My title

‘శమంతకమణి’ సినిమా రివ్యూ

రివ్యూ: శమంతకమణి

రేటింగ్‌: 2.25 /5

తారాగణం: నారా రోహిత్,   సుధీర్ బాబు, ఆది సాయికుమార్,సందీప్ కిషన్,  ఇంద్రజ,రాజేంద్ర ప్రసాద్,తనికెళ భరణి, జీవా, హేమ, బెనర్జీ,   తదిత‌రులు

సంగీతం:   మణిశర్మ

నిర్మాత:  ఆనంద ప్రసాద్

దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య

ముందునుంచి ఈ సినిమాని మల్టీ స్టారర్ అని ప్రమోట్ చేస్తున్నారు కాని నిజానికి ఇందులో ఉన్నది నలుగురు స్టార్లు కాదు హీరోలు. ఇంకా చెప్పాలంటే యాక్టర్లు. కేవలం తమ పేరు మీదే బిజినెస్ చేసుకునే సీన్ ఈ నలుగురిలో ఒక్కరికి కూడా లేదు. అందుకే ప్రమోషన్ మొదట్లో హీరోల కంటే ఎక్కువగా కారునే చూపించారు. బలమైన మార్కెట్ లేకపోవడం వీక్ పాయింట్ కాబట్టి వినూత్నంగా మార్కెటింగ్ చేసారు.  ప్రేక్షకులు కూడా అందుకు తగ్గట్టే మరీ అతిగా అంచనాలు పెట్టుకోకుండా సినిమాకు వచ్చారు అనేది ఓపెనింగ్స్ కాస్త వీక్ గా ఉండటంలో అర్థమైపోయింది. మరి శమంతకమణి ఈ మోస్తరు అంచనాలు అందుకుని మెరిసిందా లేక వాన వెలిసినట్టు మాసిందా ఓ లుక్ వేయండి

కథగా చెప్పుకుంటే ఇది గొప్ప కథేమి కాదు. పాత వింటేజ్ కారును జనార్ధన్ అనే కోటీశ్వరుడు ఐదు కోట్లు పెట్టి కొంటాడు. అది ఒక బర్త్ డే పార్టీ కి తీసుకెళ్ళిన కొడుకు(సుధీర్ బాబు)పోగొట్టుకుని వస్తాడు. దాని ఇన్వెస్టిగేషన్ లో ఉంటాడు ఒక పోలీస్ ఇన్ స్పెక్టర్(నారా రోహిత్). కారు హోటల్ లో పోయింది అని తెలుసుకున్న అతను అక్కడ సిసి ఫుటేజ్ చూసి అందులో అనుమానంగా కనిపించిన ఒక కాలేజీ స్టూడెంట్(ఆది సాయికుమార్), పల్లెటూరి నుంచి వచ్చిన ఒక నిరుద్యోగి(సందీప్ కిషన్), వయసైపోయిన పెళ్లి కాకుండా పక్కన కూరలమ్మే భామకు(ఇంద్రజ)లైనేసే మెకానిక్  వీళ్ళందరి మీద విచారణ జరుగుతుంది. చివరికి ఎవరు దీనికి బాధ్యులు, కారు ఎవరు దొంగిలించారు, ఎందుకు చేశారు అనేది చివరిలో మాత్రమే బయటపడే శమంతకమణి అసలు రహస్యం.

ఇది థ్రిల్లర్ అని చెప్పారు కాని సినిమా టైటిల్స్ పడక ముందే కథ దేని గురించి అని స్పష్టంగా చెప్పేస్తారు కాబట్టి పెద్దగా సస్పెన్స్ అనిపించదు. కాని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అది ముందే గుర్తించి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తో ఎంగేజ్ చేసే  ప్రయత్నం చేస్తాడు. అందులో కొంతవరకు బాగానే సక్సెస్ అయ్యాడు. కానీ కోటి రెండు కోట్లు చాలా చీప్ అయిపోయిన ప్రెజెంట్ ట్రెండ్. ఐదు కోట్ల కారు పోతే రాష్ట్రం, మీడియా మొత్తం దాని గురించి మాట్లాడుకుంటోంది అనేలా బిల్డప్ ఇవ్వడం అంతగా నప్పలేదు. కాని సినిమాను నీట్ గా తీయటంలో మాత్రం దర్శకుడు ఫెయిల్ కాలేదు. దీన్ని ఇంకా బాగా డెవలప్ చేసి ట్విస్ట్ పెట్టే అవకాశం ఉన్నా శ్రీరామ్ తాను రాసుకున్న పరిమితుల్లోనే సినిమా తీయటం సెకండ్ హాఫ్ లో ఎఫెక్ట్ చూపించింది . సుదీర్ మదర్ సెంటిమెంట్ అంతగా పండలేదు. మరీ ఎక్కువ పాటలు లేకుండా డ్యూయెట్స్ తో విసిగించకుండా స్ట్రెయిట్ గా కథ చెప్పుకుంటూ పోవడం ఒకటే శ్రీరామ్ చేసిన మంచి పని. ఈ సినిమా చూసి బయటికి వచ్చాక పర్వాలేదు అని చెప్పడానికి అదే మెయిన్ రీజన్.

