My title

రేవంత్‌కి డ‌బుల్ ఆఫ‌ర్‌?

తెలంగాణ తెలుగుదేశంలో పొత్తుల లొల్లి ఇప్ప‌ట్లో ఆగేట‌ట్లు లేదు. గురువారం జ‌రిగే పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో ఇదే అంశంపై ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగే అవ‌కాశ‌మున్న‌ట్లు తెలుస్తోంది. చంద్ర‌బాబు ఈ స‌మావేశానికి హాజ‌రుకానుండడంతో ఈ విష‌యంపై క్లారిటీ కోసం త‌మ్ముళ్లు ప‌ట్టుబ‌ట్టే చాన్స్ ఉంది. మ‌రోవైపు వ‌ర్కంగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ర‌మ‌ణ‌లు పొత్తుల విష‌యంపై త‌లోదారిలో ఉన్నారు. ఒక‌రు బాబు చెప్పిన‌ట్లు న‌డుస్తుంటే…. మ‌రొక‌రు తన రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై బెంగ పెట్టుకున్నారు.

అయితే రేవంత్‌కు ఇప్పుడు డ‌బుల్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు కొన‌సాగితే ఏం చేయాలి?  లేక ఇత‌ర పార్టీల‌తో పొత్తు కుదిరితే ఏం చేయాలి? అనేది ఆయ‌న ఆలోచించుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఏపీ, తెలంగాణ‌లో బీజేపీతో పొత్తు కొన‌సాగితే…. టీడీపీకి ఇక్క‌డ 40 సీట్లు మాత్ర‌మే ఇచ్చేందుకు బీజేపీ రెడీగా ఉంద‌ట‌. ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి కూడా బీజేపీ వారే తీసుకుంటారు. ఈ ప్ర‌తిపాద‌న‌కు ఓకే అయితే బీజేపీ వాళ్లను ఎలాగో ఒక‌లా ఒప్పించ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది.

ఇటు టీఆర్ఎస్‌తో వెళితే ఒక ఎంపీ సీటు ఇస్తే ఇస్తారు. అదీ ఖమ్మం. ఎమ్మెల్యే సీట్లు 10 నుంచి 15 వ‌ర‌కు ఇవ్వొచ్చ‌ని అంటున్నారు. ఈ పొత్తుకు సిద్దం కావాలా? అని తెలంగాణ తెలుగుదేశం నేత‌ల ముందు చంద్ర‌బాబు ఆఫ‌ర్ ఉంచ‌బోతున్న‌ట్లు తెలిసింది. మొత్తానికి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పొత్తుల‌కు సిద్దం కావాల‌ని బాబు మాత్రం సందేశాలు పంపుతున్నారు. కానీ బ‌యటికి మాత్రం పొత్తుల గురించి ఇప్పుడు మాట్లాడొద్దు అని లీకులు పంపిస్తారు. మొత్తానికి వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్థంలో రేవంత్ బ్యాచ్ ఏదో ఒక నిర్ణ‌యం తీసుకునే అవకాశం క‌న్పిస్తోంది. గులాబీతో పొత్తు పొడిస్తే త‌న దారి తాను చూసుకునే వీలు ఉందని ఆయ‌న వ‌ర్గీయులు చెబుతున్నారు.