My title

సినిమాపాటను కమ్యూనిజం బాట పట్టించిన సాహిర్ లుధియాన్వి

సినిమా పాటలు రాసే వారికి తమ ప్రాపంచిక దృక్పథాన్ని జొప్పించే అవకాశం తక్కువే కావొచ్చు. సినిమా పాటలు రాయడం కోసం తమ సాహిత్య విలువలను వదులుకున్న వారు ఎంతో మంది. కాని సాహిర్ లుధియాన్వి (8-3-1921 – 25-10-1980) సినిమా రంగంలో ఒక వెలుగు వెలగడమే కాదు ఆ రచనలకు కూడా ఉత్తమ సాహిత్య స్థాయి కల్పించాడు. ఆయన రాసినపాటలన్నింటిలోను సాంద్రమైన కవిత్వమే కనిపిస్తుంది. ఆయన ప్రాపంచిక దృక్పథమైన కమ్యూనిస్టు సిద్ధాంత ఛాయలు అంతర్నిహితంగా ఉంటాయి.

సాహిర్ లుధియాన్వీ అసలు పేరు అబ్దుల్ హయీ. సాహిర్ అంటే మాంత్రికుడని అర్థం. ఆయన మాటల మాంత్రికుడు మాత్రమే కాదు తాను నమ్మిన సిద్ధాంతాన్ని సినిమా పాటల్లో పలికించగలిగిన దిట్ట. ఆయన ఉర్దూ, హిందీ భాషల్లో రాశారు. ఆయన రచనా శైలి బాలీఉడ్ పై చెరగని ముద్ర వేసింది. తాజ్ మహల్ (1963), కభీ కభీ సినిమాల కోసం రాసిన పాటలకు రెండు సార్లు ఫిలిం ఫేర్ అవార్డు దక్కించుకున్నాడు.

సాహిర్ పంజాబ్ లోని లుధియానాలో జాగీర్దార్ల కుటుంబంలో జన్మించాడు. కాని ఆ సదుపాయాలేవీ దక్కని జీవితం. ఆయన తల్లి సర్దార్ బేగం సాహిర్ తండ్రి ఫజల్ మహమ్మద్ కు నాల్గవ భార్య. ఫజల్ మహమ్మద్ కు అనేక మంది భార్యలున్నా సంతానం మాత్రం సాహిర్ ఒక్కడే. సాహిర్ కు ఎనిమిదేళ్లు ఉండగానే తల్లీ తండ్రి విడిపోయారు. సాహిర్ తల్లి దగ్గరే అర్థిక ఇబ్బందుల మధ్య పెరిగాడు. తల్లి అనుభవించిన కష్టాలు గమనించినందువల్ల మహిళలను ఇబ్బంది పెట్టే వారిని ఈసడించే తత్వం అలవడింది.  కొడుకును తీసుకెళ్లడం కోసం తండ్రి అనేక ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.

22 ఏళ్ల వయసులో సాహిర్ లాహోర్ లో స్థిరపడదామనుకున్నాడు. తల్లిదండ్రుల జగడాలు, దేశ వ్బజన కారణంగా పాకిస్తాన్ లో కొన్నాళ్లు, భారత్ లో కొన్నాళ్లు గడపాల్సి వచ్చింది. కాని దేశ విభజన తర్వాత ఏర్పడిన పాకిస్తాన్ సాహిర్ అంచనాలకు విరుద్ధంగా ఉన్నందువల్ల 1949లో దిల్లీ తిరిగి వచ్చాడు. పాకిస్తాన్ లో ఆయనకు హిందూ, సిక్కు మిత్రులు లేకపోవడం కూడా సాహిర్ తిరుగు టపాలో భారత్ తిరిగి రావడానికి ఒక కారణం. ఇస్లామిక్ పాకిస్తాన్ లో కాకుండా సెక్యులర్ భారత దేశంలో ఉండాలన్నది ఆయన కోరిక. దిల్లీలో రెండు నెలలు ఉండి బొంబాయి బయలు దేరారు. అక్కడే స్థిరపడ్డారు. కవి, సినీ గేయ రచయిత గుల్జార్, ఉర్దూ సాహిత్య వేత్త కిషన్ చందర్ పొరుగున సాహిర్ బొంబాయి పరిసర ప్రాంతాలలోని అంధేరీలో ఉన్నారు. ఇల్లు కట్టుకుని దానికి తన కావ్యం అయిన పరఛాయియా అన్న పేరు పెట్టారు.

