My title

బాహుబ‌లి నుంచి బుల్లితెర‌కు….. 26 నుంచి రానా టీవీ షో

బాలీవుడ్ ప్ర‌భావ‌మో లేక కొత్త గా ట్రై చేయాల‌న్న ఆస‌క్తో తెలియ‌దు. లేక టెలివిజ‌న్ ఎఫెక్ట్ గ‌మ‌నించారో తెలియదు. టాలీవుడ్ హీరోలు వ‌రుస‌గా బుల్లితెర బాట ప‌ట్టారు. లేటెస్ట్‌గా భ‌ల్లాల‌దేవా రానా కొత్త షోకు హోస్ట్‌గా వ‌స్తున్నాడు. ఫిలింపేర్‌, ఐఫా అవార్డుల‌కు ఇప్ప‌టివ‌ర‌కూ హోస్ట్‌గా ప‌నిచేసిన రానా ఇప్పుడు తొలిసారిగా టీవీషోకు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. నెంబ‌ర్ 1 యారీ అంటూ వీక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.  జెమినీ టీవీ, వ్యూ యాప్‌లో ఈ చాట్ షో  ప్ర‌సారం కాబోతుంది. తొలి ఎపిసోడ్‌లో  సుమంత్, నాగచైతన్య  పాల్గొన్నారు.  ఈమొదటి ఎపిసోడ్ జూన్ 26న ప్రసారం కానుంది. ఇటీవలే అఖిల్ అక్కినేని, రాజమౌళి తనయుడు కార్తికేయ కాంబినేషన్‌లోనూ రెండో ఎపిసోడ్ కూడా షూట్ చేశారు. సినీ ప్రముఖులే ముఖ్య అతిథులుగా సాగే ఈ చాట్ షోతో టీవీ పరిశ్రమలోకి అడుగిడుతున్నాడు రానా.

 మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు వ్యాఖ్యాత‌గా నాగార్జున తెలుగులో ఈ ట్రెండ్ సృష్టించాడు. అప్ప‌టివ‌ర‌కూ బుల్లితెర‌పైకి వ‌చ్చేందుకు హీరోలు సాహసించ‌లేదు. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు స‌క్సెస్‌తో నాగార్జున చాలా ర‌కాలుగా లాభ‌ప‌డ్డాడు. అయితే ఆత‌ర్వాత అదే షోకు హోస్ట్‌గా చిరంజీవి వ‌చ్చారు. ఆయ‌న ఒక సిరీస్ పూర్తి చేశారు. ఇప్పుడు త్వ‌ర‌లో ప్ర‌సారం కాబోయే తెలుగు బిగ్‌బాస్‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నాడు. ఇప్పుడు రానా ఓ షోతో ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. దీంతో మ‌రికొంద‌రు హీరోలు బుల్లితెర బాట ప‌ట్టే అవ‌కాశం క‌న్పిస్తోంది.