My title

లేదు! ఇప్పుడే చెప్పాలి…. చంద్రబాబు ఎత్తుకు రేవంత్ పైఎత్తు

టీఆర్‌ఎస్‌తో పొత్తుకు చంద్రబాబు సిద్ధమవుతుండడంతో రేవంత్ రెడ్డి తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఒకవేళ చంద్రబాబు టీఆర్‌ఎస్‌తో దోస్తీకి సై అంటే తాను పార్టీ వీడేందుకు రేవంత్ రెడ్డి దాదాపు నిర్ణయించుకున్నారు. ఒక ప్రముఖ పత్రిక కథనం ప్రకారం… రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణలోని పలువురు కీలక నేతలు ఆయనతో పాటు పార్టీ వీడనున్నారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందని మోత్కుపల్లి, ఎల్‌ రమణ చెప్పిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి అప్రమత్తమయ్యారు.

తన సన్నిహితుల వద్ద రేవంత్ రెడ్డి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు ప్రముఖ పత్రిక కథనం. తెలంగాణలో ఆస్తులు, ఆర్థిక పరమైన అంశాల కోసం ఆంధ్రాకు చెందిన టీడీపీ నేతలు టీఆర్‌ఎస్‌తో కలిసేందుకు లాబీయింగ్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఒక నిర్ధారణకు వచ్చారు. దీనిపైనే ఆయన ఆగ్రహంగా ఉన్నారు. ఆస్తులు కాపాడుకునేందుకు టీడీపీకి అనుకూలంగా ఉన్న ఒక సామాజికవర్గం ఓటర్లను తెలంగాణలో టీఆర్‌ఎస్ వైపు మళ్లించే కుట్రను సహించబోనని రేవంత్ చెప్పినట్టు కథనం.

టీఆర్‌ఎస్‌తో పొత్తు అంటే ఎట్టిపరిస్థితిలోనూ అంగీకరించేది లేదని తేల్చేసిన రేవంత్ రెడ్డి…. జనవరి నుంచి భవిష్యత్తు కార్యాచరణ అమలుకు నేతలతో చర్చలు జరుపుతున్నారు. టీడీపీ, టీఆర్‌ఎస్‌ కలిస్తే రేవంత్ రెడ్డి తన అనుకూల నాయకులతో కలిసి కాంగ్రెస్‌లోకి వెళ్లి ఎంఐఎం, వామపక్షాలతో కలిసి కేసీఆర్‌ను ఎదుర్కోవాలని భావిస్తున్నారు. ఈ విషయం తెలిసే చంద్రబాబు హఠాత్తుగా పయ్యావుల కేశవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు లీకులిచ్చారని భావిస్తున్నారు. పొత్తుపై ఇప్పుడే మాట్లాడితే రేవంత్ రెడ్డి అండ్ టీం పార్టీని వీడడం ఖాయమని…. దాని వల్ల ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతోనే పొత్తుల అంశాన్ని ఎన్నికల సమయంలో తేలుస్తామంటూ చంద్రబాబు దాటవేసినట్టు రేవంత్ రెడ్డి వర్గం అనుమానం వ్యక్తం చేస్తోంది.

ఎన్నికల వరకు పొత్తులపై తేల్చకుండా తీరా ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలన్నది టీడీపీ నాయకత్వం ఆలోచనగా వారు అంచనా వేస్తున్నారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందని ఇప్పుడే చెబితే రేవంత్ రెడ్డి బయటకు వెళ్లిపోయి…. సొంతంగా ప్రణాళికలు రచించుకునేందుకు అవకాశం ఉంటుందని, ఆ అవకాశం ఇవ్వకూడదనే చంద్రబాబు పొత్తులపై దాటేసినట్టు భావిస్తున్నారు. అయితే తాను మరో దారి చూసుకునేందుకు అవకాశం లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు టీఆర్‌ఎస్‌తో పొత్తు అంశాన్ని ఎన్నికల సమయానికి వాయిదా వేసినట్టు రేవంత్ రెడ్డి కూడా గ్రహించారు. అందుకే టీఆర్ఎస్‌తో పొత్తు అంశాన్ని ఇప్పుడే తేల్చాలని ఆయన పట్టుపడుతున్నారు. ఒకవేళ టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందని సంకేతాలు ఇస్తే రేవంత్ రెడ్డి పార్టీ వీడడం లాంచనమే. అయితే ఇలాంటి రాజకీయాల్లో పండిపోయిన చంద్రబాబు… టీఆర్‌ఎస్‌తో పొత్తు ప్రసక్తే లేదంటూ రేవంత్ రెడ్డిని మభ్యపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుమానిస్తున్నారు.