సాహిర్ అణగారిన వర్గాల వారి తరఫున నిలబడిన కవి. అప్పుల బాధలో నలిగిపోతున్న రైతు, ఎవరి తరఫుననో యుద్ధానికి వెళ్తున్న సైనికుడు, ఒళ్లమ్ముకోక తప్పని మహిళ, ఉపాధి లేక విసుగు చెందిన యువత, రోడ్డు మీదే బతుకు వెళ్లదీయాల్సి వచ్చిన కుటుంబాలు సాహిర్ పాటలకు, కవితలకు ప్రధాన వస్తువులైనాయి. ప్యాసా సినిమాలో సాహిర్ పాటలు పండిత్ నెహ్రూను చలింప చేశాయి.

కళాకారుడిగా సాహిర్ వ్యక్తిత్వం, స్వభావం వివాదాస్పదమైనవే. సినిమాలకు పాటలు రాస్తున్నప్పుడు తాని రాసిన పాటకు బాణీ కట్టాలి తప్ప బాణీకి పాట రాయను అని భీష్మించే వారు. నేపథ్య గాయకులకన్నా పాటలు రాసినందుకు తనకు కనీసం ఒక్క రూపాయి అన్నా ఎక్కువ ఇవ్వాలనే వారు. అందుకే లతా మంగేష్కర్ తో ఆయనకు విభేదాలు తలెత్తాయి. ఆకాశవాణిలో సినిమా పాటలు ప్రసారం చేసేటప్పుడు గేయ రచయిత పేరు కూడా ప్రకటించాలని వాదించి విజయం సాధించారు.

మిగతా కవుల్లాగా సాహిర్ భగవంతుడిని, అందాన్ని, మద్యాన్ని కీర్తించలేదు. ఆయన సమాజంలో పతనమవుతున్న విలువల గురించి, యుద్ధం గురించి, రాజకీయాల గురించి, వస్తువినిమయ తత్వం గురించి రాశారు. సాహిర్ కవిత్వంలో మేధావితనం కనిపించేది. ఈ విషయంలో ఆయన ఫైజ్ అహమద్ ఫైజ్ లాంటి తత్వం గల వ్యక్తి. స్వాతంత్ర్యం వచ్చినందుకు సంతృప్తి చెంది అలసత్వం ప్రదర్శించిన వారిని నిద్ర లేపడానికి తన కలానికి కత్తికున్న పదును పెట్టారు. అందుకే 1940ల నుంచి 1960ల దాకా ఉన్న తరాన్ని ఆయన కవిత్వం, సినిమాపాటలు ఉర్రూతలూగించాయి.

మతాధిపతులమని చెప్పుకునే వారిని, స్వార్థపరులైన రాజకీయ నాయకులను, దోపిడీకి మారుపేరైన పెట్టుబడిదార్లను, యుద్ధోన్మాదంతో విర్ర వీగే అగ్ర రాజ్యాలను తూర్పార పట్టే వారు. సాహిర్ కొంత కాలం పత్రికా సంపాదకుడిగా కూడా పని చేశారు. అదబ్-ఎ-లతీప్, షహకార్, ప్రిత్లారి, సవేరా పత్రికలకు సంపాదకులుగా ఉన్నారు. సవేరా పత్రికలో అభ్యుదయ రచయితలను నిర్బంధించడాన్ని దుయ్యబడుతూ ఉత్సాహంగా ఆయన రాసిన రాతలు నచ్చకే పాకిస్తాన్ ప్రభుత్వం అరెస్టు వారెంట్ జారీ చేసింది. అప్పుడే సాహిర్ లాహోర్ నుంచి భారత్ కు తిరిగి వచ్చారు.

పాతికేళ్ల వయసులోనే బెంగాల్ కరువు మీద కహత్-ఎ-బెంగాల్ రాశారు. యువకుడిగా ఉన్నప్పుడు రాసినా అందులో సాహిర్ భావ తీవ్రత, పరిపక్వత స్పష్టంగా కనిపిస్తాయి. ప్రజలు అష్టకష్టాలు పడుతున్న సమయంలో సంపదను ప్రదర్శించే విధంగా ప్రవర్తించే వారిని ఈసడిస్తూ సుబా-ఎ-నవ్ రోజ్ రాశారు.

