My title

విషాదానికి కార‌ణం వ‌ర్ష‌మే

ముంబైలో ఎల్‌ఫిన్‌స్టోన్ రైల్వేస్టేష‌న్ ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జ్ పై విషాదం చోటు చేసుకోవ‌డానికి వ‌ర్ష‌మే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని తేలింది. ప‌శ్చిమరైల్వే చీఫ్ సెక్యూరిటీ ఆఫీస‌ర్ స‌మ‌ర్పించిన నివేదిక ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. తొక్కిస‌లాట‌లో గాయ‌ప‌డి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న 30మంది నుంచి సేక‌రించిన స‌మాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు.

భారీ వ‌ర్షం కుర‌వ‌డం కార‌ణంగా టికెట్ కౌంట‌ర్ల వ‌ద్ద ఉన్న వారు కూడా ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జ్ పైకి చేర‌డంతో అప్ప‌టికే జ‌నాల‌తో నిండిన ఎఫ్ఓబి మ‌రింత ఇరుగ్గా మారి తొక్కిస‌లాట‌కు దారి తీసింద‌ని నివేదిక తెలిపింది. అధిక ల‌గేజీల‌తో వ‌చ్చిన వారు బ్యాలెన్స్ కోల్పోవ‌డం వ‌ల్లే తొక్కిస‌లాట జ‌రిగి ఉండ‌వ‌చ్చ‌ని సెక్యూరిటీ ఆఫీస‌ర్ భావిస్తున్నారు.

బ్రిడ్జ్‌పై షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా ప్ర‌మాదం జ‌రిగింద‌నే విష‌యాన్ని సెక్యూరిటీ ఆఫీస‌ర్ తోసి పుచ్చారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో చాలా మంది చిత్రీక‌రించిన విజువ‌ల్స్ ని కూడా విచార‌ణ సంఘం ప‌రిశీలించింది.

సెప్టెంబ‌ర్ 29 న జ‌రిగిన తొక్కిస‌లాట‌లో 22 మంది చ‌నిపోయారు. ఆ మ‌రుస‌టి రోజు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న మ‌రో వ్య‌క్తి చ‌నిపోయాడు.

విచార‌ణ సంఘం త‌న నివేదిక‌లో ప్ర‌మాద నివార‌ణ‌కు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను కూడా వివ‌రించింది. రైల్వే అధికారుల స‌మ‌న్వ‌యం కోసం సెల్‌ఫోన్ల‌తో పాటు అధునాత‌న వైర్‌లెస్ హ్యాండ్‌సెట్ల‌ను వాడాల‌ని సూచించింది. అద‌నంగా కొన్ని స్టెయిర్ కేసుల‌ను వెంట‌నే ఏర్పాటు చేయాల‌ని కూడా సూచించింది.