My title

ఒక్కరూ మిగిలేలా లేరు…. అమ్మతో క్షమాపణ చెప్పిద్దాం….

నంద్యాల ఉప ఎన్నికల తర్వాత ఏపీలో కాంగ్రెస్‌ మనుగడపై నీలినీడలు అలముకున్నాయి.  నంద్యాలలో 2014 ఎన్నికలతో పోలిస్తే ఓట్ల శాతం మరింత తగ్గిపోయి కేవలం 1340 ఓట్లు మాత్రమే రావడంతో కాంగ్రెస్‌ నేతలు తర్జనభర్జన పడుతున్నారు. ఈనేపథ్యంలో  పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో  సంస్థాగత ఎన్నికలు, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై కాంగ్రెస్‌ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన దిగ్విజయ్‌ సింగ్ ముందే నేతలు తమ అభిప్రాయాలను చాలా గట్టిగా వినిపించారు. ఏపీ కాంగ్రెస్‌లో ఒక్కరూ మిగిలే పరిస్థితి కనిపించడం లేదన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేశారన్న కోపం కాంగ్రెస్‌పై చాలా తీవ్రంగా ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. సోనియా గాంధీని ఏపీకి రప్పించి క్షమాపణ చెప్పించాలని కొందరు నేతలు సూచించగా.. దిగ్విజయ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థులకు హైకమాండ్‌ ఆర్థికసాయం చేయాలని కొందరు డిమాండ్ చేశారు. సమావేశం చాలా  హాట్‌హాట్‌గా సాగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన రఘువీరారెడ్డి .. నంద్యాల, కాకినాడలో జరిగినవి అసలు ఎన్నికలే కాదన్నారు. ఎన్నికలు పూర్తిగా అనైతికంగా జరిగాయన్నారు.