సమాజం పట్ల తనకు ఉన్న నిబద్ధతను చాటుకోవడానికే సాహిర్ కవిత్వాన్ని వాహికగా వాడుకున్నాడు. అందుకే యశ్ చోప్రా నిర్మించిన దాగ్ చిత్రంలో “జబ్ భీ జీ చాహే నయీ దునియా బసా లేతే హై లోగ్/ఏక్ చహరే పే కయీ చహరే లగా లేతే హై లోగ్” అనే సాహసం చేయగలిగాడు. దేశ విభజన సమయంలో మతవిద్వేషం రెచ్చగొట్టిన వారిని దుయ్యబడుతూ “మాలిక్ నె ఇన్సాన్ కొ ఇన్సాన్ బనాయా/ హం నె ఉసే హిందూ యా ముసల్మాన్ బనాయా” అనగలిగిన సాహసం చూపాడు. సినీ ప్రపంచ వెలుగుజిలుగుల డొల్ల తనాన్ని “ఇన్సాన్ కా నహీ కహీ నామ్-ఒ-నిషాన్…యే హై బొంబై మేరీ జాన్” అని వ్యంగ్యంగా దెప్పిపొడవగలిగాడు. ఆయన సినిమా పాటలు, కవిత్వం హృదయం లోతుల్లోంచి పెల్లుబికిన భావాలే. సమాజంలోని రుగ్మతలను ఎత్తి చూపినప్పుడు ఆయన కవిత్వం ఆదర్శ రాజకీయాల అంచులకు చేరుస్తుంది. సామాజికాంశాలను ప్రస్తావించేటప్పుడు ఆయన పాటలు, కవితలు అపారమైన ఆశావాదాన్ని విరజిమ్ముతాయి. కాని ప్రేమ గురించి రాసినప్పుడు మాత్రం ఆ పదాలన్నీ చీకటి, నిరాశ, దుఃఖాన్నే ప్రతిఫలిస్తాయి. వ్యక్తిగత జీవితంలో ఆయన ప్రేమ పెళ్లి అనే తీరానికి చేరకపోవడం, మూగ ప్రేమకు పరిమితం అయి పోవడం, ప్రెమను వ్యక్తం చేసే తత్వం లేకపోవడం దీనికి కారణం కావొచ్చు.

సినీ గేయ రచయితగా ఆయన కీర్తి పతాక రెపరెపలాడుతున్న సమయంలోనూ ఆయన కవితా విపంచి పలుకుతూనే ఉంది. పర్ఛాయియా, ఆవో కి కోయి ఖాబ్ బనే, గాతా జాయే బంజారా అన్నా ఆయన కవితా సంపుటాలు బాగా ఆదరణ పొందాయి.

సాహిర్ కు నెహ్రూ అంటే అభిమానం. నెహ్రూ అనుసరించిన సెక్యులర్ విధానం అంటే ఇష్టం. నెహ్రూ మరణం తర్వాత సాహిర్ ఇలా రాశారు…

ఈ లోకాన్ని విడిచిపోతే  పోయినట్టే అనుకోలేం

శరీరం శిథిలమైతే మనిషి పోయినట్టు భావించలేం

గుండె సడి వినపడకపోతే సంకల్పాలు సడలవు

పెదాలు మూసుకున్నంతమాత్రాన అన్న మాటలు వినపడవా!

శ్వాస ఆగినంతమాత్రాన స్ఫూర్తి ఆగిపోతుందా

ఈ లోకాన్ని విడిచిపోతే  పోయినట్టే అనుకోలేం.

సాహిర్ నెహ్రూ సెక్యులర్ విధానాలను అభిమానించారు. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలను విమర్శించడాన్ని నెహ్రూ ప్రోత్సహించే వారు. సహించే వారు. సాహిర్ సరిగ్గా అదే పని చేశాడు. “జిన్హే నాజ్ హై హింద్ పర్ ఓ కహా హై” (ఏరీ ఆ దేశ భక్తులు) అని ప్రశ్నించ గలిగాడు. చేసిన వాగ్దానాలు ఆచరణలో కనిపించనందుకు నిలదీశాడు.

తాజ్ మహల్ అందరి దృష్టిలో మహా సుందరమైన కట్టడం, ప్రేమకు చిహ్నం. అయినా సాహిర్ మాత్రం అలా చూడలేదు. “ప్రేయసీ ఎక్కడైనా కలుసుకో కాని తాజ్ మహల్ దగ్గర మాత్రం కాదు” అని లోక విరుద్ధమైన భావన వ్యక్తం చేయగలిగిన ధీరత్వం సాహిర్ సొంతం. తాజ్ మహల్ పై అయన అభిప్రాయాలు వివాదాలకు దారి తీశాయి.