ఇది మరీ ఊహలకు భిన్నంగా జరిగే థ్రిల్లర్ స్టొరీ కాదు. చాలా ఫ్లాట్ నెరేషన్ తో కన్విన్స్ చేసేలా ఉంటుంది. కానీ విలన్ ఎవరై ఉంటారో అనే టెంపో మైంటైన్ చేయటంలో మాత్రం శ్రీరామ్ అంతగా ఆకట్టుకోడు. ఎవరా అని ఆలోచించే పని కూడా బుర్రకు పెట్టడు. ఫస్ట్ హాఫ్ దాకా బాగానే లాక్కొచ్చిన శ్రీరామ్ ఆదిత్య సెకండ్ హాఫ్ మొదలు కాగానే విచారణ పేరుతో ఒక్కొక్క పాత్రతో ఏం జరిగింది అని చెప్పించే ఎపిసోడ్ మొత్తం రిపీట్ మోడ్ లో వెళ్తూ కొంత అసహనానికి గురి చేస్తుంది. కాని క్లైమాక్స్ పావు గంట పరిగెత్తించి హ్యాపీ ఎండింగ్ ఇచ్చి ఓకే అనిపించి ఇంటికి పంపిస్తాడు. ఈ సినిమాకి మరో ముఖ్యమైన హీరో మణిశర్మ. తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాను పది మెట్లు పైకి తీసుకెళ్ళాడు. కొన్ని జీవం లేని రొటీన్ సీన్స్ కి కూడా మంచి ఎలివేషన్ ఇచ్చాడు. ఉన్న రెండు పాటలు మాత్రం బ్రేక్ సాంగ్స్. సమీర్ కెమెరా బాగుంది. ప్రవీణ్ పూడి తన కత్తెరకు ఇంకా పని చెప్పాల్సి ఉంది. కాని లెంగ్త్ రెండు గంటలే ఉండటం పెద్ద ప్లస్ పాయింట్. భవ్య ప్రొడక్షన్ వేల్యూస్ మీద కంప్లయింట్ లేదు.

నటులలో హీరోలు అందరు బాగా నప్పారు. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అన్నట్టు లేకుండా అందరు బాగా నటించారు. సందీప్ కిషన్ ఊరి నుంచి పారిపోయి వచ్చిన యువకుడిగా బాగా చేసాడు. సుధీర్ బాబు ఇంకా మెరుగుపడాల్సి ఉంది. ఆది సాయి కుమార్ జస్ట్ ఓకే. ఇలాంటి సినిమాలకు తన సీనియారిటీ ఎంత హెల్ప్ అవుతుందో మరో సారి చూపించాడు రాజేంద్ర ప్రసాద్. కానీ దర్శకుడే పూర్తిగా వాడుకోలేదు. ఇంద్రజ అలా అలా అప్పుడప్పుడు కనిపిస్తుంది. గ్లామర్ అలాగే మైంటైన్ చేయటం మెచ్చుకోవాల్సిన విషయం. సుమన్ విలన్ గా బాగున్నాడు. భరణి, జీవా, హేమ, బెనర్జీ అందరు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే పాత్రలు. ఎవరిని వేస్ట్ చేయకుండా బాగానే వాడుకున్నాడు శ్రీరామ్.

చివరిగా చెప్పాలంటే శమంతకమణి ఆశించినంత రేంజ్ థ్రిల్లర్ మూవీ కాదు. జస్ట్ ఒక సరదా టైం పాస్ కామెడీ ఎంటర్ టైనర్ అంతే. మరీ పరిగెత్తకపోయే కథనం లేకపోయినా చూస్తున్నంత సేపు విసిగించకుండా బాగానే మేనేజ్ చేశాడు దర్శకుడు.

-ప్రజ్ఞా