My title

రాజు గారి గది 2 మూవీ రివ్యూ

రివ్యూ: రాజు గారి గది 2

రేటింగ్‌:  2.75/5

తారాగణం అక్కికేని నాగార్జున, అక్కినేని సమంత, సీరత్‌ కపూర్‌, వెన్నెల కిషోర్, శకలక శంకర్ తదిత‌రులు

సంగీతం: తమన్

నిర్మాత:  ప్రసాద్‌ వి పొట్లూరి

దర్శకత్వం: ఓంకార్‌

హారర్ సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకులకు మొహం మొత్తడం స్టార్ట్ అయ్యాక చిన్న స్టార్స్ తో తీస్తే లాభం లేదని గుర్తించి ఏకంగా నాగార్జుననే ఒప్పించి ఓంకార్ ‘రాజు గారి గది 2’ తీసాడు. ముందు నుంచి మంచి అంచనాలే క్యారీ చేసిన ఈ మూవీ ఎటువంటి పోటీ లేకుండా విడుదల కావడం ఓపెనింగ్స్ రూపంలో బాగా కలిసి వచ్చింది. పైగా నాగార్జున గత రెండు సినిమాలు కమర్షియల్ గా పెద్దగా వర్క్ అవుట్ కాకపోవడంతో ఫ్యాన్స్ కూడా దీని మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. సమంతా తన ఇంటి కోడలయ్యాక తమ కాంబినేషన్ లో విడుదలైన మొదటి సినిమాగా నాగార్జున కూడా చాలా స్పెషల్ కేర్ తో ప్రమోషన్ కూడా చేసాడు. 

స్టొరీ లైన్ చాలా పాతది. సినిమా చూడకుండా వింటే ఈ మాత్రం దానికా మలయాళం నుంచి ఎత్తుకొచ్చారు అనే కామెంట్ కూడా వస్తుంది.  అనగనగా అమృతా(సమంతా)అనే లా స్టూడెంట్. అన్నిట్లో టాపర్. తన ఎదుగుదల చూడలేక ఈర్ష్యతో తన ఫ్రెండ్(విద్యుల్లత)చేసిన ఒక తప్పుడు పని వల్ల అవమానం భరించలేక అమృతా ఆత్మహత్య చేసుకుంటుంది. తన ఆత్మ ఒక బీచ్ రిసార్ట్ లో ఉంటుంది. ఆ రిసార్ట్ ను కొని బిజినెస్ చేద్దామని వస్తారు ముగ్గురు ఫ్రెండ్స్(ప్రవీణ్, అశ్విన్, వెన్నెల కిషోర్). అక్కడ దెయ్యం ఉందని గుర్తిస్తారు. దాన్ని బయటికి పంపించడానికి రుద్రా(నాగార్జున)ని తీసుకొస్తారు. మరి రుద్రా అమృతా ఆత్మను ఎలా బయటికి పంపించాడు, చివరికి ఏం జరిగింది అనేది రాజు గారి గది 2 అసలు స్టొరీ.

ముందే చెప్పినట్టు కథలో మరీ కొత్తదనం లేదు కాని టేకింగ్ తో ఓంకార్ మొత్తం మ్యానేజ్ చేసాడు. ఫస్ట్ హాఫ్ లో మొదటి అరగంట రెగ్యులర్ హారర్ కామెడీతో విసిగించిన ఓంకార్ రుద్రా పాత్ర ఎంట్రీతో స్పీడ్ అమాంతం పెంచేసి బాగా ఎంగేజ్ చేస్తాడు. అక్కడ నుంచి క్లైమాక్స్ దాకా సినిమా దాదాపు స్లో అవ్వడం ఉండదు. సమంతా ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఎమోషన్స్ మీద నడిపిన ఓంకార్ అక్కడ మెప్పిస్తాడు. కానీ కామెడీకి స్కోప్ ఉన్నా కూడా వీక్ రైటింగ్ వల్ల అది తేలిపోయింది. సినిమా మొత్తం సీరియస్ మోడ్ లోనే ఉంటుంది. శకలక శంకర్, సీనియర్ నరేష్, ప్రవీణ్, వెన్నెల కిషోర్ లను పూర్తిగా వాడుకోలేదు. దృష్టి మొత్తం రుద్రా, అమృతా పాత్రల మీదే ఉంచడంతో ఎంటర్టైన్మెంట్ పూర్తిగా తగ్గిపోయింది. క్లైమాక్స్ బాగా హ్యాండిల్ చేసిన ఓంకార్ కి బ్యాక్ గ్రౌండ్ రూపంలో తమన్ అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చాడు . ఉన్న రెండు పాటలు లేకపోతే ఇంకా బాగుండేది అనే ఫీలింగ్ వస్తుంది.

నాగార్జున యాక్టర్ గా తన అనుభవాన్ని రంగరించి రుద్రా పాత్రను అలవోకగా చేసాడు. క్లోజ్ అప్ షాట్స్ లో వయసు మళ్లడం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. డ్యూయెట్లు, గెంతులు లేకుండా రుద్రా పాత్ర చాలా క్లీన్ గా ఉండటం పెద్ద రిలీఫ్. ఇలాంటి ఎక్స్ పెరిమెంట్స్ నాగ్ కు మాత్రమే సాధ్యం అని మరోసారి రుజువయ్యింది.అమృతా పాత్రలో సమంతా కెరీర్ బెస్ట్ అనలేం కాని గుర్తుండిపోయే పాత్రే చేసింది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో మంచి ఎమోషన్స్ పండించింది. కాని మరీ సీరియస్ గా ఇంకే ఎమోషన్స్ లేకుండా ఆ పాత్ర ఉండటం ఫాన్స్ కి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. మిగిలినవాళ్ళ గురించి చెప్పుకోవడానికి ఏమి లేదు. వెన్నెల కిషోర్ కొంచెం బెటర్. ప్రవీణ్ ఓకే. అశ్విన్ ఇంకా నటన బేసిక్స్ లోనే ఉన్నాడు. సీనియర్ నరేష్ ను ఉపయోగించుకున్నది  లేదు. శకలక శంకర్ రొటీన్ అనిపిస్తాడు. రావు రమేష్ పాత్ర కొత్తది కాదు కాని డీసెంట్ గా చాలా చక్కగా ఉంది. విద్యుల్లత రామన్ నెగటివ్ పాత్రలో షాక్ ఇస్తుంది.

రాజు గారి గది 2 డీసెంట్ హారర్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్. ఫస్ట్ పార్ట్ అంత థ్రిల్స్ ఇందులో లేవు కాని నాగార్జున, సమంతా, తమన్ ఈ ముగ్గురు సినిమా స్టాండర్డ్స్ ని చాలా ఎత్తుకు తీసుకెళ్ళి డీసెంట్ వాచ్ గా నిలబెట్టారు. ఇక్కడ ఏ చిన్న తేడా వచ్చినా రాజు గారి గది 2 ఒక మామూలు హారర్ మూవీగా మిగిలిపోయేది. ఓంకార్ అలా జరగకుండా సాధ్యమైనంత వరకు కాపాడే ప్రయత్నం చేసాడు. పూర్తిగా నిరాశ పరిచే అవకాశం లేదు కాబట్టి తనలో టెక్నీషియన్ పాస్ అయినట్టే. కాని పూర్తి క్రెడిట్ తనకు దక్కదు. ఒరిజినల్ మలయాళం వెర్షన్ ప్రేతంలో సోల్ ని యధాతదంగా వాడుకున్నాడు.