ఏక్ షహన్షా నె దౌలత్ కా సహారా లేకర్

హమ్ గరీబోంకి మొహబ్బత్ కా ఉడాయా హై మజాక్ అనగలిగాడు. అందుకే తాజ్ మహల్ ఆయనకు అందంగా కనిపించలేదు. తాజ్ మహల్ కు ‘రాళ్లెత్తిన కూలీల’ శ్రమ సౌందర్యమే ఆయనకు అందమైందిగా తోచింది. రాచరికానికి, ప్రేమకు పొసగదన్నది సాహిర్ అభిప్రాయం. అందమైన హార్మ్యాలు నిర్మించిన కూలీలు నడిచిన దారి రక్తసిక్తం కావడం మీదే ఆయన దృష్టి నిలిపాడు. సాహిర్ కవిత్వంలో విప్లవ భావాలే కాదు అనేక మంది వ్యక్తం చేసే భావాలు నచ్చకపోతే కుండ బద్ధలు కొట్టినట్టు చెప్పే తత్వం ఉండేది. సాహిర్ నీళ్లు నమిలే రకం కాదు. భావొద్వేగాలను అనవసరంగా ఉదాత్తీకరించడు. తన భావాలను సూటిగా, స్పష్టంగా, అరమరికలకు తావు లేకుండా వ్యక్తం చేస్తాడు. సాహిర్ మీద తల్లి ప్రభావం ఎక్కువ. ఆమె అనుభవించిన కష్టాలే స్త్రీల పై ఆయన సానుభూతిని పెంచాయి. “ఔరత్ నే జనమ్ దియా మర్దోంకో/మర్దో నే ఉసే బాజార్ దియా” అనడంలో మహిళలపట్ల ఆయన అభిప్రాయం ప్రస్ఫుటం అవుతుంది.

సాహిర్ చాలా ప్రేమాస్పదుడు. ఆయన జీవితంలో అనేక మంది మహిళలు ఉన్నా, వారితో సన్నిహితంగా మెలగినా ఎవరినీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. కళాశాలలో చదువుతున్నప్పుడు ఈశ్వర్ కౌర్ తో ప్రేమలో పడ్డాడు. ఒక రోజు ఇద్దరూ కలిసి కళాశాల ప్రినిసిపల్ లాన్ లో కూర్చుని మాట్లాడుకుంటున్నందుకు సాహిర్ ను కళాశాల నుంచి గెంటేశారు. ఈశ్వర్ కౌర్ కు జబ్బు చేసి మరణించడంతో ఆ ప్రేమ కథకు అక్కడితో తెర పడింది.

ఆ తర్వాత ప్రసిద్ధ రచయిత్రి, ప్రముఖ ఉర్దూ కవయిత్రులలో మొదటి వరసలో నిలిచిన అమృతా ప్రీతంతో సన్నిహితంగా మెలిగారు. అమృతా ప్రీతం కు చిన్ననాటే ప్రీతంతో పెళ్లి కుదిరింది. ఆ పెళ్లి చివరిదాకా నిలవలేదు. ఒక కవి సమ్మేళనంలో సాహిర్ కు అమృతా ప్రీతంకు మధ్య మొదలైన పరిచయం అనురాగంగా అనలు తొడిగింది. వారిద్దరి ప్రేమ విచిత్రమైంది. సాహిర్ ఎన్నడూ తన ప్రేమను వ్యక్త్రం చేసే వారు కాదు కనక భగ్న ప్రేమ అనీ అనలేం. ఇద్దరూ గంటల తరబడి ఒకే చోటా ఉన్నా చాలా వరకు మాటలు లేకుండానే గడిచిపోయేది. అమృతా ప్రీతం ఇంటి దగ్గరకు వచ్చి మూల మీద నిలబడి సిగరెట్ కాలుస్తూనో, సోడా తాగుతూనో గంటల తరబడి నిలబడి వెళ్లిపోయే వాడు. ఇద్దరూ కూర్చుని ఊన్న సమయాల్లో సంభాషణలకన్నా మౌనంగా పరస్పర ఆరాధనా భావమే ఎక్కువ. సాహిర్ వెళ్లిపోయిన తర్వాత అమృతా ప్రీతం సాహిర్ కాల్చి పారేసిన సిగరెట్ పీకలను కాల్చేది. అలా ఆమెకు సిగరెట్ కాల్చడం అలవాటైంది. ఆ సిగరెట్ పొగల్లో సాహిర్ ను ఊహించుకునేది. చాలా రోజుల తర్వాత సాహిర్- అమృతా ప్రీతం మళ్లీ కలుసుకున్నారు. కాని అప్పుడు అమృత కవి, కళాకారుడు ఇమ్రోజ్ తో పాటు వచ్చారు. సాహిర్ “మెహ్ ఫిల్ సే ఉఠ్ జానే వాలో/ తుమ్ లోగోం పర్ క్యా ఇల్జామ్/ తుమ్ అబాద్ ఘరోంకె వాసి/ మై ఆవారా ఔర్ బద్నాం” అన్న కవిత్వ పాదాలు రాశారు. సాహిర్ లాహోర్ లో ఉన్నప్పుడు ఇద్దరూ రాసుకున్న ప్రేమలేఖలలో కవిత్వంతో వంతెన కట్టారు. కాని ఇద్దరూ వంతెనకు చెరో వైపు ఉండి పోయారు. ఆ తర్వాత నటి, గాయని అయిన సుధా మల్హోత్రాతో ప్రేమ కూడా పెళ్లికి దారి తీయలేదు. సాహిర్ పెళ్లి కాకుండానే ఉండి పోయారు.

