My title

కథ లేదు… హీరో లేడు… 50 లక్షలు అడ్వాన్స్

మాయా ప్రపంచం టాలీవుడ్ లో ఏదైనా సాధ్యమే. ఒక్క హిట్ వస్తే చాలు కోట్లు అలా వచ్చిపడతాయి. దర్శకుడు సందీప్ వంగ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. అర్జున్ రెడ్డి సూపర్ హిట్ తో పండగ చేసుకుంటున్నాడు ఈ దర్శకుడు. తన నెక్ట్స్ సినిమాగా ఇప్పటివరకు ఏ కథ ఫిక్స్ చేయలేదు. ఏ హీరోను అనుకోలేదు. అయితేనేం.. 50లక్షల రూపాయలు అడ్వాన్స్ గా అందాయి. హిట్ మహత్యం అంటే ఇదే.

అర్జున్ రెడ్డి సక్సెస్ తో సందీప్ రెడ్డితో సినిమా చేసేందుకు చాలా నిర్మాణ సంస్థలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అయితే వీటిలో అందరికంటే ముందుంది మైత్రీ మూవీస్. టాలెంట్ ను ఒడిసిపట్టుకోవడంలో, కాంబినేషన్లు క్రియేట్ చేయడంలో తమకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న ఈ బ్యానర్.. సందీప్ వంగ చేతిలో 50లక్షలు పెట్టింది. మంచి కథ పట్టుకొని వస్తే హీరోను తామే సెట్ చేస్తామని హామీ ఇచ్చింది.

ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, నితిన్ లాంటి హీరోల కాల్షీట్లు ఉన్నాయి. సందీప్ వంగ కనుక మంచి కథ సెట్ చేసుకోగలిగితే… అతడికి స్టార్ హీరోతో పాటు భారీ పారితోషికం కూడా దక్కడం ఖాయం.