My title

సోమిరెడ్డిని లక్ష్మీపార్వతి పక్కన హీరోగా పెడుతా….

రాంగోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్‌ చిత్రంపై టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. వెన్నుపోటు ఘట్టాన్నే ప్రధాన అంశంగా చేసుకుని వర్మ సినిమా తీస్తుండడంతో చిత్రంపై టీడీపీ తీవ్ర విమర్శలకు దిగుతోంది. ఈ కోవలోనే మంత్రి సోమిరెడ్డి తీవ్రంగా స్పందించారు. సినిమాలో హీరోయిన్‌గా లక్ష్మీపార్వతినే పెట్టుకోవాలంటూ వ్యాఖ్యానించారు. వర్మ ఎప్పుడూ వివాదాలతో సంచలనం కావాలనుకుంటారని.. పనీపాట లేని వాళ్లే ఇలా చేస్తారని సోమిరెడ్డి ఫైర్ అయ్యారు. చిత్రంలో ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను వక్రీకరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్‌ చిత్రానికి జగన్ నిర్మాతగా, లక్ష్మీపార్వతి హీరోయిన్‌గా, జబర్ధస్త్ నటులను కో ఆర్టిస్టులుగా పెట్టుకోవాలని సోమిరెడ్డి సలహా ఇచ్చారు. సోమిరెడ్డి వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన వర్మ ట్వీట్టర్లో రిప్లై ఇచ్చారు. సోమిరెడ్డి ఉచిత సలహాలకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. మీరు ఓకే అంటే లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో లక్ష్మీపార్వతి పక్కన మిమ్మల్నే హీరోగా పెట్టుకుంటా అంటూ సోమిరెడ్డిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.

ఎన్టీఆర్‌ జీవిత చరిత్రలో వెన్నుపోటుకు ముందు అంశాలను మాత్రమే చిత్రంగా తీయడం ద్వారా టీడీపీకి బూస్ట్ ఇవ్వాలని బాలకృష్ణ భావించారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్‌ జీవితంలో అసలు ఘట్టమైన వెన్నుపోటు ఎపిసోడ్‌ను వర్మ తెరకెక్కిస్తుండడం టీడీపీ నేతలకు ఇబ్బందిగా మారింది.