామంలో వరిపొలాలు, పంటకోతలప్పుడు జరిపే పండగలు, జానపద గీతాలు, నృత్యాలు, నిరక్ష్యరాస్యులైన ప్రజల మూఢ నమ్మకాలు, వారిని దోపిడీ చేసే వారి తీరు మొదలైనవే ఉంటాయి. కాని ఇతివృత్తంలో అపారమైన వైవిధ్యం ఉంటుంది.  

తఖజి మ్యూజియం

న్యాయ వాదిగా ఉన్నప్పుడు అనుకోకుండా 1940ల నాటి భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలించడం వల్లే తఖజి కాయర్ నవల రాయడానికి ప్రేరణ.

శివశంకర పిళ్లేకు కేరళలో సోషలిస్టు ఉద్యమంతో సంబంధం ఉండేది. ప్రపంచ చరిత్రలోనే మొట్ట మొదటి సారి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతిలో 1960లలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. కమ్యూనిస్టు ఉద్యమం ప్రభావం తన మీద ఏమీ లేదని తఖజి అనే వారు. కాని మార్క్సిజం అధ్యయనం వల్లే తన సామాజిక చైతన్యం నిర్దిష్టమైన రూపుదిద్దుకుందని అంగీకరించారు.

తఖజి స్మృతి మండపం

తఖజి స్మృత్యర్థం ఆయన నివసించిన ఇల్లు శంకర మంగళం ను ఆయన మరణించిన ఏడాది తర్వాత కేరళ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని మ్యూజియంగా తీర్చి దిద్దింది. 75 ఏళ్ల కింద నిర్మించిన ఆ ఇంట్లో విశాలమైన హాలు, గదులు, వంట గది, వరండా ఉన్నాయి. ఆయనకు వచ్చిన బహుమతులు, ప్రశంసా పత్రాలు, ఆయన వాడిన వస్తువులు భద్రపరిచారు. జ్ఞాన పీఠ్ అవార్డు ప్రజలు చూడడానికి అనువుగా ప్రదర్శించడం దేశంలోకెల్లా ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఆయన అందుకున్న పద్మ భూషణ్, కేరళ ప్రభుత్వం ఇచ్చిన అవార్డు, ఆయన పుస్తకాలు, అనువాదమైన ఆయన రచనలు, కేరళ, ఎం.జి. విశ్వవిద్యాలయాలు ఆయనకు ఇచ్చిన గౌరవ డాక్టరేట్లు కూడా ఈ మ్యూజియంలో ఉన్నాయి. 

(ఏప్రిల్ 17 తఖజి శివశంకర పిళ్లే జయంతి)

-ఆర్వీ రామారావ్