My title

సొంత‌కుంప‌టి దిశ‌గా శ‌ర‌ద్‌యాద‌వ్‌      

బీహార్ రాజ‌కీయాల్లో మ‌రో మ‌లుపు ఖాయంగా క‌నిపిస్తోంది. చీలిక దిశ‌గా పాట్నా బాణం దూసుకెళ్తోంది. జేడీయూ సీనియ‌ర్ నేత శ‌ర‌ద్‌యాద‌వ్‌..  ఆ పార్టీకి గుడ్‌బైచెప్పే యోచ‌న‌లో ఉన్నారు. సీఎం నితీష్‌కి షాకిచ్చి సొంత‌కుంప‌టి పెట్టుకోవాల‌ని భావిస్తున్నారు. నితీష్‌, శ‌ర‌ద్‌యాద‌వ్‌ల మ‌ధ్య పెరుగుతున్న గ్యాప్‌.. పార్టీని చీల్చే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.
శ‌ర‌ద్‌యాద‌వ్.. త‌న అనుచ‌రులు, మ‌ద్ద‌తుదారుల‌తో  క‌లిసి సొంత‌పార్టీ పెట్టాల‌ని భావిస్తున్నారు. తాజాగా గుజ‌రాత్ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో గెలుపొందిన అహ్మ‌ద్‌ప‌టేల్‌కు ట్విట‌ర్‌లో  శ‌ర‌ద్‌యాద‌వ్ అభినంద‌న‌లు తెలిపారు. ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొని విజ‌యం సాధించారంటూ కొనియాడారు. జేడీయూలో ఉండికూడా.. ప‌రోక్షంగా బీజేపీపై విమ‌ర్శ‌లుగుప్పించారు. కాంగ్రెస్ పార్టీపై ప్ర‌శంస‌లు కురిపించారు. అహ్మ‌ద్‌కు అభినంద‌న‌లు తెల‌ప‌టం ద్వారా.. సొంత పార్టీ దిశ‌గా శ‌ర‌ద్ ముందుడుగు వేశార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
గ‌త నెల‌లో బీహార్ మ‌హాకూట‌మికి సీఎం నితీష్‌కుమార్ గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్‌, ఆర్జేడీకి క‌టీఫ్ చెప్పి.. మ‌ళ్లీ పాత‌మిత్రుడు మోదీ చెంత‌న చేరిపోయారు. ఐతే నితీష్ నిర్ణ‌యంపై .. సీనియ‌ర్‌నేత శ‌ర‌ద్‌యాద‌వ్ బ‌హిరంగంగానే అభ్యంత‌రం వ్య‌క్తంచేశారు. ఆయ‌న నిర్ణ‌యం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈనేప‌థ్యంలోనే ఇరువురి మ‌ధ్య గ్యాప్ పెరిగింది. దీంతో త్వ‌ర‌లోనే ఆయ‌న కొత్త‌పార్టీ పెడ‌తార‌ని స‌న్నిహితులు కూడా చెబుతున్నారు.