My title

అఖిల్ గొగోయ్‌పై రాజ్ర‌దోహం కేసు

రైతు నాయ‌కుడు, అవినీతి వ్య‌తిరేక ఉద్య‌మ నాయ‌కుడు అఖిల్ గొగోయ్‌పై ప్ర‌భుత్వం తీవ్రంగా స్పందించింది. రాజద్రోహం కేసు న‌మోదు చేసింది. దుస్తులు మార్చుకోవ‌డానికి కూడా అనుమ‌తి ఇవ్వ‌కుండా గొగోయ్‌ను పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. అసోంలో మోరాన్ న‌గ‌రంలో గొగోయ్ చేసిన ప్ర‌సంగం అధికారుల‌కు త‌ప్పుగా తోచింది. అత‌నిపై చ‌ర్య‌లకు ఉప‌క్ర‌మించేలా చేసింది. గొగోయ్ ప్ర‌సంగాలు మ‌త విద్వేషం రెచ్చ‌గొట్టేలా ఉన్నాయ‌ని, ప్ర‌జ‌ల‌ను సాయుధ పోరాటం చేయాల‌ని ప్రేరేపిస్తున్నాడ‌ని అత‌నిపై అభియోగాలు న‌మోదు చేశారు.

బంగ్లాదేశ్ నుంచి వ‌ల‌స‌దారులు అక్ర‌మంగా అసోంలోకి ప్ర‌వేశిస్తే స్థానిక ప్ర‌జ‌లకు ఆయుధాలు చేత ప‌ట్టాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌ని గొగోయ్ ఓ ప్ర‌సంగంలో అన్నాడు. అదే కాకుండా ఇటీవ‌ల కాలంలో గొగోయ్ రాష్ట్ర ప్ర‌భుత్వంపై అనేక విమర్శ‌లు చేశాడు. ఆర్.ఎస్‌.ఎస్ ఎజెండాను రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు జ‌రుపుతుంద‌ని గగోయ్ మండిప‌డ్డాడు. రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజీల‌కు జ‌న్ సంఘ్ నాయ‌కుడు దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ పేరు పెట్టాల‌ని ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని కూడా గొగోయ్ త‌ప్పుబ‌ట్టాడు. దీంతో ప్ర‌భుత్వం అత‌న్ని టార్గెట్ చేసింది. మ‌త విద్వేషం రెచ్చ‌గొడుతున్నాడ‌నే అభియోగం మోపి జైలుకి పంపింది. ఇండియ‌న్ పీన‌ల్ కోడ్ ప్ర‌కారం అత‌నిపై 153, 153ఎ, 120బి, 121, 124ఎ, 109 సెక్ష‌న్ల ప్ర‌కారం కేసు న‌మోదు చేసిన‌ట్లు డిబ్రూగ‌ర్ ఎస్పీ గౌత‌మ్ బోరా తెలిపారు.

అక్ర‌మార్కుల గుండెల్లో గుబులు

అఖిల్ గొగోయ్ అసోంలో అక్ర‌మార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు. అవినీతి నాయ‌కులు, అవినీతి అధికారులపై పోరాటం చేస్తున్నాడు. ల్యాండ్ మాఫియాకు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు చేప‌ట్టాడు. రాష్ట్రంలో డ్యామ్‌ల నిర్మాణంలో జ‌ర‌గుతున్న అవినీతిని వెలికితీశాడు. గొగోయ్ చేస్తున్న పోరాటాల‌కు అన్నాహ‌జారే వంటి వారి నుంచి మ‌ద్ద‌తు కూడా ల‌భించింది.