సాహిర్ ప్రేమ కవిత్వం సినిమాల్లోనూ ఇతరత్రా కూడా రాశారు. కాని అదంతా విషాదాత్మకమైందే. ప్రేమ కన్నా ముఖ్యమైన ఇతర విషయాలు ఉన్నాయన్నది సాహిర్ భావన కావొచ్చు. సాహిర్ తన కవితాశక్తిని కాసుల కోసం సినిమా వాణిజ్య ప్రయోజనాలకోసం తాకట్టు పెట్టలేదు. సినిమా రంగం కోసం తన కవిత్వాన్ని పలచన చేయలేదు. జనాకర్షణ కోసం కవిత్వ ప్రయోజనాన్ని దిగజార్చకపోవడం ఆయన నిబద్ధతకు రుజువు. ఆయన ధోరణికి సినిమారంగం అలవాటు పడింది, సర్దుకుంది. సామాజిక న్యాయం, సత్యం కోసమే తన ప్రతిభను సినీ గీతాల రచనలకు వినియోగించాడు. “వర్తమాన సామాజిక, రాజకీయ అంశాలకు సాధ్యమైనంత చేరువ చేయడానికి సినీ గేయాలను వినియోగించాను” అని ఆయనే చెప్పుకున్నారు. ఇఖ్బాల్ తరానా ఎ హింద్ ‘ చిరస్మరణీయమైందే. కాని వాస్తవ పరిస్థితులకు అనువుగా ఫిర్ సుభాహ్ హోగీ (1958) చిత్రంలో “చీన్ ఓ అరబ్ హమారా/హిందుస్థాన్ హమారా/ రహనేకో ఘర్ నహీ హై/ సారా జహా హమారా” అని వ్యంగ్య బాణాలు విసర గలిగారు.

సాహిర్ అభ్యుదయ రచయితల సంఘంలో ఉన్నారు. అభ్యుదయోద్యమ వ్యాప్తికోసం కృషి చేశారు. అభ్యుదయ రచయితల సంఘం కమ్యూనిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ఉపకరించింది. అభ్యుదయ రచయితల సంఘంతో సంబంధం ఉన్నందువల్లే ఆయన విప్లవ కవిగా నిలబడ్డారు.

సాహిర్ స్మృతిని చిరస్థాయిగా నిలిపే స్మారక చిహ్నం ఆయన జన్మించిన లుధియానాలో కూడా లేదు. ఆయన ఇంటి మీద ఓ ఫలకం మాత్రం ఉంది. కాని ఆయనను బహిష్కరించిన లుధియానాలోని సతీశ్ చందర్ ధావన్ కళాశాలలో ఒక సభా మందిరానికి ఆయన పేరు పెట్టారు. జుహూ ముస్లిం శ్మశాన వాటికలో ఆయన సమాధిని ఇతర సమాధులకు స్థానం కల్పించడానికి 2010లో తవ్వేశారు.  2013 మార్చి ఎనిమిదవ తేదీన ఆయన 92వ జన్మ దిన సందర్భంగా స్మారక తపాలా బిళ్ల విడుదలైంది.

-ఆర్వీ రామారావ్